Image result for వాళ్లు కరుడుగట్టిన నేరస్థులు: సీపీ సజ్జనార్"హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. అనేక కోణాల్లో కేసును విచారించామని.. శాస్త్రీయ ఆధారలతోనే నిందితులు నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. మహమ్మద్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నరేశ్, చింతకుంట చెన్నకేశవులను గత నెల 30న చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. పది రోజుల పాటు పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ ఇచ్చారని తెలిపారు. 4న చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నామన్నారు. విచారణలో వాళ్లు చాలా విషయాలు చెప్పారని.. బాధితురాలిని దహనం చేసిన ప్రాంతంలో ఫోన్ దాచిపెట్టామని చెబితే.. తెల్లవారుజామున నిందితులను తీసుకొచ్చామన్నారు. వాటిని ఇక్కడ పెట్టాం.. అక్కడ పెట్టాం అంటూ.. నలుగురూ కాసేపు సమయం వృథా చేశారన్నారు. అనంతరం పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేయడం ప్రారంభించారన్నారు. కొద్దిసేపటికి ఆరీఫ్, చెన్నకేశవులు.. పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కుని కాల్పులు జరిపారన్నారు. సరెండర్ అవ్వమని ఆదేశించినా వినలేదని పేర్కొన్నారు. వారు కరుడుగట్టిన నేరస్థులని.. వెంటనే పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారన్నారు. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయని.. తర్వాత వెళ్లి చూస్తే నలుగురు చనిపోయి ఉన్నారన్నారు.
తెల్లవారు జామున 5.45 గంటల నుంచి 6.50 మధ్య ఈ ఘటన జరిగిందని సీపీ తెలిపారు. ఆరీఫ్, చెన్నకేశువుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల దాడిలో ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గాయపడ్డారని.. తలకు గాయాలు అయ్యాయన్నారు. తొలుత వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించామని.. అనంతరం కేర్‌లో చికిత్సకు తీసుకు వెళ్లామన్నారు. నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్‌కు తరలించామన్నారు.
(Courtesy Andhrajyothi)