సంచలనాలకే ప్రాధాన్యత ఇస్తోంది
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
‘బిందాస్‌ బోల్‌’ కార్యక్రమంపై స్టే

దిల్లీ: టీవీ మీడియాను నియంత్రించాల్సిన అవసరముందంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా మొత్తం టీఆర్‌పీల చుట్టూ తిరుగుతోందని, అందుకే సంచలనాత్మక వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంది. దానికి స్వీయ నియంత్రణ అయినా ఉండాలని అభిప్రాయపడింది. సుదర్శన్‌ టీవీ రూపొందించిన ‘బిందాస్‌ బోల్‌’ కార్యక్రమానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అధికార వ్యవస్థలోకి జరుగుతున్న ముస్లింల ‘చొరబాటు’ కుట్రను బహిర్గతం చేస్తామంటూ సుదర్శన్‌ టీవీ ‘బిందాస్‌ బోల్‌’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ ఎపిసోడ్ల ప్రారంభానికి ముందు టీవీలో ప్రసారం చేసిన ప్రచార వీడియోలు(ప్రోమోలు) వివాదాస్పదమయ్యాయి. దీని ప్రసారాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీన్ని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ కార్యక్రమం ముస్లింలపై వివక్ష చూపేలా ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం.. మంగళ, బుధ వారాల్లో ప్రసారం చేయబోయే తొలి రెండు ఎపిసోడ్లపై స్టే విధించింది. కేబుల్‌ టీవీ నిబంధనల ప్రకారం.. ఒకరి పరువుకు భంగం కలిగించేలా, అసత్యాలు, అర్ధ సత్యాలతో కూడిన ఊహాజనిత వార్తలను ప్రసారం చేయకూడదని స్పష్టంచేసింది. ఈ సందర్భంగానే టీవీ మీడియా నియంత్రణపై పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘అంతర్జాలాన్ని నియంత్రించడం చాలా కష్టం. కానీ ఎలక్ట్రానిక్‌ మీడియాను నియంత్రించాలి. అయితే ప్రభుత్వాలు దాన్ని సెన్సార్‌ చేయాలని మేం చెప్పడం లేదు. ఎందుకంటే అది వాక్‌స్వాతంత్య్రానికి విరుద్ధమవుతుంది. అయితే స్వీయ నియంత్రణ అవసరం’’ అని పేర్కొంది. దానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బదులిస్తూ ‘‘ఒక విధమైన స్వీయ నియంత్రణ అవసరమే కానీ.. పాత్రికేయ స్వేచ్ఛను కాపాడాలి’’ అని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘‘ ఏ స్వేచ్ఛ సంపూర్ణం కాదు’’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

Courtesy Eenadu