– మహమ్మద్‌ ఖదీర్‌బాబు
కైఫీ ఆజ్మీని చూసే వేళకు ఆమెకు నిశ్చితార్థం అయిపోయింది. హైదరాబాద్‌ ముస్లిం మొహల్లాలలో నిశ్చితార్థం అయిపోవడం అంటే సగం పెళ్లి అయిపోవడంలాంటిది. కాని ఉర్దూలో అన్నట్టు ఈ ‘కంబక్త్‌ ఇష్క్‌’ ఆమెకు కైఫీని చూసిన వెంటనే కలిగి హృదయంలో పెకళింపునకు సాధ్యం కాని రీతిలో మేట వేసింది.

అతడు పద్యం చదవడానికి హైదరాబాద్‌ వచ్చాడు. దూరంగా కూచుని ఉన్న ఆమె జనాన్ని తోసుకొని వచ్చి, స్టేజి ముందున చేరి, అతణ్ణి పదే పదే చూసి, పదే పదే విని, పదే పదే ప్రేమించింది.

‘నేను అతణ్ణే చేసుకుంటాను అబ్బూ’ అంటే అబ్బూకు ఏం చేయాలో తోచలేదు.

అమ్మి మాత్రం చాలా కంగారు పడింది.

‘షౌకత్‌.. షౌకత్‌… ఏమిటి నీ తెగింపు’ అని ఆందోళన పడిపోయింది.

షౌకత్‌ సౌందర్యవతి. ఆ కళ్లు సౌందర్యవంతమైనది. మాట మధురం. చిరునవ్వు నవ్వితే అందులో గోతాలు కొట్టి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవ్వాలి.

‘చూడమ్మా… కవులు కవిత్వం బాగా చెప్పొచ్చు కాని వాళ్లకు పూటకు ఠికానా ఉండదు. అతణ్ణి పెళ్లి చేసుకొని ఇబ్బంది పడతావేమో ఆలోచించు’ అన్నాడు తండ్రి.

అంతటితో ఆగలేదు. షౌకత్‌ను భావుక ప్రపంచంలో నుంచి వాస్తవిక ప్రపంచంలోకి దించడానికి ఆమెను తీసుకొని స్వయంగా ముంబైకి బయలుదేరాడు. అప్పటికి కైఫీ ఆజ్మీ ముంబైలో అసంఘటిత కార్మికుల కోసం పని చేస్తున్నాడు. కమ్యూన్‌లో ఉంటున్నాడు. నాలుగు చాల్స్‌కు ఒక కామన్‌ పాయిఖానా. అదంతా ఆమెకు చూపించాడు.

అయితే మాత్రం అతను కవి కదా. ఉత్త కవినా? జనం కోసం నిలిచిన కవి. ఉత్త జనం కోసం నిలిచిన కవినా? పాలకులపై తెగపడే కవి. ఉత్త పాలకులపై తెగబడే కవినా? పెత్తందార్లను చూసి చూపుడువేలు తీక్షణంగా ఆడించగల కవి. మానవజాతి స్వభావాలలో మగతనం కూడా ఒకటి. కైఫీకి వ్యక్తిగా, కవిగా అది మెండుగా ఉంది.

‘చేసుకుంటాను అబ్బూ’ అని మళ్లీ చెప్పింది ఆమె.

హైదరాబాద్‌ తిరిగి వచ్చిన అబ్బూ ఆ సంగతి నిశ్చితార్థం కుర్రాడికి చెప్తే అతడు ఇంతెత్తుకు లేచాడు. షౌకత్‌ను వదిలే సమస్యే లేదన్నాడు. వదలమంటే చస్తానన్నాడు. దాదాపు అన్నంత పని చేయబోయాడు. అతడి ఆత్మహత్యాయత్నాలకు కూడా వెరవనంత స్థాయిలో షౌకత్‌ కైఫీని ప్రేమించింది. అతడిలోని కవిని ప్రేమించింది. అతడి కవిత్వంలోని సత్యాన్ని ప్రేమించింది. అందులోని విలువను.

ప్రేమను పొందడంలో స్త్రీ సంకల్పం ముందు పురుషుడిది ఎప్పుడూ పేలవమైనది. ఆమె తలుచుకుంది. సాధించింది.

కైఫీ కవిగా కొనసాగడానికి, తనను తాను కోల్పోకుండా కొనసాగడానికి తర్వాత్తర్వాత షౌకత్‌ ఒక ముఖ్యకారణమైంది. షౌకత్‌ది చాలా నిబ్బరమైన ప్రేమ. కైఫీ ఆమె వద్ద సగటు పురుషుడికి మల్లే తప్పులు చెయ్యడం, ప్రేమ పొందేందుకు రక్తంతో లేఖలు రాయడం వంటి బాల్య చేష్టలు, పిచ్చిపనులు చేశాడు.

షౌకత్‌ ప్రేమ తనను తాను చెరిపేసుకునేంత గొప్పది. 1973లో కైఫీకి పక్షవాతం వచ్చింది. అప్పుడాయనకు 54 ఏళ్లు. ఎడమ చేయి, ఎడమ కాలు చచ్చుబడ్డాయి. ఆ తర్వాత ఆయన 30 ఏళ్ల పాటు మల్లెపువ్వులా జీవించాడు. ఆయనకు తన ఎడమచేయి, ఎడమకాలు లేవని గుర్తు లేదు. ఆ శరీరభాగాలలో షౌకత్‌ వచ్చి చేరింది.

చూడండి చిత్రమైన నాటకీయత. ఇది కైఫీ ఆజీ శత జయంతి వత్సరం. మరో నెలలో ఈ సంవత్సరం ముగుస్తుంది. కాని తన వీడ్కోలుకు తన భర్తకు సంబంధించిన ఈ ప్రాసంగికమైన సంవత్సరాన్నే ఆమె ఎంచుకుంది.

కైఫీ వామపక్ష ఉద్యమశీలి. అనారోగ్యం అతని ఎడమవైపు చచ్చుబడేలా చేసినా అతను తన వామపక్ష ధిక్కారాన్ని, సత్యాగ్రహాన్ని తుది శ్వాస వరకూ కోల్పోకుండా బతికాడు.

ఇటువంటి ఆదర్శాన్ని తలిచే యోగ్యతలో అయినా ఇవాళ ఎంతమందిమి ఉన్నాము?

షౌకత్‌ వీడ్కోలు తీసుకున్న ఈ రోజున గొప్ప ప్రేమలు, గొప్ప ఆదర్శాలు, గొప్ప జీవితాలు, గొప్ప ధిక్కారాలు, గొప్ప వ్యక్తిత్వాలు, ఆ గీయబడిన పెద్దపెద్ద గీతలు తలుచుకుని, మన గీత ఎంత ఉందో తరచి చూసుకోగలగాలి. ఒక చిన్న స్వీకరణ అయినా, సమర్ఫణ అయినా ఆ జంటకు గొప్ప నివాళే.

పి.ఎస్‌: గరంహవా నాకు చాలా ఇష్టమైన సినిమా.అందులో షౌకత్‌ నటించారు. ఆమెను కలవకపోయినా మైసూర్‌లో ఆ సినిమా దర్శకుడు ఎం.ఎస్‌.సత్యూతో తీరుబడిగా మాట్లాడటం కరచాలనం చేయడం ఆమెతో జతపడిన జ్ఞాపకం.