– అసంఘటిత రంగంపై నీలినీడలు
– ‘సామాజిక భద్రత’కు దూరంగా 42.2కోట్లమంది కార్మికులు
– ‘ద కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ’ బిల్లులో కొత్తగా ఏమీ లేదు : రాజకీయ విశ్లేషకులు
– పాత చట్టాలను కలిపితే…న్యాయం జరగదు..
– 2040నాటికి ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని చట్టాలు చేయాలని సూచన

అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుడు ఏదైనా రోగం బారిన పడితే వారి కుటుంబం ఏం కావాలి? ప్రమాదవశాత్తు మరణిస్తే…అతడి భార్యాపిల్లల పరిస్థితేంటి? ఆరోగ్య సంక్షోభం(కరోనా వైరస్‌ వ్యాప్తి), ఆర్థిక విపత్తు (ఉపాధి సమస్య) చుట్టిముట్టిన వేళ కార్మికుల పరిస్థితి ఎలా తయారైందో అందరమూ చూస్తేనే ఉన్నాం. వీరికి చట్టపరంగా ‘సామాజిక భద్రత’ (జీవిత, ప్రమాద బీమా, పెన్షన్‌, ప్రసూతి సెలవులు, వైద్య బీమా…) పథకాలు వర్తింపజేయాల్సిన బాధ్యత కేంద్రంలోని పాలకులకు లేదా? అని సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ‘కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ, 2019’ ముసాయిదా బిల్లు ఎంతమాత్రమూ న్యాయం చేయలేదని వారు చెబుతున్నారు.

న్యూఢిల్లీ : ‘ద కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ, 2019’ ముసాయిదా బిల్లును కేంద్ర కార్మికమంత్రి సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌ మొన్నటి పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో (డిసెంబరు, 2019లో) ప్రవేశపెట్టారు. ‘సామాజిక భద్రత’ పథకాల్ని వర్తింపజేసే 9 చట్టాలను ఇందులో కలిపారు. ఇందులోని చట్టాలు చాలావరకు 1923, 1952, 1961…ప్రాంతంలో చేసినవే ఉన్నాయి. 2008లో చేసిన ‘అసంఘటితరంగ కార్మికుల సామాజిక భద్రత’ చట్టాన్ని కూడా ఇప్పుడు తీసుకురాబోతున్న చట్టంలో కలిపారు.

అయితే ఇవి 20వ శతాబ్దం కాలంనాటివి, 2040నాటికి మనదేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు తయారుచేయాలని, పాత చట్టాలను కలిపినంత మాత్రాన సామాజిక భద్రత పరిధి విస్తరించదని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చట్టాల్ని తయారుచేయాల్సిన అవసరముంటుందని, ఆ దిశగా పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కృషి చేయాలని నిపుణులు భావిస్తున్నారు.

బిల్లులో లోపాలేంటి!
– అసంఘటితరంగ కార్మికులు వివిధ రకాల జీవనోపాధి కలిగివుంటారన్నదానిని గుర్తించటం లేదు. జాతీయ పెన్షన్‌ పథకం, 2004 వర్తింపజేయలేదు.
– అవసరాలమేరకు, రోజు కూలీగా, వ్యవసాయ కూలీగా, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యక్తిగా మారుతాడు. ఈ అంశానికి సంబంధించి వివరణగానీ, ప్రస్తావనగానీ లేదు.
– నిర్మాణరంగంలో పెద్ద సంఖ్యలో కార్మికులున్నారు. వీరి విషయంలో సామాజిక భద్రత అమలు కావాలంటే ‘సెస్‌’ వసూలుచేయాలని ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు.
– రాష్ట్ర ప్రభుత్వం ‘సెస్‌’ వసూలు చేస్తే, కార్మికుడు మరో రాష్ట్రానికి వలస వెళితే ఎలా? అన్నదానిపై బిల్లులో స్పష్టత ఇవ్వలేదు.
– సామాజిక భద్రతా కార్డు రిజిస్ట్రేషన్‌ ‘పోర్టబులిటీ, ప్రయోజనాలు ఎలా ఉంటాయి? అన్నవి బిల్లులో పొందుపర్చలేదు.

ఇదంతా ఇప్పుడున్నదే కదా!
ఒక సంస్థలో 10మందిలోపు అసంఘటితరంగ కార్మికులుంటే వారికి ‘ఈఎస్‌ఐ’ వైద్య సేవలు వర్తింపజేయాలి. కార్మికుల సంఖ్య 20 ఉంటే, ఈపీఎఫ్‌ వర్తింపజేయాలి. ఇలాంటి నిబంధనలన్నీ ఇప్పుడున్న కార్మికచట్టాల్లోనివే. యాజమాన్యాన్ని లేదా సంస్థనే కార్మిక చట్టం పరిధిలోకి తీసుకొస్తేనే సామాజిక భద్రత ప్రయోజనాలు కార్మికులకు దక్కుతాయని, ముసాయిదా బిల్లులో ఇలాంటి ప్రస్తావన లేదని సామాజికవేత్తలు అంటున్నారు. మరొకవిధంగా చెప్పాలంటే, కాంట్రాక్ట్‌ కార్మికుడికి ‘సామాజిక భద్రత’ పథకాల ప్రయోజనాలు కల్పిస్తామని బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. 19మందిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా చూపి..వారికి ఈపీఎఫ్‌ వర్తించకుండా యాజమాన్యాలు తప్పించుకునే అవకాశముంది. ఈ లోపాల్ని సరిచేస్తూ కొత్త చట్టం తెస్తేనే కార్మికులకు ప్రయోజనం. హడావిడిగా ఏదో చట్టం తెచ్చామని కాకుండా, కోట్లాది మందికి ‘సామాజిక భద్రత’ పథకం ప్రయోజనాలు దక్కేలా కొత్త చట్టాలు ఉండాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Courtesy Nava Telangana