నస్రీన్‌ ఖాన్‌

”జస్ట్‌ ఒక చిన్న చెంపదెబ్బ కొడితే ఏమవుతుంది? కొట్టినంత మాత్రాన అంతలా ప్రతిఘటించాలా? కుటుంబాన్ని కూల్చుకోవాలా? అవసరానికి మించిన నాటకమిది..!” ఈమధ్య కాలంలో విడుదలైన హిందీ సినిమా ‘థప్పడ్‌’కు ఎక్కువ శాతం పురుషుల నుంచి వస్తున్న స్పందన. లాక్‌డౌన్‌ సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌లోకి చడీచప్పుడు కాకుండా వచ్చిన సినిమాకు సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. పురుషుల అభిప్రాయానికి భిన్నంగా మహిళలు స్పందిస్తున్నారు. వీరి స్పందన ”జస్ట్‌ ఎ స్లాప్‌. మగర్‌ మార్‌ నహీ సక్తా” సినిమాలో నాయికగా నటించిన తాప్సీ అనే డైలాగ్‌ రూపంలోనే వెలిబుచ్చుతున్నారు. ఒక్కరిద్దరు వ్యతిరేకించే వారూ లేకపోలేదు. కాస్త మహిళాభివృద్ధికి సహకారం అందించే పురుషులు కూడా ”చెంప దెబ్బే. కానీ కొట్టకూడదు” అంటూ వెన్నుతడుతున్నారు.

ఇంతకీ ఏముందీ సినిమాలో…
అమృత, విక్రమ్‌లది అన్యోన్యమైన జంట. భారతీయ సాంప్రదాయాలు అనుసరించే కుటుంబమే. చక్కటి ఇల్లు. ఒక అత్తగారు. ఇంటి పని, వంట పనులు చూసుకునేందుకు ఓ పనిమనిషి. అమృత కూడా విద్యావంతురాలు. నాట్యం నేర్పే ప్రతిభావంతురాలు. ఉద్యోగం చేసే అర్హతలు ఉన్నప్పటికీ గృహిణిగా ఉండేందుకే ఇష్టపడిన ఒక ఆధునిక యువతి. చక్కటి ఇల్లాలు అనిపించుకునేందుకు శాయశక్తులా శ్రమిస్తుంది. విక్రమ్‌ ఉద్యోగం, అమృత ఇల్లు. వీరికి తోడుగా మధుమేహంతోపాటు, భర్తతో వేరుపడి, నిరాశానిస్పృలతో ఉంటున్న అత్తగారు. ఆమెకు అత్తగారు ఎప్పుడూ అత్తగారు కాదు. అమ్మలాగే భావిస్తుంది.

విక్రమ్‌ ఉద్యోగంలో భాగంగా లండన్‌ వెళ్ళి అక్కడే స్థిరపడాలని కలగంటాడు. విక్రమ్‌ కనే కలనే అమృత తనదిగా చేసుకుంటుంది. లండన్‌ వెళ్ళేందుకు ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం విక్రమ్‌కు ఉంటుంది. కానీ అమృత తానే ఆ ప్రాజెక్టును చేపట్టినంతగా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. విక్రమ్‌ చేసే ప్రతి పనికీ వెన్నంటి ఉంటుంది. చివరకు లండన్‌ వెళ్ళేందుకు అనుకున్న అవకాశం రానే వచ్చింది. ఈ శుభవార్తను ఆత్మీయులు అనుకునే వారందరి మధ్య పార్టీ ఏర్పాటు చేసి పంచుకోవాలనుకుంటారు. అనుకున్నట్లుగానే మునిమాపు వేళ పార్టీ ప్రారంభమైంది.

అమృత తల్లిదండ్రులు, కాబోయే మరదలితో వచ్చిన తమ్ముడు, తను డ్యాన్స్‌ నేర్పించే పక్కింటి అమ్మాయి తల్లితో, విక్రమ్‌ ఆఫీసులోని పై అధికారులు, వారి కుటుంబాలు, ఇంకొంతమంది దగ్గరి వారందరూ వచ్చేస్తారు. ఆనందహేలల మధ్య విక్రమ్‌కు ఒక ఫోన్‌ కాల్‌ వస్తుంది. విక్రమ్‌ లండన్‌ వెళ్ళేది సీఈవోగా కాదు. మరో మామూలు అధికారిలాగానే అని చెప్తాడు అవతలి వ్యక్తి. కలలు కరిగిపోయినంతగా కుంగిపోతాడు విక్రమ్‌. పట్టరాని కోపంతో పార్టీకి వచ్చిన అధికారిని నిలదీస్తాడు. తనకు చెప్పకపోవడంపై నిందిస్తాడు. మాటా మాటా పెరుగుతుంది. వీరి గొడవ చూసి అతిథులు హతాశులవుతారు. ఇవేవీ పట్టించుకోకుండా విక్రమ్‌ ఆ అధికారులతో కలబడతాడు. అప్పుడు వస్తుంది అమృత. విక్రమ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్ళడంలో భాగంగా అతడి చేతిని లాగుతుంది. అతడు ఆమెను విసిరి కొడతాడు. అయినా మళ్ళీ లాగుతుంది. ఇదే అసహనంలో ఉన్న విక్రమ్‌ ఆమెను చెంపపై బలంగా కొడతాడు. ఆ తరువాత ఎక్కడివారక్కడికి వెళ్ళిపోతారు. అమృత తల్లిదండ్రులు విచారంలో మునిగి ఉండగా, ఆమె అత్తగారు ఇది సొంత ఇంటి విషయం అని చెబుతుంది. వారు కూడా వెళ్ళిపోతారు.

కానీ అమృతలో ఆలోచనలు వెల్లువెత్తుతాయి. ఎన్నో ఆలోచనలు ఆమెను చుట్టుముడతాయి. విక్రమ్‌ ఏమీ జరగనట్టుగానే అమృతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. అమృత ప్రయత్నించినా ఉండలేకపోతుంది. కొన్నాళ్ళు తల్లిదండ్రుల వద్దకు వెళతానని చెప్తుంది భర్తతో. చిన్న విషయాన్ని పెద్దది చేయాలని వెళ్ళేందుకు సిద్ధపడిందని ఆరోపణలు చేయడం మొదలు పెడతాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షులైన తల్లిదండ్రులు మరోసారి గొడవేమైనా జరిగిందేమోనని కంగారు పడతారు. మామూలు అయ్యేంతవరకు ఉంటానని చెప్తుంది. వారు కూడా చిన్న చెంపదెబ్బకు ఇలా రావడం సమస్యను జఠిలం చేయడమేనని అభిప్రాయపడతారు. ఒక్క తండ్రి తప్ప. ఆమె తనను తాను పరిశీలించుకునేంతలో విక్రమ్‌ కోర్టు నోటీసులు పంపుతాడు. దాంతో అమృత న్యాయస్థానానికి వెళ్ళవలసి వస్తుంది. తనను చెంపదెబ్బ కొట్టినందుకే విడాకులు అడుగుతున్నట్లు న్యాయవాదిని కోరుతుంది. కానీ, అంతటి చిన్న చెంపదెబ్బకు విడాకులు ఇవ్వడం న్యాయశాస్త్రాల్లో లేదని వివరిస్తుంది న్యాయవాది. నిజాయితీగా ఇదే విషయంపై పోరాడమని నిక్కచ్చిగా చెబుతుంది అమృత.

కానీ, అమృతనే మద్యం తాగి తనను తాను మరిచిపోయి, తనపై చేయి చేసుకుందని, తను నిర్లక్ష్యంగా ఇల్లువిడిచి వెళ్ళిపోవడంతో తన తల్లి అనారోగ్యం పాలైందని, తన ఆస్తికోసమే తనను పెండ్లి చేసుకుందంటూ రకరకాల ఆరోపణ లను తన దరఖాస్తులో జోడిస్తాడు విక్రమ్‌. దీనితో ఖిన్నురాలైపోతుంది అమృత. అయినా నిజాయితీనే తన మార్గంగా ఎంచుకుని విడాకులకు దరఖాస్తు చేసు కుంటుంది. ఈ విడాకులకోసం జరిగే కేసు వాయిదాకు వాయిదాకు మధ్యనున్న వ్యవధిలో మరికొన్ని సంఘటనలు కూడా జరుగు తాయి. వాటిలో అమృత గర్భవతి అవడం కూడా. బిడ్డ తనకే చెందాలని చట్టంలోని లొసుగులన్నింటినీ వాడాల్సిందిగా విక్రమ్‌, అతడి అన్న, అతడి తండ్రి కూడా ఒక సీనియర్‌ న్యాయవాదిని కోరతారు. అతడు కూడా వారికి అనుగుణంగానే దరఖాస్తులను సిద్ధం చేస్తాడు. వీటితో పాటు తనతో పాటు ఉంటే ఎన్నెన్ని సౌలభ్యాలు ఉన్నాయో వివరిస్తూ అమృతను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తాడు.

కానీ, అతడు కొట్టిన చెంపదెబ్బ తప్పు అనే విషయాన్ని మాత్రం ఎంతకీ గ్రహించడు. పైగా అదేమంత పెద్ద తప్పు కానే కాదని అమృత చుట్టూ ఉన్న ఆడవారు, మగవారు అభిప్రాయపడతారు. అమృతదే తప్పు అంటారు. అయితే అమృత మాత్రం ‘అతడు కొట్టాల్సింది కాదు’ అని కచ్చితంగా చెప్తుంది. విక్రమ్‌ చెంపదెబ్బ కొట్టింది ఒకే ఒక్కసారి కదా అంటాడు. ‘ఒక్కసారైనా కాకూడదు. అయింది. ఆ తరువాత ఆగుతుందని నమ్మకమేమిటి?’ అని అడుగుతుంది. దానికి సమాధానమే దొరకదు. చివరకు భార్య నిండు గర్భిణిగా ఉన్నపన్పుడు అసలు విషయాన్ని గ్రహిస్తాడు విక్రమ్‌. మగాడిననే అహంకార ప్రవర్తనతో అమృత మనసు విరిచేసానని బాధపడతాడు. ఆమెకు క్షమాపణ చెబుతాడు. చక్కటి జీవితాన్ని నిర్మించుకుని ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తాడు. కోర్టులో విడాకులు మంజూరై ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇదీ కథ.

ఆమె ఆత్మగౌరవం లెక్కలోకి రాదు
కథ అంతా చెంపదెబ్బ చుట్టూనే తిరుగుతుంది. పురుషాధిక్య సమాజంలో ఏ ఒక్కరికీ చెంపదెబ్బ అసలు లెక్కలోనికే రాదు. ఆడదానిపై జరిగే ఏ ఒక్కదాడి కూడా గుర్తింపుకు నోచుకోనిదే. తిరిగి ఆమె భర్తను అదే చెంపదెబ్బ కొట్టి ఉంటే… అది మాత్రమే చర్చలోకి వచ్చేది. బరితెగించిన ఆడది అంటూ ఎన్నెన్నో నిందలు మోయాల్సి వచ్చేది. ఆమె కేవలం ఒక్క చెంప దెబ్బకే విడాకులు తీసుకుందా? చెంపదెబ్బ ఆమె గౌరవాన్ని దెబ్బతీయడం లెక్కలోకి రాదా? ఆమె ఆత్మగౌరవానికి జరిగిన భంగం కాదా? అంతమందిలో చెంపదెబ్బతో భర్త అవమానిస్తే భార్య ఏమీ జరగనట్టు నటిస్తూ తిరగాల్సిందేనా? తనను అవమానపరిచిన భర్తపై తనకు ఏమాత్రం ప్రేమ లేదని స్పష్టంగా చెప్తుంది అమృత. చట్టంలో ఆడవారికి రక్షణగా ఉన్న చట్టాలను వినియోగించుకుని కేసును మరింత బలంగా తయారు చేద్దామని న్యాయవాది సలహా ఇచ్చినా నిజాయితీ అనే మాటపైనే నిలబడుతుంది. తనకు భరణం అక్కరలేదు. కేవలం గౌరవం, ఆనందం.. మాత్రమే కావాలని కోరుకుంటుంది. భవిష్యత్తులో ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది గనుక ఇల్లాలిగా చేసిన శ్రమకైన ఫలితం కోరమంటూ ఆమె కాబోయే మరదలు కూడా పట్టుబడుతుంది. తను కూడా ప్రేమించింది గనుకనే ఆ పనులన్నీ చేయగలిగానని, అందుకు బదులు ఆశించలేనని మహిళల సున్నిత మనసును, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటుంది.

భరించక తప్పట్లేదు
సినిమా వరకు ఈ కథ ఎంతో చక్కగా అమరినట్లే కనిపిస్తుంది. నిజజీవితంలో ఎంతమంది అమృతలను మనం చూడవచ్చు అనేదే ఇప్పుడు అందరి మదిలను తొలుస్తున్న ప్రశ్న. భర్త రక్తమోడినట్లుగా కొట్టినా… ప్రత్యామ్నాయంలేక అదే భర్తతో బతకాల్సిన దుస్థితి మన సమాజంలో ఉంది. ఆమె ప్రాణాలు పోయినా తమ గడప తొక్కవద్దని చెప్పే తల్లిదండ్రులున్నారు. ఆర్థిక భరోసా లేని మహిళ, దానికితోడు చదువు కూడా లేకపోతే ఆమెకు భర్త వద్ద పడి ఉండడం తప్పితే మరో మార్గమే లేదు.

సమాన హక్కు ఉండాలి
”ఆ.. ఒక్క చెంపదెబ్బకు ఇల్లు వదిలిపోతే, ఇక కాపురాలు ఎలా ముందుకెళ్తాయి?” ఒక సగటు భర్త ప్రశ్నించాడు. అది చిన్న చెంపదెబ్బే కావొచ్చు. అయినా ఎందుకు కొట్టాలి అనే ప్రశ్నకు మాత్రం సమాధానమీయలేదు. ‘నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు’ బైబిల్‌లోని ఒక వాక్యం. మన సమాజంలో పొరుగు వారు కారు కదా… ఇంటి బండికి మరో చక్రమైన భార్య ఇష్టారీతిలో హింసకు గురవుతోంది. నేటికీ ఎంతో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు చేసి, కుటుంబానికి ఆర్థిక స్థిరత వచ్చిన తరువాత, ఇంటి బాధ్యతలు చూసుకునే ఎందరో భార్యలకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. వారికి ఏ చిన్న అవసరం వచ్చినా భర్తపైనే ఆధారపడాలని కోరుకునే సంకుచిత భర్తలతో నిండిన దేశం మనది. భార్య తనకన్నా బలహీనమైనది అని భావించే పురుషులే ఉన్నారు. ఈ పద్ధతిలో మార్పు రావాలి అంటే ఆస్తిలో సమానవాటా కోరుకునే హక్కు భార్యకూ రావాలి. అప్పుడే ఆమె విశ్వాసంతో ముందడుగు వేయగలదు. అమృతకు ఉన్నట్లుగా అందరి తండ్రులూ వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడం విచారకరం.

Courtesy Nava Telangana