జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్‌లలో ఎదురు కాల్పులు
నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు మావోయిస్టులు మృతి

 శ్రీనగర్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు ఎన్‌కౌంటర్లతో ఉలిక్కిపడ్డాయి. జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్‌లలో శనివారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లా ఖుల్‌ బట్పోర ప్రాంతంలోని మాన్‌గోరి గ్రామంలో మిలిటెంట్లు నక్కిన ఇంటిని సైన్యం, పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చుట్టుముట్టారు.

తీవ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు తిప్పికొట్టడంతో ముగ్గురు ముష్కరులు మృతిచెందారు. తీవ్రవాదులు నక్కిన ఇంటిని భద్రతా బలగాలు డిటోనేటర్‌తో పేల్చివేశాయని స్థానికులు చెప్పారు. ధ్వంసమైన నివాస శిథిలాల నుంచి మరొక తీవ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు శ్రీనగర్‌కు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 11 నెలల విరామం తర్వాత కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన తీవ్రవాదులను హిజ్బుల్ ముజాహిద్దీన్‌ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు.

జార్ఖండ్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి
రాంచీ: జార్ఖండ్‌లోని చిరుంగ్‌-గద గ్రామంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాల కోసం మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, సీఆర్‌సీఎఫ్‌ 94వ బెటాలియన్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు కాల్పులకు పాల్పడటంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో, ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని చైబాసా ఎస్పీ ఇంద్రజీత్‌ మహతా తెలిపారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని వెల్లడించారు.