– ఆర్‌కేడబ్ల్యూ, సన్‌బ్లిక్‌ కంపెనీలకు ఉగ్రవాదంతో లింకు
– ఆ కంపెనీల నుంచి కమలం పార్టీకి కోట్లల్లో విరాళాలు
– ఏ ప్రయోజనం ఆశించి ఈ విరాళాలు: రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని బీజేపీ ఓవైపు చెబుతూనే, మరోవైపు ‘టెర్రర్‌ ఫండింగ్‌’తో సంబంధాల్ని కొనసాగిస్తోంది. ఉగ్రవాదులకు ఏజెంట్‌గా పనిచేశారనే ఆరోపణలున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచి బీజేపీకి భారీగా విరాళాలు అందాయన్న సంగతి బయటపడింది. ముంబయికి చెందిన ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌, సన్‌బ్లిక్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఉగ్రవాదులతో ఆర్థిక లావాదేవీలు జరిపాయ న్న కేసులోఈడీ విచా రణ సైతం సాగుతోంది. అలాంటి కంపెనీల నుంచి బీజేపీకి కోట్ల రూపాయలు పార్టీ విరాళాలుగా అందటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మోడీ సర్కార్‌ ప్రవేశపె ట్టిన ‘ఎన్నికల బాండ్ల’ పథకం ద్వారా ఆయా కంపెనీ లు బీజేపీకి విరాళాలు అందజేయటం గమనార్హం.
ముంబయిలో ‘ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌ లిమి టెడ్‌’ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇందు లో ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రస్తుతం విచారణ జరుపు తోంది. 1993 ముంబయి పేలుళ్లులో ప్రధాన నింది తుడు, దావుద్‌ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు ‘ఇక్బాల్‌ మెమోన్‌’కు ‘ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌’ పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసి స్థిరాస్థుల్ని కొనుగోలు చేసింది. ఆస్తుల అమ్మకం వ్యవహారంలో కంపెనీ మాజీ డైరెక్టర్లు ఏజెంట్‌గా పనిచేశారనీ, వేల కోట్లరూపాయలు చేతులుమారాయనీ ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఆర్‌కేడబ్ల్యూ, సన్‌బ్లిక్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఈడీ గుర్తించింది.
ఈనేపథ్యంలో ఆయా కంపెనీలపై ఈడీ విచార ణ జరుపుతోంది. అలాంటి కంపెనీల నుంచి బీజేపీ పెద్ద మొత్తంలో పార్టీ విరాళాలు స్వీకరించటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ సమాచారంలో బీజేపీ పేర్కొన డం వల్ల ఈ విషయాలు బయటకొచ్చాయి. ఉగ్రవా దంపై ఇతరులకు సుద్దులు చెప్పే బీజేపీ, అలాంటి కంపెనీ నుంచి విరాళాలు స్వీకరించటమేంది? ఈ విరాళాలు ఎందుకు వచ్చాయి? తద్వారా ఆ కంపెనీ కీ, దానివెనుకున్నవారికి ఎలాంటి లబ్ది చేకూరింది? అన్న ప్రశ్నల్ని రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.
ఒకటీ రెండు కాదు…పది కోట్లు
ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌ నుంచి 2014-15లో రూ.10కోట్లు బీజేపీకి పార్టీ విరాళంగా ముట్టింది. ఇదే విషయాన్ని ఈ ఏడాది జనవరిలో ‘కోబ్రా పోస్ట్‌’ వార్తా కథనం వెలువరించింది. అలాగే సన్‌బ్లిక్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ నుంచి రూ.2కోట్లు పార్టీ విరాళంగా బీజేపీకి అందాయి. కార్పొరేట్‌ కంపెనీల నుంచి బీజేపీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇవన్నీ ఒక గ్రూప్‌గా ఏర్పడి ‘ఎలక్టోరల్‌ ట్రస్ట్‌’ పేరుతో విరాళాలు ఇస్తున్నాయి. కానీ ఆర్‌కేడబ్ల్యూ, సన్‌బ్లిక్‌…కంపెనీ పేరుతో స్వయంగా విరాళాలు అందజేశాయి. కోట్లరూపాయల పార్టీ విరాళం ఇచ్చేంత అవసరం ఈ కంపెనీలకు ఎందుకు ఉంది? ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు అనేక అనుమానాలకు తావిస్తోందని ‘ద వైర్‌’ వార్తా కథనం పేర్కొన్నది.

Courtesy Navatelangana..