మమ్మల్ని తుపాకీ మందులా వాడుకోవాలని చూస్తున్నారు
Image result for kashmir girls going to school– పరీక్షల షెడ్యూల్‌ ప్రకటనపై కాశ్మీర్‌ విద్యార్థుల ఆందోళన
శ్రీనగర్‌: కాశ్మీర్‌లో ప్రశాంతత నెలకొన్నదని ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రభుత్వం తమను తుపాకీ మందులా వాడుకోవాలని చూస్తున్నదని అక్కడి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌ బోర్డు ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించడం పట్ల ఉన్నత పాఠశాల విద్యార్థుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అక్టోబర్‌ 29 నుంచి పదో తరగతి, 30 నుంచి 12వ తరగతి, నవంబర్‌ 10 నుంచి 11వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని రద్దు చేసినప్పటి నుంచి అక్కడ ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల పాఠశాలలు, కళాశాలల్ని తెరిచినప్పటికీ విద్యార్థులు హాజరు కావడంలేదు. తమ పిల్లల భద్రత పట్ల ఆందోళన వల్ల తల్లిదండ్రులు వారిని విద్యాసంస్థలకు పంపేందుకు ఆసక్తి చూపడంలేదు. దాంతో,పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు లేక కళావిహీనంగా మారాయి.
ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత దక్షిణకాశ్మీర్‌లోని రెండు పాఠశాలలు అనుమానాస్పద స్థితిలో అగ్నికి ఆహూతయ్యాయి. తమకు 60 శాతం సిలబస్‌ కూడా పూర్తి కాలేదని 12వ తరగతి విద్యార్థులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థుల నుంచి అదే ఆందోళన వ్యక్తమైంది. తాము మానసికంగా పరీక్షలకు సిద్ధంగా లేమని వారు తెలిపారు. తమ పిల్లల భవిష్యత్‌ పట్ల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్షలకు హాజరు కాకుంటే ఓ విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండు నెలలైనా పరీక్షలు వాయిదా వేయాలని వారు కోరుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరించకపోవడంతో పరీక్షా కేంద్రాలకు ఎలా వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులకు భద్రత కల్పిస్తామని ఆ రాష్ట్ర డీజీపీ దిల్‌బాఫ్‌సింగ్‌ తెలిపారు. వారు భయపడకుండా పరీక్షలకు హాజరయ్యేందుకు తాము సహకరిస్తామని ఆయన తెలిపారు. విద్యా సంవత్సరాన్ని వృధా చేసుకోవద్దని ఆయన సూచించారు. అధికారిక వివరాల ప్రకారం జమ్మూకాశ్మీర్‌లో మొత్తం లక్షా 60 వేలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉన్నది. వీరి కోసం 1502 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Courtesy Nava Telangana..