టెన్షన్.. టెన్షన్
-కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ
-జమ్ము కశ్మీర్‌పై కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ
-ఉన్నత భద్రతాధికారులతో అమిత్ షా భేటీ
-నేడు సమావేశం కానున్న కేంద్ర క్యాబినెట్
-ఫరూఖ్ నివాసంలో భేటీ అయిన జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలు
-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ప్రయత్నాలపై పోరాడాలని తీర్మానం
-ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహనిర్భందం!
-భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్డా ఎదుర్కొంటామన్న పాక్

జమ్ము కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర అలజడి, ఆందోళన నెలకొన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో ఉన్నత భద్రతాధికారులతో సమావేశం కావడం, సోమవారం కేంద్ర మంత్రివర్గం భేటీ కానుండడం ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. జమ్ము కశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలు ఆదివారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేయడంతోపాటు రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు ముక్కలు చేయవచ్చునన్న ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దిగొద్దని భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలకు సూచించారు. మరోవైపు కశ్మీర్‌లో అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. 

సర్వీసులను నిలిపివేశారు. 
జమ్ము కశ్మీర్‌పై కేంద్రం అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయన్న దానిపై రాష్ట్రంలో ఆందోళన, అలజడి, అయోమయం కొనసాగుతున్నది. కశ్మీర్ లోయలో భద్రతా బలగాల మోహరింపును అధికారులు ముమ్మరం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో నిత్యావసర వస్తువులను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. కిరాణా షాపులు, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు వివిధ విద్యాసంస్థలు కూడా తమ విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయాలని కోరాయి. గతవారం తరలించిన పారా మిలిటరీ బలగాలను శ్రీనగర్‌తోపాటు కశ్మీర్‌లోయలోని సున్నిత ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. సచివాలయం, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ఎయిర్‌పోర్టుతోపాటు పలు కార్యాలయాల వద్ద భద్రతను పెంచినట్లు వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న ప్రాంతాల్లో అల్లర్ల నియంత్రిత వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న విద్యాసంస్థలను సోమవారం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలోని ఉద్రిక్త పరిస్థితులపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత మాజీ ముఖ్యమంత్రులు మెహబూబాముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాతోపాటు పలువురు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం.

ఆర్టికల్ 35ఏ, 350 రద్దుచేసే ఏ చర్యనైనా వ్యతిరేకిస్తాం: ఎన్సీ

జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చిత, భయానక పరిస్థితిపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ర్టానికి కల్పిస్తున్న ప్రత్యేక రాజ్యాంగ హోదాను ఉల్లంఘించే చర్యలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపింది. కశ్మీర్ లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సమీక్షించేందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం సుమారు నాలుగు గంటలపాటు సమావేశమైంది. భేటీ అనంతరం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కశ్మీర్ ప్రజల్లో తిరిగి విశ్వాసం నెలకొల్పేందుకు కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, 350కి మద్దతుగా పార్టీ ఎంతదూరం వెళ్లేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్‌పై నెలకొన్న అనుమానపు మేఘాలను తొలిగించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్టీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని ఆయన వెల్లడించారు. ఆర్టికల్ 35ఏ, 370 కోసం పార్లమెంట్ లోపల, వెలుపల మా పార్టీ పోరాటం చేస్తున్నది. ఈ అధికరణల రక్షణ కోసం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు ఢిల్లీలో న్యాయవాదులను మోహరించాం అని ఆయన తెలిపారు.

విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు: ముఫ్తీ

ఆర్టికల్ 35ఏ, 370తో ఆటలాడితే తలెత్తే పరిణామాలపై దేశ ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేప్పేందుకు మేం ప్రయత్నాలు చేశాం. కేంద్రానికి అభ్యర్థనలు కూడా చేశాం. అయినప్పటికీ ఎలాంటి హామీ రాలేదు అని మెహబూబా ముఫ్తీ మీడియాతో పేర్కొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రశ్నించగా, సరిహద్దుల్లో పరిస్థితిపై మాకు సమాచారం అందింది. పౌరుల మరణాలు ఖండించదగిన విషయం. క్లస్టర్ బాంబులు వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాంధీ పుట్టిన దేశంలో అలా జరుగడం తప్పు అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిని పనిముట్టుగా ఉపయోగించుకుని కశ్మీర్‌లోని రాజకీయ నేతలను టార్గెట్ చేస్తున్నదని ఆమె ఆరోపించారు. వేర్పాటువాదులకు వ్యతిరేకంగా (కేంద్రం) చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు ప్రధాన రాజకీయ నేతలను టార్గెట్ చేసుకున్నారు. అఖిలపక్ష సమావేశంపై సమాచారం అందగానే, ఫరూఖ్ అబ్దుల్లాను ఛండీగఢ్‌కు (క్రికెట్ అసోసియేషన్ స్కామ్‌లో ఈడీ విచారణకు) తరలించారు అని విమర్శించారు. కాగా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఆదివారం ఏసీబీ నోటీసులు పంపింది. జమ్ముకశ్మీర్ బ్యాంకులో అక్రమ నియామకాలపై స్పందించాలని కోరింది. వేధింపుల్లో భాగంగానే నోటీసులు పంపారంటూ ముఫ్తీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

అమిత్ షా ఉన్నతస్థాయి భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సుమారు గంటపాటు ఈ భేటీ సాగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని కెరెన్ సెక్టార్‌లోని భారత సైనిక పోస్టుపై దాడికి యత్నించిన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్) సభ్యులను భారత సైన్యం మట్టుబెట్టిన నేపథ్యంలో ఈ భేటీ జరుగడం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్ము కశ్మీర్‌లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుండడంతో దానిపైనా భేటీలో చర్చించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర క్యాబినెట్ కూడా సోమవారం సమావేశం కానున్నది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ భేటీ జరుగనున్నది. అలాగే భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలు కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ఈ అత్యన్నత స్థాయి సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తు సంఖ్య పెంపునకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ బిల్లుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నదని సమాచారం.

ముఫ్తీ , ఒమర్ గృహ నిర్భందం!

జమ్ము కశ్మీర్‌కు చెందిన ముగ్గురు కీలక రాజకీయ నేతలైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సజ్జద్ లోన్‌లను హౌజ్ అరెస్ట్ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అర్ధరాత్రి నుంచి నన్ను గృహ నిర్బంధంలో ఉంచనున్నట్లు నాకు అనిపిస్తున్నది. అలాగే ఇతర ప్రధాన రాజకీయ నేతలను కూడా హౌజ్ అరెస్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే నిజమైతే మిమ్మల్ని ఇతర పరిస్థితుల్లో చూడాల్సి రావచ్చు. అల్లానే మనల్ని రక్షించాలి అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటాం: ఫరూఖ్

కశ్మీర్‌లో ఉద్రిక్తతలు రాజేసే చర్యలకు దిగొద్దని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా.. భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఆదివారం శ్రీనగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రక్షించుకునే విషయంలో రాష్ట్రంలోని విపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భద్రతా బలగాల మోహరింపు, తాజా రాజకీయ పరిస్థితులపై వివిధ పార్టీల ప్రతినిధులు మా నివాసంలో సమావేశమై చర్చించాం. అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయడం గతంలో ఎన్నడూ జరుగలేదు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో తలెత్తే పరిణామాలపై ప్రధాని, రాష్ట్రపతిని కలిసి వివరించాలని నిర్ణయించాం అని ఆయన తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి మెహబూబా ముఫ్తీ (పీడీపీ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), తాజ్ మొహిద్దీన్ (కాంగ్రెస్), సజ్జద్ లోన్, ఇమ్రాన్ అన్సారీ (పీపుల్స్ కాన్ఫరెన్స్), షా ఫైజల్ (జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూమెంట్), ఎంవై తరిగామి (సీపీఎం) తదితరులు హాజరయ్యారు. రాష్ర్టానికి ప్రత్యేక ప్రతిపత్తితోపాటు, రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని సమావేశంలో తీర్మానించారు. తొలుత అఖిలపక్ష భేటీని ఓ హోటల్లో నిర్వహించాలని భావించినా, హోటళ్లలో రాజకీయ సమావేశాలను నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించడంతో ఆ భేటీని తమ నివాసంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఫ్తీ తెలిపారు. అయితే ఫరూఖ్ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో ఈ సమావేశాన్ని ఆయన నివాసానికి బదిలీ చేసినట్లు చెప్పారు.

(Courtacy Namasthe Telangana)