• పదేళ్ల జైలు.. 10 లక్షల రూపాయల జరిమానా!
  • నర్సులపై దాడి చేసినా అంతే
  • ఆస్పత్రుల్లో విధ్వంసమూ శిక్షార్హమే
  • ఉన్నపళంగా అరెస్టు.. బెయిలురాదు
  • కొత్త బిల్లు ముసాయిదా సిద్ధం
  • డాక్టర్లను కొట్టడం తీవ్రస్థాయి నేరం
  • ఇతర వైద్య సిబ్బందిపై దాడి చేసినా అంతే
దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తీవ్రస్థాయి చర్యలు ప్రతిపాదిస్తోంది. ఆస్పత్రుల్లో.. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది లేక ఏ ఇతర విభాగ సిబ్బందిపైనైనా దాడిచేసిన వారు ఇక కఠిన దండన ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైద్యుల మీదో, వైద్యం మీదో కోపంతో విధ్వంసానికి తెగబడినా కఠిన శిక్ష తప్పదు. హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు తప్పదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తేనుంది. 30 రోజులలోపు ప్రజల అభిప్రాయాలు తెలపాలంటూ బిల్లు ముసాయిదాను ఆన్‌లైన్లో ఉంచింది. ఈ బిల్లు ప్రకారం..
  • ఓ డాక్టరు లేదా నర్సు లేదా ఇతర వైద్య సిబ్బందిని కొడితే కనీసం ఆరు నెలల జైలు శిక్ష
  • గాయపరిచినా, హింసించినా- దాని స్థాయిని బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్ల దాకా ఖైదు తప్పదు.
  • కేవలం జైలే కాదు… కనీసం రూ 5వేల నుంచి రూ 5 లక్షల దాకా జరిమానా కూడా విధించవచ్చు
  • వైకల్యం లేదా కోలుకోలేని స్థితి తెచ్చినా, లేక చంపేసినా 10 సంవత్సరాల కఠిన కారాగారవాసం.
  • కేసు తీవ్రతను బట్టి రూ 10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు
  • నేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండా కేవలం ఓ చిన్న కాగితం మీద బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు
  • సీఆర్‌పీసీతో సంబంధం లేకుండా ఎకాయెకిన అరెస్టు చేయవచ్చు, చేసిన నేరానికి బెయిల్‌ కూడా ఇవ్వరు
  • డీఎస్పీ ర్యాంకు అధికారి కేసు నమోదు, దర్యాప్తు చేపట్టాలి.
  • ఆస్తినష్టానికి తెగబడితే మార్కెట్‌ విలువకు రెండు రెట్లు జరిమానాగా కట్టాలి లేదా కోర్టు నిర్దేశించిన ప్రకారం పరిహారం చెల్లించాలి
  • వైద్య సిబ్బందిని మామూలుగా గాయపరిస్తే అతనికి లేదా ఆమెకు రూ లక్ష పరిహారం తీవ్రంగా గాయపరిస్తే రూ 5 లక్షల దాకా పరిహారం చెల్లించాలి
  • దాడి చేసిన వారు పరిహారాన్ని చెల్లించకపోతే.. రెవెన్యూ చట్టం కింద భూమి లేదా స్ధిరాస్తుల నుంచి వసూలు

(COURTECY ANDHRA JYOTHI)