• 10 నెలల్లో 9 మంది.. ఇటీవల ఒకే రోజు ఇద్దరు పిల్లలు మృతి
  • ఒకరు తలకు గాయమై చనిపోయినట్లు నివేదిక
  • సిబ్బంది నిర్లక్ష్యంతో పిల్లలకు తరచూ అనారోగ్యం
హైదరాబాద్‌: కొందరు తల్లిదండ్రులు లేని శిశువులు.. ఇంకొందరు వద్దనుకొని వదిలేసిన పిల్లలు! అనాథలైన ఆ శిశువులకు ప్రేమను పంచి.. ఆకలి తీర్చి.. ఆలనాపాలన చూడాల్సిన బాధ్యతలో హైదరాబాద్‌ యూసు్‌ఫగూడలోని శిశువిహార్‌ గాడి తప్పుతోంది! గత పది నెలల్లో అంటే గత జనవరి నుంచి ఇప్పటి వరకు 9 మంది శిశువులు మృతిచెందారు. అనారోగ్యం బారిన పడి సరైన సమయంలో వైద్య సేవలు అందక కొందరికి.. ఆహారం అందక ఆకలితో ఇంకొందరికి నెలల వయసులోనే నూరేళ్లు నిండుతున్నాయి. జూలై 14న నాలుగు నెలల నిత్య అనే పాప జారి పడటంతో తలకు గాయమైంది. ముక్కు, చెవుల నుంచి రక్తం కారింది. ఆ చిన్నారిని నిలోఫర్‌కు తరలించగా అప్పటికే ఆ పాప చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, పాప పోస్టుమార్టం నివేదికలో దిగ్ర్భాంతికరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. తలకు గాయంతో పాటు తీవ్రమైన ఆకలి వల్లే నిత్య చనిపోయినట్లు నివేదిక పేర్కొంది. నిత్యను ఆస్పత్రికి తరలించిన రోజే సత్యశ్రీ అనే 9 నెలల చిన్నారికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ సోకింది. ఆ పాపను కూడా నిలోఫర్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఒకే రోజు నిత్య, సత్యశ్రీ చనిపోయారు. దీనిపై విచారణ జరపాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఓ స్వచ్ఛంద సంస్థ బుధవారం పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
స్నానం లేక.. పొక్కులు
శిశువిహార్‌లో ప్రస్తుతం 210 మంది పిల్లలు ఉండగా..120 మంది ఆయాలు పనిజేస్తున్నారు. ఎప్పటికప్పుడు చిన్నారుల గదులను శుభ్రం చేయడం, పసికందులకు పాలుపట్టడం, తరచూ వైద్య పరీక్షలు చేయించడం వీరి విధి. ఎప్పటికప్పుడు వీటిని అధికారులు పర్యవేక్షించాలి. అయితే ఇవన్నీ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పిల్లలకు సరిగా స్నానం చేయించకపోవడంతో శరీరంపై తరచూ పొక్కులు వస్తున్నాయి.
ఓ దాత.. అంబులెన్స్‌ ఇచ్చినా
శిశువిహార్‌ సిబ్బంది నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ. అక్కడ పిల్లలు తరచూ అనారోగ్యానికి గురి అవుతుండటం, వారిని ఆటోల్లో నిలోఫర్‌కు తీసుకెళ్తుండటాన్ని చూసి చలించిపోయిన ఓ దాత అంబులెన్స్‌ను అందజేశారు. అయితే, అక్కడి సిబ్బంది దాన్ని వాడకుండా ఆటోలోనే వెళ్తున్నారు. గత జూలై 14న చనిపోయిన నిత్య అనే చిన్నారిని కూడా ఆటోలోనే తీసుకెళ్లారు. పిల్లల అనారోగ్యం విషయాన్ని బయటకు రానివ్వకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
అంబులెన్స్‌ వాడాలన్న రూల్‌ లేదు
పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపం. చనిపోయిన పిల్లల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదు. పిల్లలు అనారోగ్యానికి గురయితే ఆస్పత్రికి పంపుతాం. ప్రతిసారి అంబులెన్స్‌ వాడాలన్న నిబంధన ఏమీ లేదు. అవసరాన్ని బట్టి వాడతాం లేకపోతే లేదు. అదంతా మా ఇష్టం.
– లక్ష్మీదేవీ, జాయింట్‌ డైరెక్టర్‌, మహిళా సంక్షేమశాఖ
 
విచారణ జరపాలి
శిశువిహార్‌లో తరచూ చిన్నారులు అనారోగ్యానికి గురవుతూ చనిపోతున్నారు. నిత్య అనే పాప తలపై గాయం వల్ల చనిపోయిందని పోస్టుమార్టంలో తేలింది. శిశువిహార్‌లో చనిపోయిన శిశువులందరి మరణాలపై విచారణ జరపాలని కోరుతూ సీపీకి ఫిర్యాదు చేశాం.
– అచ్యుతరావు, ఎన్జీవో సంస్థ ప్రతినిధి
Courtesy andhra Jyothy