• ప్రమాదాలకు గురవుతున్న బస్సులు
  • సంగారెడ్డి శివార్లో ఆటోతో ఢీ.. అత్తాకోడళ్లు దుర్మరణం
  • 16మందికి గాయాలు.. నలుగురు విషమం
  • మరో ఘటనలో వ్యక్తి మృతి.. కూకట్‌పల్లిలో బస్సుల ఢీ

తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో ఆర్టీసీ బస్సులు పట్టు తప్పుతున్నాయి. వారి అజాగ్రతతో అదుపు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డుకు అడ్డదిడ్డంగా దూసుకెళుతూ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి! సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఫసల్‌వాది శివార్లో టాటా ఏఎ్‌సను హైదరాబాద్‌-2 డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం చౌటకూర్‌కు చెందిన అత్తా కోడళ్లు బుచ్చి భాగమ్మ (60), బుచ్చి చంద్రకళ (38) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆటో డ్రైవర్‌ బషీర్‌కు రెండు కాళ్లూ విరిగాయి. ఆటోలోని మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం మిన్‌పూర్‌ శివార్లో ఓ ఆటోను సంగారెడ్డి డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నీటి పారుదల శాఖ వర్క్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ యాదయ్య (38) మృతిచెందాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి వైజంక్షన్‌ వద్ద ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి మరో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుల అద్దాలు పగిలాయి. మద్యం తాగి నడపడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఢీకొట్టిన బస్సు డ్రైవర్‌ రసూల్‌ను ప్రయాణికులు చితకబాదారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ వద్ద సోమవారం బ్రేక్‌ డ్రమ్ములు పగిలిపోవడంతో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Courtesy Andhra Jyothy