•  టికెటివ్వకుండానే డబుల్‌ చార్జీలు వసూల్‌
  •  బస్సుల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల జులుం
  •  కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళన
టికెట్‌ ఇవ్వరు..డబుల్‌ చార్జీలు వసూలు.. ఇదేమిటని అడిగితే బస్సు దిగిపోవాలని రుబాబు! ఆర్టీసీ కార్మికుల సమ్మెనేపథ్యంలో తాత్కాలిక, డ్రైవర్లు, కండక్టర్ల నిలువు దోపిడీ ఇది. వీరి దెబ్బకు ప్రయాణికులు నానా అగచాట్లుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. వికారాబాద్‌ నుంచి తాండూరు వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణికులకు.. డ్రైవరు, కండక్టర్‌కు మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. ధారూరు నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణికుల వద్ద తాండూరు వరకు రూ.30, ఇతర ఏ స్టేజీలలో దిగినా రూ.20 కండక్టర్‌ వసూలు చేశాడు. మంబాపూర్‌లో ఎక్కిన ప్రయాణికుల వద్ద తాండూరుకు రూ.20 తీసుకోవడంతో ప్రయాణికులు వాదనకు దిగారు. సాధారణంగా అక్కడి నుంచి తాండూరుకు రూ.10చార్జీ ఉంది. డబుల్‌ చార్జీలు ఎందుకు తీసుకుంటారని కండక్టర్‌ను నిలదీశారు. రూ.20ఇవ్వకుంటే బస్సు దిగిపోండని కండక్టర్‌ అనడంతో టికెట్‌ ఇస్తేనే డబ్బులిస్తామని, లేకుంటే డీఎంకు ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు అనగా.. ‘ఇప్పుడు బస్సులో జీఎం, డీఎం జాన్తేనై. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి’ అంటూ కండక్టర్‌ చెప్పి ప్రయాణికుల నుంచి రూ.10 చార్జీ స్థానంలో రూ.20 వసూలు చేశాడు. అన్ని పట్టణాలు, పల్లెల రూట్లలో తిరుగుతున్న బస్సుల్లో సిబ్బంది డబుల్‌ చార్జీ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మొదలు పెట్టిన సమ్మె ఐదోరోజుకు చేరింది. దసరా పండుగ పూర్తవడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. డిపోల నుంచి అరకొర బస్సులు బయటకు వస్తుండడంతో ప్రైవేట్‌వాహనాల వెంట ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ప్రయాణికులతో రద్దీగా కనిపించే ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సలు వెలవెలపోతున్నాయి.

హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండు, జూబ్లీబస్టాండులో రాత్రి 11 దాటిదంటే బస్సుల్లో చార్జీలను రెండింతలకు పెంచేసి ప్రయాణికులను దోచేస్తున్నారు. టికెట్ల జారీ లేకపోవడంతో రద్దీని బట్టి చార్జీలు ఇష్టానుసారంగా పెంచుతూ ప్రయాణికుల జేబులు గుళ్లచేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె..ప్రభుత్వం వైఖరితో ప్రయాణాలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా….వాటిలో చార్జీలు మాత్రం రెండింతల వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. టికెట్‌ కూడాఈ ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వారికి పలు రాజకీయ పక్షాలు మద్దతు పలికాయి.

Courtesy Andhra Jyothy..