• తెలంగాణ నుంచి ముగ్గురు.. ఏపీ నుంచి 10మంది
  • పంప వద్ద అడ్డుకొని, వెనక్కి పంపిన పోలీసులు
  • బెజవాడ నుంచి 30మంది మహిళల బృందం
  • 10లోపు, 50పైబడిన ఇరవైమందికే అనుమతి
  • తెరుచుకున్న ఆలయ తలుపులు
  • రెండు నెలల పాటు మండల పూజలు

పశ్చిమ కనుమల్లో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ.. స్వామియే శరణమయ్యప్ప అంటూ నెత్తిన ఇరుముళ్లతో భక్తుల నినాదాలు.. అదే సమయంలో స్వామిని మేమూ దర్శించుకుంటాం అంటూ వచ్చిన యువతులను పోలీసులు అడ్డుకోవడంతో.. ఆవేదనతో వారి నినాదాలు.. ఇలా అత్యంత ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితుల మధ్య మండల పూజల కోసం శనివారం శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదలాయించిన తరుణంలో.. శబరిమల యాత్ర మొదలైంది. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు వెళుతున్న మహిళలను పంపానది వద్దే పోలీసులు నిలువరించారు. గుర్తింపుకార్డులను పరిశీలించి 10-50 ఏళ్ల మధ్య వయసున్న ఏపీలోని విజయవాడుకు పదిమంది యువతులను గుర్తించి.. వెనక్కిపంపారు. విజయవాడ నుంచి 30 మంది మహిళలు రాగా.. వారిలో 10 ఏళ్లలోపు.. 50 ఏళ్ల వయసు మించి ఉన్న 20మందిని దర్శనానికి అనుమతించారు. తెలంగాణకు చెందిన ముగ్గురు మహిళలను కూడా వెనక్కి పంపారు. అంతకుముందు సాయంత్రం 5గంటలకు కొండపైన ఆలయ తలుపులను ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరారు తెరిచారు. దీక్షధారుల శరణుఘోషల నడుమ.. ఆయన పవిత్ర పదునెట్టాంబడికి పూజలు చేసిన తర్వాత.. దర్శనానికి ఇరుముళ్లతో వచ్చిన అయ్యప్ప భక్తులను అనుమతించారు.

రెండు నెలల పాటు ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి. నిలక్కళ్‌, పంపానది వైపు నుంచి పెద్ద ఎత్తున భక్తులు కొండకు వస్తున్నారు. శబరిమలపైకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అనుమతించకపోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆ ఆచారాన్ని రద్దుచేయాలని కోరుతూ కొందరు పిటిషన్లు వేయడంతో అన్ని వయసుల మహిళలను ఆలయ ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ నిరుడు సెప్టెంబరు 28న సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ మీద గురువారం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పలేదు. తీర్పులో అయోమయముందని పేర్కొంటూ.. దర్శనం కోసం వచ్చే 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల కోసం భద్రతను కల్పించకూడదని కేరళ సర్కారు నిర్ణయించింది. కాగా, ఏపీ మహిళలు వారంతట వారే వెనక్కి వెళ్లిపోయారని పథనంతిట్ట జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఇతరులతో కలిసి వచ్చిన ఆ మహిళలు అయ్యప్ప ఆలయ సంప్రదాయాలు తెలుసుకుని తిరుగుముఖం పట్టారని చెప్పారు. మరోవైపు పోలీసులు భద్రత కల్పించినా, కల్పించకున్నా.. తాను ఆదివారం ఆలయాన్ని దర్శించుకుంటానని సా మాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్‌ నాయకురాలు తృప్తి దేశాయ్‌ ఇప్పటికే ప్రకటించారు. నిరుడు ఆమె ఆలయానికి వచ్చే ప్రయత్నం చేయగా తిప్పిపంపారు.

Courtesy Andhrajyothy