• ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను బహిష్కరిస్తున్నాం
  • దరఖాస్తులు నింపం.. పత్రాలు చూపించం
  • తెలుగు రాష్ట్రాల ముస్లిముల నిర్ణయం

హైదరాబాద్‌: మేమంతా భారతీయులం. రాజ్యాంగం మాకు స్వేచ్ఛను ఇచ్చింది. ఆ స్వేచ్ఛను కాపాడుకోవడానికి మేం పోరాడుతూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్పీఆర్‌, ఎన్నార్సీ దరఖాస్తులను పూర్తి చేయం. ఎన్పీఆర్‌ సర్వేకు సహకరించం. ఎటువంటి డాక్యుమెంట్లూ చూపించం’’ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిములు శుక్రవారం మసీదుల్లో ప్రతిజ్ఞలు చేశారు. ఎన్పీఆర్‌ సర్వేను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లోని మసీదుల్లో ఈ ప్రతిజ్ఞలు చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిములు ఐక్యత ప్రతిజ్ఞ దినోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం (జుమా) నమాజు అనంతరం అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రతిజ్ఞ చేపట్టారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారత ఆత్మను చంపేందుకు సీఏఏ, ఎన్సార్సీ, ఎన్పీఆర్‌ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లిములతో జేఏసీ కన్వీనర్‌ ముస్తాక్‌ మాలిక్‌ ప్రతిజ్ఞలు చేయించారు. తాము భారతీయులమని, తమ పౌరసత్వానికి సంబంధించిన రుజువులను మతతత్వ సర్కారు కోరజాలదని అన్నారు.

తెలంగాణ, ఏపీ, హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతంలో సుమారు 50-60 లక్షల మంది ముస్లిములు శుక్రవారం ప్రార్థనలు చేశారని ముస్తాక్‌ మాలిక్‌ చెప్పారు. అన్ని మసీదుల్లో ప్రతిజ్ఞలను విజయవంతంగా నిర్వహించామని జేఏసీ ప్రతినిధి, ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్‌ తెలిపారు. విభిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనం భారత్‌ గొప్పతనమని, ఇదే విషయాన్ని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని అన్నారు. దేశాన్ని, దేశ ప్రజలను ఐకమత్యంగా ఉంచేందుకు ప్రభుత్వాలు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ముస్లింల మద్దతు ఉంటుందని, మతాల ఆధారంగా విభజించే రాజకీయాలను ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Courtesy Andhrajyothi