• తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అధికం.. ఎక్కువగా సిరమ్‌ క్రియాటిన్‌ స్థాయి
  •  జాతీయ పోషకాహార సర్వేలో వెల్లడి
  •  ప్రతి 10 మంది స్కూలు వయసు పిల్లల్లో ఒకరు ప్రిడయాబెటిక్‌ దశలో
  •  5 శాతం కౌమర దశ పిల్లలకు బీపీ
  •  బాలికల్లో 40% మందికి రక్తహీనత
హైదరాబాద్‌ : సమగ్ర జాతీయ పోషకాహార సర్వే 2016-18 ఫలితాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసింది. ‘పిల్లలు-పోషకాహారం’పై ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సర్వే! దేశంలోని పిల్లల్లో అత్యధికంగా కిడ్నీ జబ్బులు బారినపడే అవకాశమున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడయింది.ఈ రాష్ట్రాల్లో 5-9 ఏళ్ల పిల్లల్లో జాతీయ సగటు 7 శాతానికి పైగా సీకేడీ (క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌)తో బాధపడుతున్నారని తేలింది. ఈ రాష్ట్రాల్లో పిల్లల మూత్రంలో సిరమ్‌ క్రియాటిన్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దేశంలో ప్రతి 10 స్కూల్‌ వయసు పిల్లల్లో ఒకరు ప్రిడయాబెటిక్‌ దశలో ఉన్నట్లు సర్వే తెలిపింది. 5-9, 10-19 వయసు పిల్లలకు మధుమేహం వచ్చే బెడద పెరిగిపోతోంది. 5 శాతం కౌమర దశ పిల్లలకు బీపీ వస్తోంది. 4 శాతం మందికి హైకొలెస్ట్రాల్‌ ఉంది. పిల్లల్లో అధిక బరువు, ఊబకాయ సమస్యలు పెరుగుతున్నట్లు తెలిపింది. తమిళనాడు, గోవా, ఢిల్లీ రాష్ట్రాల్లోని కౌమర దశ పిల్లలు అధిక బరువుతో ఉన్నట్లు వివరించింది. దాద్రా నగర్‌ హవేలీ, హరియాణా, అసోం, కేరళ, పంజాబ్‌… ఆరోగ్యం విషయంలో మెరుగైన చర్యలు చేపట్టి మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. దేశాన్ని నాలుగు జోన్లుగా విభజించి, ఫిబ్రవరి 2016 నుంచి అక్టోబరు 2018 మధ్య ఈ సర్వే చేశారు. 30 రాష్ట్రాల్లో 1,12,316 మంది 0-19 ఏళ్ల పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 9 జిల్లాల్లో నిర్వహించారు. రాష్ట్రంలో విటమిన్‌-ఏ లోపంతో ఎక్కువ మంది విద్యార్థులు బాధపడుతున్నారని తేలింది.
సర్వే కీలకాంశాలు
  •  0-5 ఏళ్ల చిన్నారుల్లో 35శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. 33 శాతం మంది వయసుకు తగ్గ బరువు లేరు. 11శాతం మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 2 శాతం అధిక బరువుతో ఉన్నారు.
  •  5-9 ఏళ్ల పిల్లల్లో తక్కువ బరువుతో 10 శాతం, అధిక బరువుతో 23 శాతం, ఊబకాయంతో 4 శాతం, తీవ్ర, అసాఽధారణ ఊబకాయంతో 2 శాతం చొప్పున బాధపడుతున్నారు.
  •  10-19 ఏళ్ల పిల్లల్లో అధిక బరువుతో 24 శాతం, ఊబకాయంతో 5 శాతం, అధిక, అసాధారణ ఊబకాయంతో వరుసగా 4, 2 శాతం మంది బాధపడుతున్నారు.
  •  బాలికల్లో 40 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

Courtesy Andhra Jyorhy..