విజ్ఞానం కొత్త పుంతలు తొక్కిన నేటి ఆధునిక సమాజంలోనూ ఇంకా కుల వివక్ష కొనసాగుతుండటం సిగ్గు చేటని కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. కేవీపీఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌ వద్దగల ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేవీపీఎస్‌ జెండాను ఎగురవేశారు. అనతంరం రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ ఊర్లనుంచి మొదలుకొని పట్నాల వరకు కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కొనసాగుతున్న కులవివక్షను రూపుమాపి సమానత్వం సాధించేందుకు 1998 అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున కేవీపీఎస్‌ ఆవిర్భావించిందని తెలిపారు. రాష్ట్రంలోని 500 గ్రామాల్లో 200 మంది కార్యకర్తలు పర్యటించి 120 రకాల కుల వివక్షతలను గుర్తించి అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించామని వివరించారు. 21 ఏండ్లుగా కేవీపీఎస్‌ రాష్ట్రంలో కుల వివక్ష, సమానత్వం, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నదని తెలిపారు. తమ పోరాట ఫలితంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు, 2013లో సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపు, ధళిత,గిరిజనలకు ప్రత్యేకంగా శ్మశానవాటిల ఏర్పాటుకు సంబందించిన జీవో 1235ను సాధించామని తెలిపారు. 29 జిల్లాలు, 380 మండలాల్లో కేవీపీఎస్‌కు బలమైన నిర్మాణం ఉందని అన్నారు. పోరాడి సధించుకన్న హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాసేందుకు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు.కొన్నేండ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల హక్కులను రక్షించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్లక్షులు కె. భాస్కర్‌ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 20 శాతం దాడులు పెరిగాయని ఆరోపించారు. ప్రపంచం అభివృద్ధిబాటలో పయనిస్తుంటే.. దేశం మాత్రం మతోన్మాదం వైపు పయనిస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు బి. ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ హక్కులను కాలరాస్తున్నాయన్నారు. అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసేందుకు కేంద్రం చేసిన కుట్రకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం, సుప్రీంకోర్టు అక్షింతలతో ఆగిపోయిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్‌ స్వామి, ప్రముఖ అంబేడ్కర్‌ వాది జి.విజయకుమార్‌, కేవీపీఎస్‌ హైదరాబాద్‌ కార్యదర్శి కె.విజయకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి కోట రమేశ్‌, కేవీపీఎస్‌ నాయకులు ఎం.కృపాకర్‌, దశరథ్‌, నర్సయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Courtesy Navatelangana…