• మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తి కూడా
  • తెలుగులో మాట్లాడిన వీడియో విడుదల
  • రెండేళ్ల క్రితమే పాకిస్థాన్‌కు
  • ప్రేమ విఫలమై మతిస్థిమితం కోల్పోయాడు
  • అతడిది విశాఖపట్నం తెలంగాణ పోలీసుల వెల్లడి

హైదరాబాద్‌;హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు పాకిస్థాన్‌లో అరెస్టయ్యాడు. అతడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్‌ను ఆ దేశ భద్రతాబలగాలు అరెస్టు చేసినట్లు పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది. పాక్‌లోని బహావల్‌పూర్‌ వద్ద కొలిస్థాన్‌ ఎడారిలో వీరిని సోమవారం అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి వద్ద ఎలాంటి పాస్‌పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌కు ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ఓ యువతి కోసం వెతుక్కుంటూ.. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిసింది. అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్‌ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ ఆ దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నారనే అభియోగాలు పాకిస్థాన్‌ మీడియాలో ప్రసారమవుతున్నాయి.

ప్రేమ విఫలమై.. మానసిక స్థితి కోల్పోయి
ప్రశాంత్‌ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు రెండేళ్ల క్రితమే పాక్‌ భూభాగంలోకి అడుగు పెట్టాడని తెలిపారు. ప్రేమ విఫలమవ్వడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్‌.. అటూఇటూ తిరుగుతూ.. ఎడారి మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.

వీడియోలో ప్రశాంత్‌ ఏం మాట్లాడాడు?
పాక్‌ మీడియాలో ప్రసారమవుతున్న ప్రశాంత్‌ తెలుగు వీడియోలో తన తల్లిదండ్రులకు ఓ సందేశమిచ్చాడు. ‘‘మమ్మి.. డాడీ.. బాగున్నారా? ఇక్కడ అంతా బాగుంది. ఇప్పు డు నన్ను పోలీ్‌సస్టేషన్‌ నుంచి కోర్టుకు తెచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందిస్తారు. అప్పుడు మీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇంకో నెల రోజుల్లో విడుదల కావొచ్చు. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా నన్ను భారత్‌కు పంపుతారు.’’ అని ప్రశాంత్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అయితే.. ఆ వీడియో రెండేళ్ల కిందటిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

శ్రీలంకలో ముగ్గురు భారతీయుల అరెస్టు
శ్రీలంక కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. శ్రీలంక అంతర్జాతీయ విమానాశయంలో వారు 1.5 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.

Courtesy AndhraJyothy…