• T.J.S. George

ఉత్తరప్రదేశ్, హత్రాస్ ‘భారతి’ని రేప్ చేసిన అగ్రకుల ఠాకూర్లు రాము, లవ్ కుశ్, రవిని అరెస్టు చేశారు. చనిపోయేముందు ఆమె వాళ్ల పేర్లు చెప్పింది.

దళితులపై అకృత్యాలకు పాల్పడటం- ఉత్తర ప్రదేశ్ అగ్రకులాల సంస్కృతిలోనే ఉంది. 19 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేయడంతో నలుగురు ఠాకూర్లు ఆగలేదు. నేలపై ఈడ్చుకుపోయారు, దుపట్టాని మెడకు బిగించారు, ఆమెను ఎంత ఘోరంగా హింసించారంటే, వెన్నుపూస విరిగిపోవడంతో ఆమె అవయవాలు చచ్చుబడ్డాయి. ఆమె నాలుక తెగ్గోశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబాన్ని పోలీసులు తీవ్రంగా తిట్టి, అవమానించారు. గాయాల ముద్దగా మారిన బాధితురాలు ఆస్పత్రిలో కన్నుమూసింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు తెల్లవారుజామున 2 గంటలకు ప్రయత్నించారు. దళిత స్త్రీని ఆమె కుటుంబ సభ్యులే చంపివేశారంటూ ఠాకూర్లు, బ్రాహ్మణులు కూడబలుక్కుని, ఉమ్మడిగా ప్రకటించారు. అగ్రకులాల వారి దగ్గర డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక నింద కూడా వేశారు. ఈ ఘోరంపై తనకు తానుగా స్పందిస్తూ- ఇది ‘‘మా అంతరాత్మను గాయపరిచింది’’ అంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ‘‘అబద్ధపు వార్త’’ అంటూ ఆగ్రా పోలీసులు కొట్టిపారేస్తున్నారు. బలవంతం జరిగిందనీ, ‘‘అంగప్రవేశం పూర్తిగా జరిగిందని’’- ఆమెను పరిశీలించిన ఆలీగఢ్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ బోధనాస్పత్రి తేల్చి చెప్పిన తర్వాత కూడా- ఫోరెన్సిక్ నివేదికను ఉటంకిస్తూ అసలు అత్యాచారం జరగలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకటించారు. ‘‘అత్యాచారం జరగలేదు’’ అన్న ఆలోచన- ప్రజా సంబంధాల అధికారుల సృష్టి అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ కేసు వ్యవహారాన్ని చూసుకోవాల్సిందిగా ప్రిసికా రోడ్రిగ్స్ నేతృత్వంలో ముంబాయి కేంద్రంగా నడుస్తున్న ప్రజా సంబంధాల సంస్థకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది. తన వాదనను వినిపించేందుకు ఆదిత్యనాధ్ ఒక ప్రజా సంబంధాల ఏజెన్సీని నియమించుకోవడం- అసలు కథేమిటో చెప్పకనే చెబుతున్నది. ఈ ఉదంతంలో ఉన్న పరస్పర విరుద్ధతని పట్నా యువ జర్నలిస్టు సంకర్షన్ ఠాకూర్ చక్కగా చెప్పాడు.

అతనిలా అన్నాడు: ‘‘దారుణమైన ఈ వార్త (హథ్రాస్) బయట ప్రపంచానికి వెల్లడికాగానే, జిల్లా అధికార యంత్రాంగం దీనిని ‘‘అబద్ధపు వార్త’’ అంటూ కొట్టిపారేసింది. ఒకవైపు అధికార యంత్రాంగం చేస్తున్న అబద్దపు ప్రచారం, మరో వైపు తీవ్రగాయలు… కొన ఊపిరితో పదిహేను రోజులపాటు ఆస్పత్రిలో ఉండి ఆమె ప్రాణాలతో పోరాటం చేసింది. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి మారింది.. చివరికి ఢిల్లీలో తుది శ్వాస విడిచింది. దీనిని ‘‘అబద్ధపు వార్త’’గా కొట్టిపారేయడానికి లేదు. ఆమె ఇప్పుడు చనిపోయి శవంగా మారింది’’.

అణగారిన వర్గాల నేరాలు, ఘోరాలపై రాష్ట్ర రాజధానుల్లోనూ, దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉన్న అధికార యంత్రాంగాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంత పెద్ద ఘోరం జరిగిందన్న సమాచారం కనీసం ప్రధాని దృష్టికైనా వెళ్లిందో లేదో తెలియని స్థితి. ఒక నేరాన్ని జాతీయ స్థాయి నేరంగా ప్రకటించేందుకు అవసరమైన సమాచారం జాతీయ నేర గణాంక సంస్థ (NCRB) దగ్గర ఉంది. ఈ సంస్థ అందించిన సమాచారం మేరకు…

* 2019లో భారత దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరిగింది.
* నేరగాళ్లు ప్రతి నాలుగు గంటలకూ ఒక స్ర్తీని అక్రమ రవాణా చేస్తున్నారు.
* మహిళలపై ప్రతి 2-3 రోజులకు ఒక యాసిడ్ దాడి జరుగుతున్నది.
* ప్రతి గంటకు ఓ స్త్రీ వరకట్న వేధింపులకు బలి అవుతోంది.
* ప్రతి రోజూ ఒక స్త్రీ- సామూహిక అత్యాచారానికీ, హత్యకూ గురవుతున్నది. 

భారతదేశపు గొప్పదనాన్ని ప్రపంచం కీర్తించాలని ప్రధాన మంత్రి కోరుకుంటున్నందున-ప్రపంచం ఈ గణాంకాలను తప్పకుండా గమనిస్తుంది. హ్యూస్టన్ నగరంలో జరిగిన హౌడీ మోడీ సంరంభాన్ని ఓసారి గుర్తు చేసుకోండి. ప్రపంచం మొత్తానికీ వార్తల్ని చేరవేసే బీబీసీ వంటి వార్తా సంస్థలు హథ్రాస్ ఉదంతం, ఇంక ఇలాంటి దుర్మార్గాలపై పూర్తిస్థాయిలో కథనాలను ప్రసారం చేస్తాయి. ‘‘శిక్షిస్తారన్న భయం లేకుండా  ఒక దళిత మహిళని వెంటాడారు,  వేటాడారు…అవమానించారు, అత్యాచారం చేశారు.. హత్య చేశారు’’ అంటూ వార్తలు వచ్చిన తర్వాత ఇది అబద్ధం అనుకునే అవకాశం లేదు. గత కొన్నేళ్లుగా ప్రజలు సామాజిక మార్పు రావాలని బలంగా కోరుకుంటున్నారు. పరిమితంగానే అయినా ఇది సంతోషించదగ్గది.  ‘‘దళిత జీవితాలు ముఖ్యం’’ వంటి నినాదాలు క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చాయి. అయినా అదేమంత తేలిగ్గా జరిగేది కాదు. స్వరాష్ట్రం గుజరాత్ లో కబీరా అనే యువకుడు ఆటో కొనుక్కుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అతన్ని చితక్కొట్టారు. కబీరా తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులు. అక్కడ ఆటో వ్యవస్థ అగ్రకులాల గుప్పిట ఉంది. కబీరా స్వగ్రామాన్ని వదిలివెళ్లిపోయాడు. ఆటోను అమ్మేసి, ఒక మందుల తయారీ కంపెనీలో క్లీనర్ పని చేసుకుంటున్నాడు…. గుజరాత్ ప్రతిష్ఠను పునఃప్రతిష్ఠించారు.

ఇక్కడ ఒక ఫిలాసఫీ ఉంది. ప్రజలందరూ దానిని ఆమోదిస్తే అందరూ క్షేమంగా ఉంటారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ దీనిని ఎంతో హృద్యంగా చెప్పారు. సింగ్ ఇలా అన్నాడు: ‘‘తల్లిదండ్రులు తమ కుమార్తెలకు మంచి సంస్కారాన్నీ, మంచి విలువల్నీ బోధించాలి. అప్పుడు అత్యాచారాలు పూర్తిగా తగ్గిపోతాయి’’.  మరి దీనిని గమనంలో ఉంచుకోండి… కొడుకులు వాళ్లకు నచ్చిన సంస్కారాన్ని ఎంచుకోవచ్చు. కుమార్తెల సంస్కారం గురించి మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఈ మనిషి మానసిక ప్రవర్తన, అతని ఆలోచనలను చూస్తుంటే- సమస్య తీవ్రత ఎంత ఉందీ అర్థం అవుతోంది. ఈ సమస్య మూలాలు సంస్కృతిలో ఉన్నాయి. మానవ విలువలు కనీస స్థాయిలో కూడా అందరిలోనూ ఒకేలా ప్రతిష్ఠితం కావు. హిందీ ప్రాంతంగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఈ తరహా మానవ విలువలు కనిష్ఠ స్థాయిలోనైనా ఉన్నట్లు ప్రపంచం ఎన్నడూ వినలేదు. కనలేదు. పరిస్థితులను మెరుగు పరిచే దిశగా ఆదిత్యనాధ్ వంటి వాళ్లు చేసిన ప్రయత్నాలేమీ లేవు. నిజానికి వారు పరిస్థితులను మరింత దిగజార్చుతున్నారు. సమకాలీన దృక్పథాన్ని తొక్కిపెట్టి, పక్షపాత నాయకత్వాన్ని అందిస్తున్న ఆదిత్యనాధ్ వల్ల ఉత్తర ప్రదేశ్ ఒక్క దానికే కాదు, భారతదేశం మొత్తానికీ చెడ్డ పేరు. ఇదో పెద్ద విషాదం.