స్వీయ మదింపులు కుదరవు
తప్పుడు వార్తలకు టెల్కోల ఎండీలదే బాధ్యత
కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాం
ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ
టెల్కోలు, కేంద్రానికి అక్షింతలు

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత  బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. స్వీయ మదింపులు, బకాయిల పునఃసమీక్ష లాంటివి కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాకీల చెల్లింపునకు టెలికం సంస్థలకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్, జస్టిస్‌ ఎంఆర్‌ షా తో కూడిన బెంచ్‌ బుధవారం తిరస్కరించింది. రెండు వారాల తర్వాత దీన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ‘20 ఏళ్ల వ్యవధి ఇవ్వడమనేది అసమంజసం. తీర్పులో పేర్కొన్నట్లుగా టెలికం కంపెనీలు బాకీలన్నీ తీర్చాల్సిందే‘ అని స్పష్టం చేసింది. వడ్డీలు, జరిమానాలపై టెలికం కంపెనీలు, ప్రభుత్వం వాదోపవాదాలన్నీ విన్న మీదటే ఏజీఆర్‌ బాకీలపై తీర్పునిచ్చామని, అన్ని పక్షాలు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది.

ఆ అధికారులను పిలిపిస్తాం..
ఏజీఆర్‌ బాకీలపై టెలికం కంపెనీలు స్వీయ మదింపు చేపట్టడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి కలలో కూడా ఊహించలేనివంటూ వ్యాఖ్యానించింది. స్వీయ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు టెల్కోలను అనుమతించిన టెలికం శాఖ కార్యదర్శి, డెస్క్‌ ఆఫీసర్‌లను పిలిపిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వీయ మదింపు పేరుతో టెలికం కంపెనీలు తీవ్రమైన మోసానికి పాల్పడుతున్నాయని ఆక్షేపించింది. ఏజీఆర్‌ బాకీల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పే అంతిమమని, దాన్ని తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

టెల్కోల చీఫ్‌లకు హెచ్చరిక..
టెల్కోలు తమకు అనుకూలంగా వార్తాపత్రికల్లో కథనాలు రాయించుకుంటున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలాంటి కథనాలు తమ తీర్పును ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. ఏజీఆర్‌ బాకీలపై సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ’తప్పుడు వార్తలు’ ప్రచురిస్తే టెలికం కంపెనీల ఎండీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

స్వీయ మదింపుతో భారీ వ్యత్యాసం..
ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి డాట్‌ చెబుతున్న దానికి టెల్కోల స్వీయ మదింపునకు మధ్య ఏకంగా రూ. 82,300 కోట్ల వ్యత్యాసం ఉంది. డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్, టెలినార్‌వి కలిపి రూ. 43,980 కోట్లు, వొడాఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్‌ సంస్థలు రూ. 16,798 కోట్లు చెల్లించాలి. అయితే, ఆయా టెల్కోలు జరిపిన స్వీయ మదింపు లెక్కల ప్రకారం.. భారతి గ్రూప్‌ రూ.13,004 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.21,533 కోట్లు, టాటా గ్రూ ప్‌ సంస్థలు రూ.2,197 కోట్లు కట్టాల్సి ఉంటుంది.

Courtesy Sakshi