Image result for సార్లు లేని సదువు..!"ఉండాల్సింది.. 3014 మంది బోధన సిబ్బంది; ఉన్నది.. 1460 మందే
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దుస్థితి
శాశ్వత అధ్యాపకులు 85 శాతం ఉండేలా భర్తీ చేయాలన్న కేంద్రం
హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాల్లో విద్యా బోధన మిథ్యగా మారుతోంది. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన సిబ్బంది కంటే ఖాళీలే అధికంగా ఉండటం దుస్థితికి దర్పణం పడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘రూసా’ కింద ఎంపికైన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనే 3014 మంది ఉండాల్సింది.. 1460 మంది (51.55 శాతం ఖాళీలు) బోధన సిబ్బందే విధుల్లో ఉన్నారు. జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్‌) హోదా పొందిన వీటిలోనే ఇన్ని ఖాళీలుంటే.. ఇక మిగిలిన వర్సిటీలు, కళాశాలల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న్యాక్‌ హోదా పొందితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులిస్తోంది.
ఖాళీలే అధికం
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,352 వర్సిటీలు, డిగ్రీ కళాశాలలు రూసా కింద నిధులు పొందేందుకు అర్హత సంపాదించాయి. తెలంగాణ నుంచి 84 విద్యాసంస్థలున్నాయి. అందులో ఆరు వర్సిటీలు కాగా మిగిలినవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు. కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు బోధన సిబ్బంది పరిస్థితిపై నివేదికలు అందజేశాయి. అందులో అత్యధిక ఖాళీలున్న మొదటి రెండు రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, తమిళనాడు కాగా మూడో రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే పనిచేసే వారు 451 మంది ఉంటే ఖాళీలు 816 ఉండటం గమనార్హం. కొద్ది నెలల క్రితం ఈ వర్సిటీ అతి కష్టంమీద న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ సాధించింది. వర్సిటీలు, డిగ్రీ కళాశాలలు ఒప్పంద అధ్యాపకులతో నడుస్తున్నాయి. రూసా ప్రాజెక్టు ఆమోదిత మండలి మే నెలలో నిర్వహించిన సమీక్షలో.. కనీసం 85 శాతం బోధన సిబ్బంది ఉండేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. ఇటీవల యూజీసీ సైతం ఖాళీలను నింపాలని నాలుగు సార్లు రాష్ట్రానికి లేఖలు రాసింది. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

(Courtesy Eenadu)