గుడిపాటి

ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం కొన్నితరాల పాటు తెలంగాణ విద్యార్థులకు ఒక కల. జిల్లాల్లో ఉండే విద్యార్థులు ఓయూకి రావాలని తహతహలాడేవారు. ఉస్మానియాలో చదవడం ఒక ఆశయంగా ఉండేది. చాలా ఏండ్ల పాటు దేశంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటిగా విలసిల్లింది. అదంతా ఇపుడు ఒక చరిత్ర. కాలంలో కలిసిపోయిన గతం. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ స్థితిలో ఉన్నదో తెలిసిందే. పదిహేను నెలలుగా వైస్‌ చాన్సలర్‌ లేకపోవడం గమనార్హం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికే కాదు తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తప్ప వేటికీ వైస్‌చాన్సలర్‌ (వీసీ)లు లేరు. అన్నిటా ఇన్‌చార్జిల పాలన నడుస్తున్నది.

వందేండ్ల ఉస్మానియా
మూడేండ్ల కిందట ఉస్మానియా యూనివర్సిటీ శత వార్షికోత్సవాలు జరిగాయి. ఏడాది పాటు ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ప్రత్యేకంగా వందకోట్ల నిధులతో విశ్వవిద్యాలయ పురోగతికి ఎంతో చేస్తామన్న మాట ఆచరణకు నోచుకోలేదు. కనీసం వందేండ్ల ఉస్మానియా చరిత్రని ప్రతిఫలించే మహత్తర గ్రంథం వెలువడలేదు. వందేండ్ల ప్రయాణాన్ని సకల అంశాలతో రికార్డు చేసే వెబ్‌సైట్‌ని రూపొందించలేదు. ఒక విశ్వ విద్యాలయం చరిత్రలో నూరు సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. అద్భుతమైన ఆర్క్వైస్‌ రూపొందించాలి. ఈ దిశగా ప్రయత్నం చేసిన దాఖలాల్లేవు. ఆర్ట్స్‌కాలేజిలో తెలుగుశాఖ వెలువరించిన ‘శతవాసంతిక’ అనే సంచిక మాత్రమే చెప్పుకోదగిన రీతిలో వెలువడింది. వందేండ్ల ఓయూలో తెలుగుశాఖ కృషికి అద్దం పట్టే నాలుగు వందల పేజీల సంచిక ఇది. ఈ రీతిగా ప్రతి డిపార్ట్‌మెంట్‌ తన వందేండ్ల నడకని రికార్డు చేయాలి. దీనికి సంబంధించిన దిశానిర్దేశం చేయక పోవడంతో శతాబ్ది ఉత్సవాల ప్రభావం నామమాత్రమైంది. వందేండ్ల చరిత్ర ఆనవాళ్ళు కళ్ళముందే కరిగిపోతున్నాయి.

హైదరాబాద్‌ని డల్లాస్‌ చేస్తామని, సింగపూర్‌ చేస్తామని మాటలెన్నో చెబుతారు. కానీ ఈ నగరం ప్రతిష్టని ఇనుమడింపజేసే ఉస్మానియా గౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏం చేసిందన్నదే ప్రశ్న. ఇటీవలి చరిత్రలో ఉస్మానియాకు పదిహేను నెలలుగా వీసీి లేకుండా కొనసాగటం ఇదే ప్రథమం. తెలంగాణ రాష్ట్ర సాకారానికి ఉద్యమవేదికగా పనిచేసిన ఓయూ ఇవాళ ఏ స్థాయిలో ఉండాలి? ఎలా ఉంది? అనేక డిపార్ట్‌మెంట్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వచ్చాక కొత్త చరిత్రని సృష్టించాల్సిన విశ్వవిద్యాలయం ఆగమాగమైంది. అస్తవ్యస్థంగా ఉంది. అరకొర నిధులతో అల్లాడుతున్నది.

ఇన్‌చార్జిల పాలన
2019 జూలై ఆఖరు నుంచి తెలంగాణలోని విశ్వ విద్యాలయాలు ఇన్‌చార్జిల ఏలుబడిలో కొనసాగుతున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ పదవీకాలాన్ని మాత్రమే పొడిగించారు. మిగతా యూనివర్సిటీలు ఇన్‌చార్జిల పాలనలో ఉన్నాయి. పదిహేను నెలలుగా విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్సలర్‌లు లేరు. విశ్వవిద్యాలయాల తీరుతెన్నులపై ప్రభు త్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇన్‌చార్జిలుగా ఉన్న అధికారులకు ఇతర ప్రధాన బాధ్యతలు ఉంటాయి. యూనివర్సిటీలకు సంబంధించిన పనులు వారికి రెండో ప్రాధాన్యమే. అత్యవసరమైతే తప్ప వాటి మీద దృష్టి సారించే సమయం వారికి ఉండదు. అంతేగాక అకాడమిక్‌ నేపథ్యం నుంచి వచ్చిన వీసీల దృష్టికోణం ఇన్‌చార్జిలకు ఉండే అవకాశం లేదు.

ఇన్‌చార్జిల్ని నియమించేది తాత్కాలిక సర్దుబాటు కోసం మాత్రమే. కానీ పదిహేను నెలలపాటు ఇన్‌చార్జిలతోనే విశ్వవిద్యాలయాల్ని నడిపించడం సహేతుకం కాదు. విద్యావ్యవస్థ ఉన్నతికి ఇది తగని పని. అయినా ఎందుకీ తాత్సారం? ఎందుకింత అలక్ష్యం?

ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పట్టం
కరోనా విపత్తు కారణంగా కొన్ని పనుల్లో జాప్యం సహజం అంటారేమో. కానీ ఇదే విపత్తు కాలాన ప్రైవేటు విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఉద్యమకాలాన కెజి టు పిజి ఉచితవిద్య అని వాగ్దానం చేసిన టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అయిదు ప్రైవేటు యూనివర్సిటీలలో పేద విద్యార్థుల ప్రవేశానికి అవకాశం లేదు. డబ్బున్న మారాజుల పిల్లలే వాటిలో చేరగలరు. ఈ ఏడాది మేలో గవర్నర్‌ ఆమోద ముద్రతో తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మొదలయ్యాయి.

కోవిడ్‌-19 విపత్తులో వీటి ఏర్పాటుకు అను మతించడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ తెలంగాణలో విశ్వవిద్యాలయాల వీసీల నియామక ప్రక్రియకు మాత్రం వీలు చిక్కలేదు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 22న లాక్‌డౌన్‌ మొదలయింది. అప్పటికి ఎనిమిది నెలలు (2019 జూలై) గడిచినా వీసీిల్ని నియమించే తీరిక, మనసు ప్రభుత్వానికి లేకపోయింది. లాక్‌డౌన్‌ సడలింపుల దశ మొదలయినప్పటికీ వీసీల నియామక ప్రక్రియది మాత్రం నత్తనడకనే.

వీసీలు ఉంటే…
విశ్వవిద్యాలయాల్లో రొటీన్‌గా జరిగే పనులు జరుగు తున్నాయి. ఇన్‌చార్జిల వద్దకే రిజిస్ట్రార్లు వస్తున్నారు. ఇన్‌చార్జిలకు సమయం వుంటే విశ్వవిద్యాలయాలకు వెళతారు లేదంటే లేదు. సమయం చిక్కినపుడు హైదరాబాద్‌లో ఉన్న ఓయూ తెలుగు విశ్వవిద్యాలయం సందర్శించడం ఇన్‌చార్జిలుగా ఉన్నవారికి సులువు. ఎందుకంటే ఇన్‌చార్జిలుగా ఉన్న ఐఏఎస్‌లంతా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్నారు. కానీ వరంగల్‌, పాలమూరు, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండలలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ఇన్‌చార్జిలుగా ఉన్నవారు ఎన్నిసార్లు వెళ్ళగలరు. వాటి కోసం ఎంత సమయం వెచ్చించగలరు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ కయితే నాలుగేండ్లకు పైగా వైస్‌ చాన్సలర్‌ లేరు. ఎంత విషాదం! ఒక విశ్వవిద్యాలయానికి వీసీి నియామక ప్రక్రియ ఇంత ఆలస్యమా? ఎవరూ అడగనంత మాత్రాన ఇంత పట్టింపులేనితనమా?

మారిన పరిస్థితుల్లో…
గత ఏడాది నుంచి మారిన యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల పాలన ఒక పద్ధతిగా నడవాలి. వాటి నిర్వ హణకు సంబంధించి యూజీసీ నిధుల కేటాయింపుల కోసం తగిన సమాచారాన్ని పకడ్బందీగా అందించడం విశ్వ విద్యాలయాల బాధ్యత. రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) నిధులను సక్రమంగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ నిధులు మురిగిపోకుండా చూడాలంటే యూనివర్సిటీలకు పూర్తికాలపు వైస్‌ చాన్సలర్‌లు ఉండాలి. గత ఏడాది రూసా కింద నిధుల మంజూరుకు ఉస్మానియా, తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాలు ఎంపికయ్యాయి. రూసానిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్‌ గ్రాంటు కింద కొంత మొత్తం కేటాయించాలి.

కరోనా కారణంగా రూసా నిధులకు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో పడ్డాయి. అయితే మున్ముందు ప్రతి ఏడాది రూసా కింద నిధులు రప్పించుకోవాలంటే యూనివర్సిటీల పాలనా వ్యవహారాలకు సంబంధించి బాధ్యత వహించే వైస్‌ చాన్సలర్‌లు అవసరం. సిబ్బందికి జీతాలు ఇవ్వడం, అడ్మిషన్ల నిర్వహణ మాత్రమే వీసీల పనికాదు. విశ్వవిద్యాలయాల్లో విద్యావ్యవస్థ ఉన్నతస్థాయిలో క్రమశిక్షణతో కొనసాగడానికి పలురకాల కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన వ్యవస్థాగతమైన అంశాల సమన్వయం వీసీల ద్వారానే సాధ్యం. ఈ విషయం అధికారంలో ఉన్నవారికి తెలియదనుకోగలమా?

నియామకాలు శూన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి 2012లో ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ తరువాత 2013 నుంచి ఇప్పటివరకు విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ శూన్యం. అధికారికంగా 1100 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కానీ నియామకప్రక్రియలో అడుగు ముందు పడింది లేదు. ఈ నియామక ప్రక్రియని ఇన్‌చార్జిలుగా ఉన్నవారు తలకెత్తుకోలేరు. గత ఆరేండ్లుగా అనేకమంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రిటైరవుతూ వస్తున్నారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం దాదాపు 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా డిపార్ట్‌మెంట్లలో పార్ట్‌టైమ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. పోస్టుల భర్తీకోసం పడిగాపులు కాస్తున్నవారు వేలసంఖ్యలో ఉన్నారు. ఆశగా ఎదురుచూడటమే తప్ప చేసేదేం లేక నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడేవారు అనేకులు.

నీళ్ళు, నిధులు, నియామకాలు లక్ష్యంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ విద్యార్థుల త్యాగం అపారమైనది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విద్యార్థుల భూమిక ప్రత్యేకమైంది. తెలంగాణ ఉద్యమచరిత్రలో ఉస్మానియా విద్యార్థులది ప్రత్యేక అధ్యాయం. రాష్ట్రం అవత రించి ఆరేండ్లు దాటినప్పటికీ విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి నిజాయితీగా ప్రయత్నించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. తెలంగాణ వస్తే పుష్కలంగా ఉద్యోగాలు వస్తాయని ఆశించినవారి ఆశలు అడియాసలయ్యాయి.

స్నాతకోత్తర విద్య
పదిహేనేండ్ల పాటు చదువుకొన్నాకనే స్నాతకోత్తర విద్య కోసం విశ్వవిద్యాలయంలోకి వస్తారు. ప్రవేశ పరీక్షలు రాసి, ప్రతిభా సంపత్తులు నిరూపించుకొని పీజీ (స్నాతకోత్తర) విద్యా కోర్సుల్లోకి ప్రవేశిస్తారు. వారి ప్రతిభకు సానబెట్టే స్థాయిలో విశ్వవిద్యాలయాలు ఉండాలి. అలాగే వారిలో పరిశోధన, కొత్త అంశాలపై జిజ్ఞాసని ప్రోది చేసేలా కోర్సుల రూపకల్పన జరగాలి. పీజీలోకి రావడమంటే రెండేండ్లు హాస్టల్‌లో ఉండి ఏవో పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకోడం కాదు. వారిని పోటీ పరీక్షల వైపు నెట్టడం ప్రభుత్వాల తప్పిదమే.

స్నాతకోత్తర విద్యాస్థాయిలో చదువుకునే విద్యార్థులు రేపు ఎలా అనే బెంగపడితే కొత్తగా ఆలోచించలేరు. ఏదో సాధిం చాలన్న భావోద్వేగాలతో తమ శక్తియుక్తుల్ని వినియోగిం చలేరు. పీజీలో చేరాక కూడా ఉద్యోగం వస్తుందో రాదో అనే బెంగటిల్లే పరిస్థితులు విద్యావ్యవస్థకు అవమానం. పిహెచ్‌డి చేసినా నిరుద్యోగులుగా మిగిలిపోవడం అవమానాలకు పరాకాష్ట. కానీ అధికారంలో ఉన్నవారు తమ నిర్వాకానికి కొంచెం కూడా సిగ్గుపడరు. ఈ సిగ్గు, బిడియం ఉన్నవారయితే నెలల తరబడి విశ్వవిద్యాలయాలని వీసీలు లేకుండా నడిపిస్తారా?

అన్నీ ప్రశ్నలే
విశ్వవిద్యాలయాల్లోని చదువులు, పరిశోధనలు, నిరుద్యోగ తీవ్రత గురించి యోచిస్తే అన్నీ ప్రశ్నలే మిగులుతాయి. ‘విశ్వవిద్యాలయం’ అన్న పదమే మహత్తరమైంది. ‘నా విశ్వవిద్యాలయాలు’ అని మాక్సిమ్‌ గోర్కీ తన పుస్తకానికి పేరు పెట్టడమే ఇందుకు దాఖలా. విశ్వవిద్యాలయం అనే పదానికి ఉన్న ఔన్నత్యమది. అక్కడ చదివేవారు, చదువు చేప్పేవారు అత్యున్నత ప్రతిభా సంపత్తులతో, వినూత్న ఆలోచనలతో సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయిని కనబరచాలి. అందుకు అనువైన రీతిన తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు రూపొందాలన్న సంకల్పం తెలంగాణ పాలకులకు ఉండాలి. కానీ వారి ఆచరణలో ఆ విజ్ఞత, కాంక్ష కనిపించడం లేదు. విసిల నియామకంలో నెలల తరబడి జాప్యం వల్ల సాధించేదేమిటి? విశ్వవిద్యాలయాల వ్యవస్థకు ఇది విఘాతం. విసిలు లేని యూనివర్సిటీలంటే నగుబాటు కాదా?

Courtesy Nava Telangana