• ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
  • హెల్త్‌ బులెటిన్లలో గారడీ లెక్కలు!
  • ప్రభుత్వ చర్యలు చాలవు
  • కిట్ల సంఖ్య కాదు.. ఎన్ని ఇచ్చారన్నదే ముఖ్యం
  • రక్షణ లేకపోవడంతో వైద్యులపై దాడులు: హైకోర్టు

హైదరాబాద్‌ : కొవిడ్‌-19కు చికిత్స చేయడానికి వినియోగించే పీపీఈ కిట్లు, గ్లౌజులు, ఎన్‌-95 మాస్కులు, ఇతర పరికరాల నిల్వలు ఏమేరకు ఉన్నాయో చెప్పాలని గాంధీ, నిమ్స్‌, ఫీవర్‌, కింగ్‌ కోఠి ఆసుపత్రుల సూపరింటెండెంట్లను హైకోర్టు ఆదేశించింది. వాటిలో ఎన్నింటిని చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అందించారని ప్రశ్నించింది. గురువారం జరిగే విచారణకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావులు హాజరై పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. గాంధీ ఆసుపత్రిలో గత 15 రోజులుగా కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె, వారి డిమాండ్లు ఏమిటో తెలపాలని హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందించడం లేదంటూ న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ రాసిన లేఖను ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది.

ఆయా కేంద్రాల్లోని అధికారులు కరోనా పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారని, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఉన్నట్లు మీడియాలో కథనాలు చూసామని  తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా వాస్తవ లెక్కలు మరుగుపర్చి తక్కువ పరీక్షలు చేస్తోందంటూ యూరప్‌ దేశాలు చెబుతున్నాయని’’ ధర్మాసనం వ్యాఖ్యానించింది.  ‘‘గాంధీ ఆసుపత్రినే కరోనా ఆసుపత్రిగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? నిమ్స్‌లో కూడా కరోనాకు చికిత్స అందిస్తున్నప్పుడు గాంధీకే ఎక్కువ మంది రోగులను ఎందుకు మళ్లిస్తున్నారు? నిమ్స్‌కు రోగులు ఎందుకు వెళ్లడం లేదు? దీని వెనుక మతలబేంటని’’ ధర్మాసనం ప్రశ్నించింది.. కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, మాస్కుల నిల్వలు ఏమేరకు ఉన్నాయన్నది అప్రస్తుతమని, చికిత్స అందించే సిబ్బందికి ఎన్ని ఇస్తున్నారన్నదే ముఖ్యమని తెలిపింది.

తెలంగాణలో పరిస్థితి దారుణాతి దారుణంగా మారుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవని తెలిపింది. కరోనాకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వద్ద తగినంతమంది పోలీసు సిబ్బందిని నియమించకపోవడంతో రోగుల బంధువులు వైద్యులపై దాడులకు దిగుతున్నారని, గాంధీలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగడానికి ఇదే ప్రధానకారణమని అభిప్రాయపడింది.

Courtesy Andhrajyothi