గండం గట్టెక్కేదెలా

గండం గట్టెక్కేదెలా

రాబడులు 45 శాతం, ఖర్చులు 50 శాతం
రాన్రాను తగ్గుతున్న పన్నుల వాటా
రాష్ట్ర ఆర్థిక స్థితిపై సమీక్షకు ఆర్థిక శాఖ సిద్ధం
ప్రాధాన్య పథకాలకు కోత లేకుండా.. మిగిలిన వ్యయాల నియంత్రణపై కార్యాచరణ
మంత్రి మండలికి నివేదిక అందించేందుకు కసరత్తు
రాబడులు తగ్గాయి..ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విపత్కర పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షకు సిద్ధమైంది. రాబడులు, వ్యయం మధ్య అంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలలు ముందుకు ఎలా వెళ్లాలి? అనే అంశంపై ఆర్థిక శాఖ కసరత్తు ఆరంభించింది. మరో రెండు రోజుల్లో భేటీ కానున్న మంత్రి మండలికి ఆర్థిక పరిస్థితులపై సమగ్ర వివరాలు అందించేందుకు సిద్ధమవుతోంది. 2020-21 బడ్జెట్‌ రూపకల్పనపైనా మంత్రి మండలి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్న క్రమంలో తాజా పరిస్థితులను ఆర్థిక శాఖ సమగ్రంగా వివరించనుంది. శాఖల వారీగా కేటాయింపులు, వ్యయం.. నాలుగు నెలల్లో పాటించాల్సిన ఆర్థిక క్రమ శిక్షణపై శాఖలకు దిశానిర్దేశం చేయనుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్‌ సమీక్షించడంతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి పన్నుల వాటా, పెండింగ్‌లో ఉన్న బకాయిలు, జీఎస్టీ పరిహారంతోపాటు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు అందిన నిధుల లెక్కలనూ ఆర్థిక శాఖ అధికారులు మంత్రి మండలికి వివరించనున్నారు. రుణాలు కాకుండా రాష్ట్రానికి సొంత పన్నుల రాబడి, కేంద్ర పన్నుల వాటా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు, పన్నేతర రాబడిని రూ.1,13,099 కోట్లుగా అంచనా వేశారు. అక్టోబరు చివరి నాటికి రూ.51,355 కోట్లే వచ్చింది. అంచనాల్లో ఇది 45 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24,081 కోట్లు అప్పుల రూపేణా సమకూర్చుకోవాలన్నది అంచనా కాగా..అక్టోబరు ఆఖరు నాటికే రూ.17,500 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఏడాది మొత్తం వ్యయం రూ.1,37,226 కోట్లని అంచనా వేయగా ఇప్పటివరకు  రూ.68,882 కోట్లు(దాదాపు 50 శాతం) వ్యయమైంది. ఆర్థికంగా మందగమనం మరికొంత కాలం కొనసాగుతుందని ఆర్థిక శాఖ అంచనా. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా రానున్న నాలుగు నెలల్లో ఖర్చును నియంత్రించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆర్థిక శాఖ భావిస్తోంది. వేతనాలు, పింఛన్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు ఇచ్చే నిధుల్లో కోత విధించే అవకాశం లేనందున, మిగిలిన అంశాల్లో ఎక్కడెక్కడ వ్యయ నియంత్రణ అవసరమనే అంశంపై ఆర్థిక శాఖ వివిధ శాఖలతో సమీక్షించనున్నట్లు తెలిపారు.
ఆదుకోని జీఎస్టీ, అమ్మకం పన్ను
అక్టోబరు వరకూ రాష్ట్రంలో పన్ను రాబడులు గత ఏడాది కంటే తగ్గాయి. ప్రధానంగా జీఎస్టీ రాబడి, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావమే చూపాయి. జీఎస్టీ రాబడులు  గత ఏడాది కంటే తక్కువగా ఉండగా, సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరు వసూళ్లు మరింత తగ్గాయి. రాష్ట్ర రాబడుల్లో కీలకమైన అమ్మకం పన్నులో గత ఏడాది కంటే స్వల్ప పెరుగుదల నమోదైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ రాబడి మాత్రం లక్ష్యంలో 60 శాతానికి చేరుకోగా, ఎక్సైజ్‌ ఆదాయంలో స్వల్ప పెరుగుదల ఉంది.

(Courtesy Eenadu)