హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను మరోసారి వాయిదా వేసినట్టు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకు తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో తప్పా మిగతా అన్ని జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు హైకోర్టు శనివారం సాయంత్రం అనుమతి ఇచ్చింది. విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకకుండా పరీక్షా కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై చర్చించాక పరీక్షలను మొత్తం వాయిదా వేస్తున్నట్టు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను మరోసారి వాయిదా వేసినట్టు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకు తెలిపారు. పరీక్షల విషయంలో అనుసరించాల్సిన కార్యాచరణ గురించి ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశం తర్వాత పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

హైకోర్టు తీర్పును అనుసరించి రెండు పర్యాయాలు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని భావించిన ప్రభుత్వం మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో ఎగ్జామ్స్‌ నిర్వహించినా ఫలితాలు విడుదల చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయంతో ప్రభుత్వం మొత్తం పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షలన్నీ ఒక్కసారే నిర్వహించాలన్న యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. పరీక్షలు నిర్వహిస్తారా, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను అప్‌గ్రేడ్‌ చేస్తారా అనేది వేచిచూడాలి.