– గుడిపాటి

తెలంగాణ భాష, సాహిత్యాల వికాసం తెలంగాణ భాషాభిమానులు, సాహిత్యప్రియులు ఆశించిన రీతిలో కొనసాగడం లేదన్న మాట ఈమధ్యన తరచుగా వినిపిస్తున్నది. మనకు తెలంగాణ అధికార భాషా సంఘం, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌, తెలుగు అకాడమీ ప్రముఖంగా భాషా, సాహిత్యాల ఉన్నతికోసం పనిచేసే సంస్థలుగా కనిపిస్తున్నాయి. కానీ వీటి పనితీరు తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతున్నదా అన్నదే ప్రశ్న.

తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతుల ఉన్నతి తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో అంతర్భాగం. నిజానికి భాషా, సాహిత్యాల విషయంలో వివక్షకు వ్యతిరేకంగానే తొలుత కవులు, రచయితలు గళమెత్తారు. నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు అనే అంశం తర్వాత ఉద్యమకాలంలో భాగమయ్యాయి. ఇలా విభిన్న నినాదాల నేపథ్యాన తెలంగాణ సాధన ఎజెండాగా సాగిన ఉద్యమం తన లక్ష్యాన్ని చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏ డిమాండ్లతో ఉద్యమం సాగిందో అందుకు అనువుగా తెలంగాణ పాలనావ్యవస్థ ముందుకు సాగుతున్నదా అన్నదే ప్రశ్న. తొలుత ఉద్యమానికి దారులు వేసిన తెలంగాణ భాష, సాహిత్యాలకు సంబంధించిన పురోగతి ఏ రీతిన ఉంది? ఈ రంగాలలో తెలంగాణ రాకముందు, వచ్చాక మనం సాధించిన ఉన్నతీకరణ ఏమిటి? తెలంగాణ భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాల ప్రయాణం తెలంగాణ సృజనాత్మక వికాసానికి ఏమేరకు దోహదం చేస్తుంది? అన్నవి ప్రధానమైన ప్రశ్నలు.

సంస్థల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 27 ఏప్రిల్‌ 2016న తెలంగాణ అధికార భాషా సంఘం ఏర్పడింది. ఏడాదిపాటు కాలానికి క్యాబినెట్‌ ర్యాంకు పదవిలో దేవులపల్లి ప్రభాకరరావు అధ్యక్షునిగా నియమితులయ్యారు. తరువాత పదవీకాలాన్ని పొడిగించడం వల్ల ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా తెలంగాణ భాష నిర్లక్ష్యానికి గురయింది. పాలనాపరంగా తెలంగాణ అంతటా తెలుగు భాష అమలుకు అధికార భాషా సంఘం చేయాల్సింది ఎంతో ఉంది. అయితే ఒక సంస్థగా అధికార భాషా సంఘం స్వరూపమే నాలుగేండ్ల అనంతరమూ ఒక కొలిక్కి రాలేదు.

ఒక సంస్థాగత ఏర్పాటు, సిబ్బంది నియమాకం, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణం పనిచేయడం ద్వారానే సానుకూల ఫలితాలు సమకూరుతాయి. కానీ తెలంగాణ అధికార భాషా సంఘానికి అధ్యక్షుడే తప్ప సభ్యులు లేరు. కేవలం అధ్యక్షపదవిలో ఉండే ఒక వ్యక్తి ఏం చేయగలడు? చేయడానికి ఉన్న అవకాశాలేమిటి? నాలుగేళ్ళయినా అధికార భాషా సంఘానికి ఓ నలుగురు సభ్యుల నియామకం జరగకపోవడానికి బాధ్యులెవరు? ‘తెలంగాణ అధికార భాషా సంఘం’ అనే మాటనే ఎంతో హుందాగా ఉంది. నాలుగేండ్ల అనంతరం తిరిగి చూసుకుంటే భాషా సంఘం ఏం చేసింది? ఎలాంటి ఫలితాలు సాధించింది? తెలంగాణ ప్రజల్లో భాషకు సంబంధించిన సోయి, చైతన్యం ఏమేరకు ఇనుమడింప జేసింది? అన్నవి సహజంగా తలెత్తే ప్రశ్నలే. వీటికి జవాబుల్లేవు. సభ్యులే లేకుండా సంస్థని నడపమంటే అధ్యక్షుడు మాత్రం ఏం చేయగలడు?

తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌
భాషా సాహిత్యాల వికాసం పుస్తకాలతో, గ్రంథాలయా లతో ముడిపడి వుంది. తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ 2017లో ఏర్పడింది. గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా ఆయాచితం శ్రీధర్‌ నియమితులయ్యారు. ఇక్కడా ఇప్పటివరకు పరిషత్‌ సభ్యుల్ని నియమించలేదు. తెలంగాణ జిల్లాలన్నిటికి జిల్లా గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుల్ని నియమించారు. కానీ జిల్లా గ్రంథాలయ పరిషత్‌ కమిటీల సభ్యుల నియామకం ఇప్పటివరకు జరగలేదు. కమిటీలు లేకుండా, సభ్యులు లేకుండా సంస్థల ఏర్పాటు వల్ల ఉపయోగం ఏమిటి? గతంలో గ్రంథాలయ పరిషత్‌లకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలకు సభ్యులుండేవారు. సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. కేవలం అధ్యక్షుడే తనంతట తాను నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం తగని పని. కనుకనే సభ్యులతో కూడిన కమిటీల నియామకం వ్యవస్థాగత ఏర్పాటులో భాగం. గ్రంథాలయ పరిషత్‌ల విషయంలోనూ ఈ సూత్రాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది.

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ రచయితల, కవుల పుస్తకాలతో తెలంగాణ గ్రంథాలయాలు కొలువుతీరాలి. గ్రంథాలయ పరిషత్‌ ద్వారా ప్రభుత్వం పుస్తకాలు కొనుగోలు చేయాలి. ప్రభుత్వపరంగా ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాజారామ్మోహన్‌ రారు లైబ్రరీ వారు అందించే ఫండ్స్‌ సహకారంతో రెండు సార్లు పుస్తకాలు కొన్నారు. రెండోసారి గత ఏడాది డిసెంబర్‌లో కొన్న పుస్తకాలకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. రచయితల, ప్రచురణకర్తల నించి ఒక్కొక్క టైటిల్‌ని తొలిసారి 20 కాపీలు, రెండోసారి 45 మాత్రమే కాపీలు కొన్నారు. గత ఆరేళ్ళ కాలంలో చాలా జిల్లాలు కొత్త పుస్తకాలు కొనలేదు. నిధుల లేమినే ప్రధాన సమస్య. తెలంగాణలో దాదాపు 650 లైబ్రరీలున్నాయి. అవి కొత్త పుస్తకాలు లేక వెలవెలబోతున్నాయి.

గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్సు కూడా అంతర్భాగం. ఈ సెస్సు కింద వచ్చే నిధులు గ్రంథాలయాలకు సరిగా అందడం లేదు. ఈ సెస్సు బకాయిల వసూలుకు గ్రంథాలయ పరిషత్‌లు చొరవ చూపాలి. ప్రభుత్వం కూడా సెస్సు కింద వసూలయిన మొత్తాన్ని గ్రంథాలయాల నిర్వహణకు, కొత్త పుస్తకాల కొనుగోళ్ళకు వినియోగించాలి. ఈ గ్రంథాలయ సెస్సుతో పాటు అదనంగా నిధులు కేటాయించి గ్రంథాలయాల పురోభివృద్ధికి కృషి చేయడం ప్రభుత్వం బాధ్యత. ఈ దిశగా పాలనా వ్యవస్థలో చలనం కోసం ఒత్తిడి చేయడంలో గ్రంథాలయ పరిషత్‌లు ముఖ్యపాత్ర వహిస్తాయి. అలాంటి పరిషత్‌లకు సభ్యులే లేకపోతే చేసేదేముంది.

ఒక్కటంటే ఒక్కటి…
తెలంగాణ సారస్వత సంపదని ఒక్కచోట చేర్చి పాఠకులకు, భావితరాలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఒక్కటంటే ఒక్క గ్రంథాలయం తెలంగాణలో గానీ, ‘విశ్వనగరం’గా రూపొందే హైదరాబాద్‌లో గానీ లేదు. తెలంగాణ నేల గర్వంగా చెప్పుకునే అత్యాధునాతనమైన మహత్తర గ్రంథాలయం ఒకటి నిర్మించాలన్న సంకల్పం ఏది? ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, కోదాటి నారాయణరావు వంటి ఉద్ధండులు పుస్తకాలను ఉద్యమంగా జనంలోకి తీసుకెళ్ళారు. గ్రంథాలయాల స్థాపనని ఉత్తేజంతో నిర్వహించారు. నాటి సంకల్పం ఇవాళ తెలంగాణని పాలించేవారికి ఉంటే తెలంగాణ జ్ఞాన సమాజంగా ఏర్పడుతుంది. ఆ దృష్టి, సంకల్పం, పట్టుదల ఉన్నాయా అన్నదే సగటు తెలంగాణ పౌరుని సందేహం.

సాహిత్య అకాడమీ కథ ముగిసిందా?
ప్రముఖ కవి నందిని సిధారెడ్డి అధ్యక్షునిగా 2017లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడింది. కవి, అనువాదకుడు ఏనుగు నరసింహారెడ్డి అకాడమీ సెక్రటరీగా తర్వాత నియమితులయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో అకాడమీ క్రియాశీల పాత్రని పోషించింది. తెలంగాణ జిల్లాలన్నిటా సాహిత్య చైతన్యం పరిఢవిల్లడానికి సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. భిన్నప్రక్రియల్లో చర్చలకీ వేదికగా నిలిచింది. కొత్తతరం కవులకీ, రచయితలకీ శిక్షణా శిబిరాలు నిర్వహించింది. తెలంగాణ జిల్లాల సాహిత్యచరిత్రల్ని వెలువరించింది. దాదాపు 120 పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ సమగ్ర సాహిత్యచరిత్రని వెలువరించే ప్రయత్నంలో ఉండగానే నందిని సిధారెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మే నెలలో ముగిసింది. ఆ తరువాత కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. రెండు నెలల కిందట అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డిని అదనపు కలెక్టర్‌గా బదిలీ చేసింది. తన బాధ్యతల్ని కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణకు అప్పగించి నరసింహారెడ్డి రిలీవ్‌ అయ్యారు. ఇప్పటివరకు సాహిత్య అకాడమీకి పూర్తి కాలపు అధ్యక్షుడినిగానీ, కార్యదర్శిని గానీ నియమించలేదు.

ఈ పరిణామాల్ని గమనిస్తే సాహిత్య అకాడమీ కథ ముగిసిందనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి 2017లోనే సాహిత్య అకాడమీకి అధ్యక్షునితోపాటు సభ్యుల్ని నియమించాలి. కేంద్ర సాహిత్య అకాడమీ తరహాలోనే రాష్ట్ర సాహిత్య అకాడమీ స్వయంప్రతిపత్తితో తన పనులు తాను నిర్వహించాలి. అందుకుగాను అకాడమీ కమిటీ సభ్యుల నియామకం తప్పనిసరి. కానీ ఇతర సంస్థల మాదిరిగానే అకాడమీకి అధ్యక్షుడు తప్ప మరొకరిని ప్రభుత్వం నియమించలేదు. దీనివల్ల ఏం చేసినా అది అధ్యక్షుని ఇష్టారాజ్యమనే భావన పొడసూపింది.

తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో తెలంగాణ సాహిత్య అకాడమీ సృజనాత్మకంగా, క్రియాశీలకంగా పని చేసిందనడం నిస్సందేహం. అయితే ఆ పనితీరు మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా కొనసాగాలంటే అకాడమీకి కార్యవర్గం ఒకటి ఉండాలి. సంస్థాగత వ్యవహారసరళి ఉన్నపుడే అకాడమీ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. ఇందుకు భిన్నంగా కేవలం కొందరు వ్యక్తులకు పదవులు ఇస్తున్నామనే పేరిట నియామకాలు జరిగితే ఆయా సంస్థల మనుగడ, పురోగతి సవ్యమైన దిశలో ఉండదు.

సంగీతం, నాటకానికి ఒరిగిందేమిటి?
ఇతర సంస్థల తరహాలోనే తెలంగాణ సంగీత నాటక అకాడమీని బాదిమి శివకుమార్‌ అధ్యక్షునిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అకాడమీకి సైతం కమిటీ లేదు, సభ్యుల నియామకమూ జరగలేదు. సాహిత్య అకాడమికి నియమించినట్టు ఒక సెక్రటరీని కూడా అకాడమీకి నియమించలేదు. సభ్యులు లేక, సెక్రటరీ లేక, తగిన నిధుల్లేక సంగీత నాటక అకాడమి ఏం చేయగలదు. తెలంగాణ నాటక చరిత్ర అన్న గ్రంథం ఒక్కటి లేదు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి తప్ప నాటక ప్రదర్శనకు అనువైన ఒక్క థియేటర్‌ అయినా జిల్లాల్లో ఎక్కడా లేదు. తెలంగాణ సాంస్కృతిక వికాసం, నాటకరంగ వికాసం, తెలంగాణ సంగీతం ప్రత్యేకతలు లోకానికి తెలియాలంటే ఎంత కృషి జరగాలి. అందుకు అనువుగా పని చేయాలంటే తెలంగాణ సంగీత నాటక అకాడమీకి తగిన నిధులు కేటాయించాలి. ఒక సంస్థగా పని చేయడానికి అవసరమైన సభ్యుల, అధికారుల, సిబ్బంది నియామకం తప్పనిసరి. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా లాంటి సంస్థ తెలంగాణలో ఏర్పడాలి. ఇందుకోసం ఆలోచనలు చేయాలన్నా ఒక సంస్థగా సంగీత నాటక అకాడమి పని చేయగలగాలి. ఇందుకు అవసరమైన మానవ వనరుల్ని, నిధుల్ని అందించడం ప్రభుత్వం విధి.
ఈ రీతిగా చెప్పుకుంటే సంస్థల ఏర్పాటు, వ్యక్తుల నియామకాలకు సంబంధించి చాలా విషయాలు ప్రస్తావించాల్సి వుంటుంది. కానీ కేవలం భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన కొన్ని అంశాల్ని మాత్రమే గుర్తు చేయడమైంది. సమైక్య రాష్ట్రంలో కన్నా మిన్నగా తెలంగాణ రాష్ట్రంలో భాష, సాహిత్యాల విషయంలో పురోగతి కనిపించాలి. తెలంగాణ తెలుగు ప్రత్యేకతని గర్వంగా చెప్పుకునే రీతిన కార్యాచరణ ఉండాలి.

తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ భాష సాహిత్యాలకు, కళలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందుతుందన్న ఆశలు కొడిగొట్టడం, గ్రంథాలయాలు వెలవెలపోవడం, ఒక భాషగా తెలుగు ఆదరణ కోల్పోయే పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ఏ కలల సాకారం కోసం నాడు తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు ఏకమయ్యారో ఇవాళ గుర్తు చేసుకోవాలి. తెలంగాణ భాష, సాహిత్యాల సమున్నతకీ, సుసంపన్నతికీ ఒక్కటయి మరోసారి తమ గళం వినిపించడం ఇవాళ్టి అవసరం.

Courtesy Nava Telangana