• అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • సీఎం తీవ్ర ఆగ్రహం
  • ఢిల్లీ నుంచి రాగానే హుటాహుటిన ఉన్నత స్థాయిలో చర్చ
  • సంఘాలతో చర్చలకు స్వస్తి.. నేటి సాయంత్రం దాకా డెడ్‌లైన్‌
  • ఆలోపు డిపోలకు రాని కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినట్లే
  • వాళ్లను మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదు.. ఐఏఎస్‌ల కమిటీ రద్దు
  • కేసీఆర్‌ నిర్దేశంతో అర్ధరాత్రి రవాణామంత్రి అజయ్‌ హెచ్చరిక

వరుసగా మూడో రోజూ చర్చలు విఫలమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్‌ అని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి! అంతే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కార్మికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు! వారికి అల్టిమేటం జారీ చేశారు! శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు విధుల్లో చేరిన వారినే ఉద్యోగులుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. విధుల్లో చేరకపోతే తొలగింపేనని తేల్చి చెప్పారు. వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని నిర్దేశించారు. ఇక, ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవని తెగేసి చెప్పారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు, డ్రైవర్లను తెప్పించాలని ఆదేశించారు.

హైదరాబాద్‌:  ఐఏఎ్‌సల కమిటీ, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చలు మూడో రోజు శుక్రవారం కూడా విఫలమయ్యాయి. ‘‘డిస్మిస్‌ చేస్తాం. ఎస్మా ప్రయోగిస్తాం. మీ స్థానాల్లో కొత్త వారిని తీసుకుని పోస్టులను భర్తీ చేస్తాం’’ అంటూ కమిటీ హెచ్చరించింది. డిస్మిస్‌ చేసినా, ఎస్మాను ప్రయోగించినా.. సమ్మెను ఆపేది లేదని జేఏసీ తెగేసి చెప్పింది. రాష్ట్రంలోని 97 డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మిక వర్గాలు విధులను బహిష్కరించాలని నిర్ణయించాయి. అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొని, ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు.

సమ్మెపై సర్కారు సీరియస్‌ : ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. సమ్మెకు దిగుతున్న కార్మికులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇకపై వారితో చర్చలు ఉండవని తేల్చేసింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు ఆర్టీసీ డిపోల్లో విధుల్లో చేరిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. అప్పటికి విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిశ్చయించింది. విధుల్లో చేరని వారిని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోరాదని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. సీఎం కేసీఆర్‌ శుక్రవారం రాత్రి ప్రగతి భవన్‌లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా.. సమ్మెను కొనసాగించడానికే కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారని అధికారులు వివరించారు. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని ఉల్లంఘించి సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసినట్లు వివరించారు. చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పినట్లు తెలిపారు.

చట్ట ప్రకారం నడుచుకోవాలి: సీఎం : ఆర్టీసీ సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. ‘‘శనివారం సాయంత్రం ఆరు గంటల్లోగా విధుల్లో చేరిన వారినే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలి. మిగతా వారిని తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్న వారిగానే పరిగణించాలి. యూనియన్‌ నాయకుల ఉచ్చులో పడి కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దు. ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు’’ అని హితవు పలికారు. కార్మికుల డిమాండ్లపై యూనియన్లతో ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ, కార్మికులే సంస్థను ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సీఎం అభిప్రాయపడ్డారు. కార్మికులతో చర్చల కోసం నియమించిన త్రిసభ్య కమిటీని రద్దు చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా సందీ్‌పకుమార్‌ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది.

2600 బస్సులకు నేడు నోటిఫికేషన్‌ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పండుగ పూట ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని ఐఏఎ్‌సల కమిటీ ప్రకటించింది. సమ్మె నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే..ప్రైవేటు, స్కూలు బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నామని వెల్లడించింది. ఈ దిశగా ఇప్పటి వరకూ అధికారులు చేసిన ప్రయత్నాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏడు వేలకుపైగా బస్సులు నడపడం సాధ్యమవుతుందని అధికారులు చెప్పారు. మైలేజ్‌ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికిప్పుడు ప్రజల అసౌకర్యాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి బస్సులను తెప్పించాలని, ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేటర్లపై ఉదారంగా ఉండాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలకు ఇచ్చే పర్మిట్‌ రుసుంలో 25 ు రాయితీ ఇవ్వాలని నిర్దేశించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించారు.

Courtesy Andhrajyothi…