• 42 రోజులు దాటిన ఆర్టీసీ సమ్మె
  • నేడు ‘బస్‌రోకో’కు జేఏసీ పిలుపు.. డిపోల వద్ద 144 సెక్షన్‌

సకల జనుల సమ్మె రికార్డును ఆర్టీసీ కార్మికుల సమ్మె సమం చేసింది. శుక్రవారంతో 42 రోజులు పూర్తి చేసుకుంది. శనివారం కూడా కొనసాగితే సుదీర్ఘ కాల సమ్మెగా గుర్తింపు పొందుతుంది. 2011లో సెప్టెంబరు 13న ప్రారంభమైన సకల జనుల సమ్మె అక్టోబరు 24 వరకు.. అంటే 42 రోజుల పాటు కొనసాగింది. ఇప్పుడు 26 డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు అక్టోబరు 5న సమ్మె ప్రారంభించారు. ఆర్టీసీ చరిత్రలోనూ ఇదే పెద్ద సమ్మెగా నిలిచింది. ఇదివరకు 2001లో ఆర్టీసీ కార్మికులు 24 రోజుల పాటు సమ్మె చేశారు. కాగా 42వ రోజు సమ్మెలో భాగం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్‌ శివారులోని తీగలగుట్టపల్లిలో కేసీఆర్‌ ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గేటువద్ద కూర్చుని ధర్నా చేశారు. కార్మిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌ రీజియన్‌ వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు శుక్రవారం బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. నిర్మల్‌, భైంసా డిపోల్లోకి వెళ్లిన కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు యత్నించారు. వారిని పోలీసులు నియంత్రించబోగా వాగ్వాదం చోటు చేసుకుంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి. సమ్మెపై స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాశారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. తాము విధులు నిర్వహించిన రెండు నెలల కాలానికి వేతనాలు ఇవ్వలేందంటూ పెదపల్లి జిల్లా గోదావరిఖని డిపో మేనేజర్‌పై కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఆర్టీసీ జేఏసీ ఆందోళనల కార్యాచరణలో భాగంగా శనివారం నిరాహార దీక్షలు జరగాల్సి ఉండగా.. నాయకులు శుక్రవారం సాయంత్రం ‘బస్‌రోకో’ కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనిపై హుటాహుటిన సమీక్షలు జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ 144 సెక్షన్‌ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. శుక్రవారం రాత్రి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లలో సీపీలు 144 సెక్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బస్‌భవన్‌ సహా.. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడితే.. కేసులు తప్పవని వారు ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కోయంకయ్య బంజర ప్రాంతానికి చెందిన రామ్మూర్తి పదేళ్లుగా కొత్తగూడెం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. సమ్మెతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో దివ్యాంగురాలైన భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేందుకు ఆయన కూలీగా మారారు.

Courtesy AndhraJyothy..