• సమ్మెతో దినసరి కూలీలు, రైతులు, కళాకారుల అవతారమెత్తిన డ్రైవర్లు, కండక్టర్లు
  • కులవృత్తులతో కుటుంబానికి ఆసరా
  • ఇంటి ఖర్చులు వెళ్లదీసేందుకూ నానా కష్టాలు

కూరగాయలు అమ్ముతూ.. కుండలు తయారుచేస్తూ.. వాల్‌ పెయింటింగ్స్‌ వేస్తూ.. తాటిచెట్లు ఎక్కి కల్లుగీస్తూ.. పత్తి ఏరుతూ కనిపిస్తున్న వీరంతా రైతులో, దినసరి కూలీలో, కళాకారులో కానేకాదు!! సమ్మె నేపథ్యంలో వేతనాలు అందకపోవడంతో ఇంటి ఖర్చులు వెల్లదీసేందుకు తమకు తెలిసిన పనులు చేస్తున్న అసలు సిసలు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం తమపై కనికరం చూపని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పనులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదనగా చెబుతున్నారు. ఇకనైనా తమ కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్నేళ్లు ఆర్టీసీకి సేవ చేసినందుకు దక్కిన ఫలితం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.మంచిర్యాల జిల్లా ఆవడం గ్రామానికి చెందిన కండక్టర్‌ జి. కేశన్న తన కులవృత్తి అయిన కుండల అమ్మకాన్ని నమ్ముకున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఐరెండ్ల కుండలను తయారు చేస్తున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ వెల్దాస్‌ వెంకన్న గౌడ్‌ ఉద్యోగంలో చేరాక గీతవృత్తిని పక్కన పెట్టారు. సమ్మె నేపథ్యంలో ఇంటి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు తిరిగి తాళ్లు గీసేందుకు సిద్ధపడ్డారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి(పెయింటర్‌) బాబూరావు వాల్‌ పెయింటింగ్‌లు వేసే పని చేస్తున్నారు. సమ్మె ముగిసేదాకా తమకు కడుపు నింపే మార్గం ఇదేనని ఆయన అంటున్నారు.

 

Courtesy Andhrajyothy…..