ఇప్పటికే ఆర్టీసీకి 40 ఎలక్ట్రిక్ అద్దె బస్సులు
‘మేఘా’కి చెందిన ఒలెక్ట్రా

కంపెనీ నుండి కొనుగోలుసగం సబ్సిడీ కేంద్రానిది…
మరో సగం రాష్ట్ర సర్కారువి
ఆర్టీసీకి దక్కాల్సిన
సబ్సిడీ కంపెనీ ఖాతాలోకి?
పైసా పెట్టకుండానే అద్దెబస్సుల పేరుతో ప్రయోజనం
నాలుగోరోజు సోదాల్లో
ఐటీ అధికారుల ఆరా

హైదరాబాద్కాళేశ్వరం, మిషన్ భగీరథ సహా రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న మేఘా కంపెనీపై నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల టీమ్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని మేఘా కృష్ణారెడ్డి ఇంటితో పాటు బాలానగర్, జూబ్లీహిల్స్ డైమండ్ హౌస్ లలో సోదాలు చేసింది. కంపెనీ చేస్తున్న 8 పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి మూడేండ్లలో జరిగిన లావాదేవీల వివరాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. బాలానగర్ లోని ఆంధ్రా బ్యాంక్, బొల్లారంలోని ఐడీబీఐ బ్యాంక్,  కోటక్ బ్యాంకుల్లోని ఖాతాల వివరాల్ని సేకరించారు. కొన్ని లాకర్లు తెరిచి, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంస్థ బ్యాంక్ లావాదేవీలతో పాటు ఇతర ఆర్థిక వ్యవహారాలు, ప్రాజెక్ట్ లు, టెండర్ల రికార్డులు స్వాధీనం చేసుకుంది. సోమవారం బాలానగర్ లోని మేఘా ఇన్ ఫ్రా ఆఫీసులో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించి కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి అద్దెబస్సులుగా ఓలెక్ట్రా కంపెనీ ఇచ్చిన 40 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, సబ్సిడీ సొమ్ముపై ఐటీ అధికారులు ఆరా తీయడం కలకలం రేపుతోంది.

ఏంటీ ఓలెక్ట్రా డీల్?
రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) చేసుకున్న ఒప్పందం ప్రకారం అదే గ్రూప్ కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌‌టెక్‌‌ సంస్థ 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీకి అద్దెబస్సులుగా సప్లయ్ చేసింది. ఇందులో ఒక్కో బస్సు రేటు రూ.2 కోట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్’ (ఫేమ్) అనే స్కీం కింద ఒక్కో బస్సుపై రూ.కోటి సబ్సిడీ వస్తుంది. మన రాష్ట్రానికి మొత్తం 344 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. వీటిలో 309 బస్సులను హైదరాబాద్ లో, 35 బస్సులను వరంగల్ లో ఉపయోగించాలని ప్రతిపాదించారు. మొదటి విడతగా రూ.80 కోట్లతో 40 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేశారు. మిగతా బస్సులను కూడా తీసుకోవడానికి ఒప్పందం జరిగింది. ఈ బస్సుల తయారీ కోసమే జడ్చర్ల దగ్గర ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఈ డీల్, సబ్సిడీ చెల్లింపుల వివరాలనే ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ లో ఒక్కో బస్సుకు రూ.కోటి రాష్ట్ర సర్కారు చెల్లించగా, మరో కోటి కేంద్ర సబ్సిడీగా వచ్చింది. అద్దె బస్సులుగా ఆర్టీసీలోకి తీసుకున్న ఈ బస్సుల సబ్సిడీ ప్రయోజనం రూ.40 కోట్లు ఆర్టీసీకే రావాలి. అలా కాకుండా కంపెనీ ఖాతాలోకి చేరినట్లు తెలుస్తోంది. దీనిపైనే ఐటీ అధికారులు వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రా పేరుతో ఉన్న కంపెనీనే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గా మార్చారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు చెందిన ఈ కంపెనీలో మేఘా సంస్థ వాటాదారుగా ఉంది.

ప్రైవేటు కూడా అందుకేనా?
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలోనే 21 శాతం ఉన్న అద్దె బస్సులను 30 శాతానికి పెంచుతామనీ, మరో 20 శాతం పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మేఘాకి ఇచ్చేందుకే ప్రైవేటు ప్రతిపాదన చేస్తున్నారనీ, అందుకే సర్కారు సమ్మెను రెచ్చగొట్టిందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే సర్కారు చేసిందని నేతలు ఆరోపించారు.

ప్రాజెక్టుల లావాదేవీలపై ఆరా
మేఘా కంపెనీకి అనుబంధంగా ఉన్న 42 కంపెనీల డాకుమెంట్లు, లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించిన డబ్బు, బిల్లుల సొమ్ము ఎటు మళ్లిందన్న వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. ప్రీడిటర్మయిన్డ్ కాంట్రాక్టులు పొందిన మేఘా సంస్థ అర్హతలపై ఆరా తీశారు. కృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన ఒకరిని బ్యాంకులకు తీసుకెళ్లి లాకర్లను తెరిచి పరిశీలించారు. దాదాపు 4 గంటల పాటు ఈ పరిశీలన సాగింది. ఇందులో కీలక డాక్యుమెంట్లను సేకరించినట్లు తెలుస్తోంది. సోమవారం సోదాల్లో కొందరు సిస్టం అడ్మినిస్ట్రేటర్లు, టెక్నికల్ నిపుణులు, బ్యాంకింగ్ నిపుణులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.

మేఘా’ కోసమే సర్కారువివేక్
రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులన్నిటినీ మేఘా కంపెనీకే ఇవ్వడంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి చాలాకాలంగా ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల్లో ఎలాంటి నిబంధనలను పాటించకుండా కాంట్రాక్టులు ఇవ్వడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల డీపీఆర్ లు కూడా బయటికి ఇవ్వకుండా వేలకోట్ల విలువైన పనులు అప్పగించడాన్ని వివేక్ పలు వేదికలపై పదేపదే లేవనెత్తారు. భారీ కుంభకోణంలో భాగంగానే మేఘా కంపెనీకి ఏకపక్షంగా పనులు అప్పగిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మొదట ప్రాజెక్టు ఖర్చును 80వేల కోట్లకు పెంచడం, ఆపై మూడో టీఎంసీ, ఇతర ప్రాజెక్టుల పేరుతో ఖర్చును లక్షకోట్లకు పైగా చేస్తుండడాన్ని ప్రజల సొమ్మును మళ్లించడానికేనని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన సందర్భంలో ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రాజెక్టుల్లో అక్రమాలు వెలుగులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

Courtesy V6 Velugu