కరోనా కాటుకు ప్రయివేటు టీచర్లు బలి
ఎనిమిది నెలలుగా జీతాల్లేక అవస్థలు
భారంగా కుటుంబాల పోషణ
ఉపాధి కూలీలుగా మారిన వైనం
చేతులెత్తేసిన పాఠశాలల యాజమాన్యాలు
ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చలించని సర్కారు

ఒకనాడు బతకలేక బడిపంతులు అనేవారు. ఇప్పుడు బతుకులేని బడిపంతుళ్లు అనే దుస్థితి ఏర్పడింది. కరోనా వైరస్‌ ప్రభావం, ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసీ ప్రయివేటు ఉపాధ్యాయుల జీవితం ముందు నుయ్యి… వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. బతుకుదెరువు కోసం ఆ పని, ఈ పని అని కాకుండా ఏది అవకాశం ఉంటే ఆ పనిచేస్తున్నారు. జీతాల్లేక దయనీయ పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.

”ఒకనాడు బతకలేక బడిపంతులు అనేవారు. ఇప్పుడు బతుకులేని బడిపంతుళ్లు అనే దుస్థితి ఏర్పడింది. కరోనా వైరస్‌ ప్రభావం, ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసీ ప్రయివేటు ఉపాధ్యాయుల జీవితం ముందు నుయ్యి… వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. బతుకుదెరువు కోసం ఆ పని, ఈ పని అని కాకుండా ఏది అవకాశం ఉంటే ఆ పనిచేస్తున్నారు. జీతాల్లేక దయనీయ పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.” పాఠాలు బోధించే పంతుళ్ల బతుకులు దుర్భరంగా మారాయి. కరోనా కాటుకు వారి జీవితాలు బలయ్యాయి. ఎనిమిది నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్నారు. సమాజంలో ఎంతో గౌరవంగా బతకాల్సిన ఉపాధ్యాయులు తోపుడు బండ్ల వ్యాపారులుగా, ఉపాధి కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా మారిపోయారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లు ఆకలితో అలమటిస్తున్నారు. కుటుంబాల పోషణ కోసం కొందరు ఉపాధ్యాయులు కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు. ఇంకొందరు టిఫిన్‌ సెంటర్‌, మరికొందరు టీకొట్టు నడుపుతున్నారంటే వారి బతుకులు ఎంత దయనీయంగా మారాయో అర్థమవుతున్నది. ఇక కొందరు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వ్యవసాయ పనులూ చేసుకుంటున్నారు. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు జీతాలివ్వకుండా చేతులెత్తేశాయి. రాష్ట్రంలో ప్రయివేటు టీచర్ల మృత్యుఘోష ఆగడం లేదు. కుటుంబాల పోషణ భారంగా మారి, అప్పులు తీర్చలేక రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది వరకు ప్రయివేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయినా అటు యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వంలో చలనం రాలేదు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 45 జారీ చేసి చేతులుదులుపేసుకుంది. గతంలో బతకలేక బడిపంతులు అనే సామెత ఉండేది. కరోనా వైరస్‌ నేపథ్యంలో బతుకులేని బడిపంతుళ్లుగా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ, లేదంటే పాఠశాలల యాజమాన్యాలతో ప్రతినెలా జీతాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలనీ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

చాలీచాలని జీతాలూ ఇవ్వని పరిస్థితి…
రాష్ట్రంలో 11 వేల ప్రయివేటు పాఠశాలలున్నాయి. వాటిలో సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల భవనాలు చూడ్డానికి విశాలంగా, అందంగా కనిపిస్తాయి. ప్రయివేటు టీచర్ల కష్టంతో ఏటా యాజమాన్యాలు లాభాలను గడిస్తాయి. రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యావ్యాపారం అమల్లోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకున్నాయి. వందల కోట్ల రూపాయలు పోగుచేసుకున్నాయి. కరోనా సాకును చూపి ఫీజులు వసూలు కావడం లేదని చెప్పి ఇప్పుడు మాత్రం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం మానేశాయి. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు చాలీచాలని జీతాలే చెల్లిస్తాయి. పాఠశాలలను బట్టి రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తాయి. కరోనా ప్రభావం ప్రయివేటు ఉపాధ్యాయులపై తీవ్రంగానే పడింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ జీతాలు ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు పున:ప్రారంభం కాలేదు. దీంతో జూన్‌ నుంచి ఇప్పటి వరకు వేతనాలివ్వలేదు. దీంతో వారంతా విలవిల్లాడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సగం జీతమే చెల్లిస్తున్నాయి. దీంతో కొందరు ఉపాధ్యాయులకు కొంతవరకే ఉపశమనం కలిగింది. కానీ పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొన్నది.

టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్తాం : షేక్‌ షబ్బీర్‌అలీ, టీపీటీఎఫ్‌ అధ్యక్షులు
ప్రయివేటు టీచర్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. జీతాల్లేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. యాజమాన్యాలు జీతాలు చెల్లించే విధంగా చూడాలి. ఈ సమయంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ప్రయివేటు యాజమాన్యాలను పిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ప్రయివేటు టీచర్లను ఆదుకోవాలని కోరకుండా అధికారులు ఇలా వ్యవహరించడం సరైంది కాదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్తాం.

టైలరింగ్‌తో కుటుంబాన్ని నెట్టుకొచ్చా : లక్ష్మి, ఉపాధ్యాయురాలు
కరోనా లాక్‌డౌన్‌లో పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో అనేక ఇబ్బందులు పడ్డాం. కుటుంబ పోషణ కష్టమవుతున్నది. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు బీటెక్‌ మూడో సంవత్సరం, ఇంకొకరు ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నారు. వారి ఫీజులు కట్టేందుకూ డబ్బుల్లేవు. ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు అవకాశం కల్పించలేదు. ఇంటి అద్దె, కరెంటు, వాటర్‌ బిల్లు కట్టడానికీ డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ అవసరాల కోసం టైలరింగ్‌కు వెళ్లాను. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను.

చారు బండి నడుపుతున్నా : పాపారావు, టీచర్‌
పాఠశాలలు మూత పడడంతో జీతాల్లేక భవన నిర్మాణ కార్మికుడిగా మారాను. చేతులకు బొబ్బలు రావడంతో మానేశాను. కుటుంబ పోషణ కోసం ఇప్పుడు చారు బండి నడుపుతున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.400 సంపాదిస్తున్నా. ఏదో కుటుంబ అవసరాలు తీరుతున్నాయి. ప్రభుత్వం మాపై దయతలచి జీతాలు వచ్చేలా చూడాలి.

Courtesy Nava Telangana