• నలుగురిలో ముగ్గురు మహిళా సంఘం నాయకులు
  • హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ దాఖలు
  • నేడు ప్రవేశపెట్టాలంటూ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌/ఉప్పల్‌/ పంజాగుట్ట/ కొత్తగూడెం క్రైం, డిసెంబరు: మరో నలుగురు ప్రజాసంఘాల నేతలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం పోలీసులు బుధవారం తెల్లవారుజామున చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) కార్యదర్శులు డి.దేవేంద్ర, డి.స్వప్న, తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) ప్రధాన కార్యదర్శి మెంచు సందీ్‌పను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. సీఎంఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలు గుంట రేణుకను గద్వాల పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమె స్వస్థలం వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం పంచర్ల. ఆ నలుగురి ఇళ్లలో పోలీసులు జరిపిన సోదాల్లో విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రేణుకను గద్వాల కుట్రకేసులో అరెస్టు చేసినట్లు తెలిసింది. నెల క్రితం భద్రాద్రి జిల్లా చర్ల పోలీసులు 45 మందిపై ఉపా చట్టం కింద నమోదైన కేసులో సందీప్‌, దేవేంద్ర, స్వప్నను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ముగ్గురిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని కోరుతూ సీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ దాఖలు చేశారు. ‘‘అరెస్టు సమయంలో నైటీలో ఉన్న మహిళలకు కనీసం దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అరెస్టుకు తగిన కారణాలను చూపలేదు అని పిటిషనర్‌ తరపున న్యాయవాది రఘునాథ్‌ వివరించారు. వ్యాజ్యాన్ని విచారించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం.. ఆ ముగ్గురిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.

మావోయిస్టులే లేనప్పుడు కేసులెందుకు?: హరగోపాల్‌ : తెలంగాణలో మావోయిస్టులే లేరని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నప్పుడు.. సంఘాల నేతలను ఎందుకు అరెస్టు చేస్తున్నారని పౌరహక్కుల నేత హరగోపాల్‌ ప్రశ్నించారు. గద్వాల కుట్రకేసు, హైదరాబాద్‌, చర్ల కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 8 మందిపై కేసులను ఎత్తివేసి, బేషరతుగా విడుదల చేయాలన్నారు. అరెస్టయిన వారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఆయన సోమాజిగూడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అరెస్టయినవారిలో కొందరు విద్యార్థులు, మరికొందరు ప్రజాపోరాటాలు చేస్తున్నవారు. వారంతా పేదవారే. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కేస్తున్నారు’’ అని ఆరోపించారు.

అరెస్టు ఎక్కడ? : దేవేంద్రను ఉప్పల్‌ సమీపంలోని పీర్జాదిగూడలో, స్వప్నను ఉప్పల్‌ భరత్‌నగర్‌లో అరెస్టు చేసినట్లు కొత్తగూడెం పోలీసులు చెప్పారు. అయితే.. వారిద్దరినీ నాచారంలోని శిల్ప ఇంట్లో అరెస్టు చేసినట్లు దేవేంద్ర తల్లి యాదమ్మ చెబుతున్నారు. మంచం కింద పుస్తకాలు పెట్టి.. విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు అని వాపోయారు. కాగా, మెంచు సందీ్‌పను నల్లకుంటలో అరెస్టు చేశారు.

Courtesy Andhrajyothi