హైదరాబాద్: ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభలో ప్రకటన చేశారు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సీఏఏ వ్యతిరేక తీర్మాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీనిపై ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. తీర్మానాన్ని బలపరుస్తున్నట్టు టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, ఎంఐఎం నేతలు తెలిపారు.

తాము లౌకిక వాదానికి కట్టుబడి సీఏఏను వ్యతిరేకిస్తున్నట్టు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏడు రాష్ట్రాలు తీర్మానాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఏఏపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఏఏతో పాటు ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ లను కూడా తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మన దేశానికి విభజన రాజకీయాలు దేశానికి అవసరం లేదన్నారు. అక్రమ చొరబాటుదారులను అనుమతించాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహలు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ అభాండాలు వేస్తున్నారని కేసీఆర్ అన్నారు.

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యానించారు. సీఏఏ కేవలం ముస్లింలకే వ్యతిరేకం కాదని, దేశంలోని పేదలందరికీ వ్యతిరేకమేనని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్ ను ఆయన అభినందించారు. సీఏఏ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకించాల్సిన అవసరముందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. తీర్మానంతోనే ఆగిపోకుండా సీఏఏ, ఎన్ పీఆర్ లను తెలంగాణలో అమలు చేయబోమని చట్టం చేయాలని డిమాండ్ చేశారు.