హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగానికై పరీక్ష రాసిన పారా మెడికల్ అభ్యర్థులు మూడు సంవత్సరాలుగా ఫలితాలు ప్రకటించకపోవడంతో రామానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మార్కుల్లో వెయిటెజి ఇవ్వడంతో సమస్య ఉత్పన్నమై తమకు ఉద్యోగాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ అభ్యర్థులు టీఎస్ పీఎస్ సీ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. హైకోర్టులో పిటిషన్ వేసి వాదనలు పూర్తయినా జడ్జిమెంట్ రాకపోవడంతో మానసికంగా కృంగిపోయి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

పౌరహక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జయ వింధ్యాల, ఎంవి గుణ ఆధ్వర్యంలో మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యను కలిసి సమస్యను పరిష్కరించాలని పారా మెడికల్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. వీరి అభ్యర్థనపై స్పందించిన ఆయన.. టీఎస్ పీఎస్ సీకి నోటీసు జారీ చేసి, తదుపరి విచారణను ఏప్రిల్ 23వ తేదీ కి వాయిదా వేశారు.

ఈ సందర్భంగా పారా మెడికల్ అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. రిజల్ట్స్ ఇవ్వండి లేదా కారుణ్య మరణాలకు అనుమతించండి అని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటెజి విషయంలో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూసి ఫలితాలను ప్రకటించాలని పౌరహక్కుల ప్రజా సంఘం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. అభ్యర్థులు హయగ్రీవాచారి, నారాయణ, అనిల్, కల్పన, శిరీష తదితరులు.. మానవ హక్కుల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు.