• గడువులోగా పరిష్కరించాల్సిందే
 • 16 డిమాండ్లను నెరవేర్చాల్సిందే
 • సర్కారుకి ఉద్యోగ జేఏసీ స్పష్టీకరణ
 • సీఎం.. పోలింగ్‌ తర్వాత చేద్దామన్నారు
 • సీఎస్‌ను కలిశాక నమ్మకం ఏర్పడింది
 • జేఏసీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌; ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని, దాంతోపాటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘‘ప్రభుత్వానికి గడువు ఇచ్చాం. ఆలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే మేమేం చేయాలో నిర్ణయించుకుంటాం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 16 అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. ఏడాదిగా పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నామని, రెండు డీఏలు పెండింగులో ఉన్నాయని గుర్తు చేశారు. గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. అనంతరం కారం రవీందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. అన్ని అంశాల పట్ల సీఎస్‌ సానుకూలంగా స్పందించారని, త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారని వెల్లడించారు. 24వ తేదీ తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, సీఎ్‌సను కలిశాక నమ్మ కం ఏర్పడిందని చెప్పారు. నెలాఖరులోగా సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో ఉన్నామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే తప్పకుండా సమ్మెలోకి వెళతామని ప్రకటించారు. రెవెన్యూ శాఖలో ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తహసీల్దార్లను వెన క్కు తేవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దుచేసి, ఉద్యోగులకు నేరుగా వేతనాలివ్వాలని సూచించారు. దీపావళి పండుగకైనా ఏపీలో ఉన్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల ను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యోగుల రిలీవ్‌కు ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. ఉద్యోగుల అన్ని సమస్యలు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లామని సెక్రటరీ జనరల్‌ వి.మమత అన్నారు. సీఎం కూడా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తర్వాత తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు.

సీఎస్‌ సమర్పించిన డిమాండ్లు ఇవీ.

 1. 1-7-2018 నుంచి వేతన సవరణ అమలు చేయాలి.
 2. బకాయిపడిన కరవు భత్యాలను వెంటనే మంజూరు చేయాలి.
 3. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ రప్పించాలి.
 4. సీపీఎ్‌సను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి.
 5. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలి.
 6. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.
 7. గ్రంథాలయ సంస్థ, మార్కెటింగ్‌ కమిటీలు, వర్సిటీలు, ఎయిడెడ్‌/పాఠశాలల ఉద్యోగులకు 010 పద్దుకింద జీతాలు చెల్లించాలి. వీరికి కూడా హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి.
 8. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.
 9. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలి. భాషా పండితులు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలి. రూ.398లతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. సింగరేణి పాఠశాలల సిబ్బందినిప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకోవాలి.
 10. వర్సిటీలు, స్థానిక ఎయిడెడ్‌ సంస్థల్లో ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి. ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ఈ పథకానికి నెలవారీ చందాను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.
 11. బదిలీలపై నిషేధం ఎత్తివేయాలి. ఎన్నికల సందర్భంగా జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాలి. ఆరేళ్లుగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ విభాగాల్లో బదిలీలు జరుగలేదు. ఏటా తప్పనిసరిగా జూన్‌/జూలైలో నెలల్లో బదిలీలు చేపట్టాలి.
 12. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని సర్వేనెం.36, 37లలో ఉన్న ఏపీ ఎన్జీవోల ఇళ్ల స్థలాలను భాగ్యనగర్‌ ఎన్జీవోల సంఘానికి కేటాయించాలి.
 13. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15ు అదనపు పెన్షన్‌ మంజూరు చేయాలి. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలి.
 14. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సాధారణ ఉద్యోగులతో సమానంగా సెలవులు(ప్రసూతి సెలవులు, సాధారణ, ఇతర సెలవులు) మంజూరు చే యాలి. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలి.
 15. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయాల్లో పూర్వ జిల్లాలతో సమానంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలి.
 16. ప్రతీ శాఖలో ప్రతీ పదిమంది డ్రైవర్‌లకు ఒక సీనియర్‌ డ్రైవర్‌ పోస్టు మంజూరు చేయాలి. జీవో నెం.127(జీఏడీ-తేదీ 22-4-2003) ఉత్తర్వులను అమలు చేయాలి.

జేఏసీ సమావేశం రద్దు
తెలంగాణ ఉద్యోగ జేఏసీ గురువారం నిర్వహించ తలపెట్టిన సమావేశం రద్దయింది. 126 సంఘాలతో కూడిన జేఏసీ భేటీ తొలుత బుధవారం జరుగుతుందని ప్రకటించారు. అర్థంతరంగా వాయిదా వేశారు. తర్వాత గురువారానికి వాయిదా వేశామని జేఏసీ సమాచారం ఇచ్చింది. గురువారం కూడా సమావేశం జరుగలేదు. ఆర్టీసీ సమ్మె, ఉద్యోగుల సమస్యల పట్ల జేఏసీ నాయకత్వం తీరు సరిగ్గా లేదని, భాగస్వామ్య సంఘాలు భగ్గుమంటుండటం, ఓ అమాత్యుడి ఒత్తిడి కూడా వాయిదాకు కారణమని చెబుతున్నారు.

అందరికున్న లోగుట్టు మాకుంది
టీఎన్జీవోల కాలనీల్లో ఉద్యోగ సంఘాల నేతల అక్రమాల మేడలపై ‘సర్కారు చేతిలో జుట్టు… అదీ లోగుట్టు’ అనే శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై జేఏసీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, వి.మమతలను ప్రశ్నించగా… ‘అందరికున్న లోగుట్టు మాకుంది. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉద్యోగులకు ఏ లోగుట్టు ఉందో… అదే లోగుట్టు మాకు ఉంది. అంతా. ఉహించుకొని రాస్తున్నారు’ అంటూ చిర్రుబుర్రులాడారు.

Courtesy Andhra Jyothy