• వారంలో రిజర్వేషన్లు ఖరారు..
  • పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌
  • కేటీఆర్‌తో కలిసి సీఎం సమీక్ష..
  • నేడు ఎస్‌ఈసీకి సమాచారం
హుజూర్‌నగర్‌ ఫలితానికి ఒకరోజు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మునిసిపల్‌ ఎన్నికల నగారా మోగించారు. బుధవారం అధికారులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించాలని ఆదేశించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందగానే షెడ్యూల్‌ ప్రకటన జారీకి సమాయత్తమవుతుంది.
హైదరాబాద్‌: మునిసిపల్‌ ఎన్నికలకు హైకోర్టు అభ్యంతరాలు తొలగిపోయినందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తోంది. పురపాలక మంత్రి కేటీఆర్‌, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, అరవింద్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులు గురువారం ఎన్నికల సంఘానికి సమాచారం అందించనున్నారు. హైకోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడం, ముఖ్యమంత్రి కూడా అధికారులను ఆదేశించడంతో ఇక మునిసిపల్‌ ఎన్నికల వేడి రాజుకోనుంది. అధికారులు రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు.
నవంబరు మొదటి వారంలో
మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్‌లను త్వరలోనే ఖరారు చేయనున్నారు. మేయర్‌/చైర్మన్‌ పదవులను రాష్ట్రం యూనిట్‌గా, కౌన్సిలర్‌/కార్పోరేటర్‌ పదవులను మునిసిపాలిటీ యూనిట్‌గా ఖరారు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి మొత్తం రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేస్తారు. మునిసిపల్‌ ఆర్డినెన్స్‌లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎస్‌టీ, ఎస్‌సీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. 50 శాతంలో ఎస్‌టీ, ఎస్‌సీలకు పోను మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. అన్ని కేటగిరిలలోనూ మహిళలకు సగం స్థానాలను కేటాయిస్తారు. ఎన్నికలు ఒకేసారి జరిపినా, రెండు విడతలుగా జరిపినా, రిజర్వేషన్లు మాత్రం ఒకేసారి ఖరారు కానున్నాయి. రాష్ట్రం యూనిట్‌గా పరిగణించనున్నందున అన్నింటికీ ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు చేయడం అనివార్యమవుతోంది. రాష్ట్రం లో 13 కార్పోరేషన్‌లు, 128 మునిసిపాలిటీలకు వేరువేరుగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియ వారంలోపే పూర్తి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
నేడే ఎన్నికల సంఘం సమావేశం?
తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో సిద్ధమై ఉంది. లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందగానే గురువారమే ఈసీ సమావేశం కానున్నట్లు తెలిసింది. వాస్తవానికి మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం గతంలోనే ప్రారంభించింది. వార్డుల విభజన, ఎస్‌టీ, ఎస్‌సీ, బీసీ ఓటర్ల గుర్తింపు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు దాదాపు పూర్తయింది. ఎన్నికల సిబ్బందిని కూడా గుర్తించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ చాలా వరకు పూర్తయింది. అంతా సిద్ధంగా ఉండటంతో ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు ఈసీకి ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన రోజు నుంచి 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదాహరణకు నామినేషన్ల స్వీకరణ 1న ప్రారంభమైతే ఎన్నికలు 15న జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 13 కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం ముగియనందున మిగిలిన పదింటికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 128 మునిసిపాలిటీలకు గాను 120 చోట్ల ఎన్నికలు జరుగుతాయి.
Courtesy Andhra jyothy