కన్నతల్లిని మండుటెండలోకి గెంటేసిన పుత్రరత్నాలు
కరీంనగర్‌ జిల్లాలో అమానుషం

కరీంనగర్‌: ‘‘కన్నతల్లైతే ఏంటి..? ఆవిడకు కరోనా రాదా..? మాకు సోకిందంటే అయిపోతాం. ఇంట్లోకి రానక్కర్లేదు.’’ ఇదీ.. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఆమె కుమారులు చూపించిన అపారమైన ప్రేమ. అధికారులు పరీక్షలు నిర్వహించి.. ఏం లేదని చెప్పినా, సదరు తనయులకు మాత్రం అమ్మపై నమ్మకం కలగలేదు. మండుటెండలో ఇంటి ఎదుట సిమెంటు రోడ్డుపై కూర్చుని, పిల్లలు లోపలికి రమ్మంటారని ఎదురుచూస్తున్న ఆ పిచ్చితల్లిపై లేశమాత్రమైనా జాలి కలగలేదు. చివరికి అధికారులు, పెద్దలు, ఊరి జనాలు చెప్పడంతో.. చాలా పెద్ద మనసు చేసుకుని ఇంటి రేకుల షెడ్డులో ఓ మూల ఆమెకు చోటిచ్చారు. కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకున్న అమానుష ఘటన ఇది. కిసాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కట్ట శ్యామల(80), లాక్‌డౌన్‌కు ముందు షోలాపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయింది.

తాజాగా నిబంధనలు సడలించడంతో శుక్రవారం ఇంటికి చేరుకుంది. అయితే.. తల్లిని అక్కున చేర్చుకోవాల్సిన పుత్రరత్నాలు.. ఆమెకు కరోనా ఉందేమో అంటూ గేటుకు తాళం వేసేసుకున్నారు. లోపలికి రావడానికి వీల్లేదని కరాఖండీగా చెప్పేశారు. ఎండన పడి వచ్చి, కణకణలాడే రోడ్డుపై చతికిలపడిన తల్లికి మంచినీళ్లు అందించే దిక్కు కూడా లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్‌, ఎడ్ల సరిత ఆమెకు అల్పాహారాన్ని అందించి వైద్యఆరోగ్యశాఖ అఽధికారులకు విషయం తెలియజేశారు. అధికారులు శ్యామలకు పరీక్షలు నిర్వహించి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పినా కుమారుల మనసు కరగలేదు. ఎట్టకేలకు కార్పొరేటర్లు వారికి నచ్చజెప్పి ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో ఆమెను ఉండనిచ్చేందుకు ఒప్పించారు.

Courtesy Andhrajyothy