దివాలాలో శాఖా గ్రంథాలయాలు
ఆరేండ్లుగా ఇదే కత..
పట్టించుకోని ప్రభుత్వం
కేంద్రం విదిల్చే గ్రాంట్లే దిక్కు

గ్రంథాలయాలు దివాలా తీశాయి. వాటిలో పుస్తకాలు కొనే నాధుడు లేడు. ఆరేండ్లుగా ఒక్క కొత్త పుస్తకం కొంటే ఒట్టు! మూడేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షలు గ్రాంటుగా ఇస్తే, రాష్ట్రంలోని 676 శాఖా గ్రంథాలయాలకు ఒక్కో పుస్తకాన్ని కొని సప్లరు చేసిన ఘనత రాష్ట్రప్రభుత్వానిది. కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్‌ గ్రాంట్లను విడుదల చేయాలనే కనీస ఆలోచన కూడా ఆరేండ్లుగా రాష్ట్రప్రభుత్వానికి రాకపోవడం శోచనీయమని గ్రంథాలయ పాఠకులు విసుక్కుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిపన్నుతో పాటు గ్రంథాలయ సెస్‌ పేరుతో ప్రజల నుంచి ముక్కుపిండి పన్ను వసూలు చేస్తున్నారు. కానీ అవేవీ ఆయా గ్రంథాలయాలకు చేరట్లేదు. ఇప్పటికీ గ్రంథాలయాల్లోని పుస్తకాలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కొన్నవే కావడం గమనార్హం. కానీ గ్రంథాలయ వార్షికోత్సవాల్లో మాత్రం ప్రభుత్వ నేతలు ఆకాశానికి నిచ్చెనలు వేసే హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని మర్చిపోవడం షరామామూలుగా మారింది. తెలంగాణ ఉద్యమసమయంలో భాష, యాస ప్రధాన భూమిక పోషించాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే…అన్ని గ్రంథాలయాలను పుస్తక భాండాగారాలుగా తీర్చిదిద్దుతామని అప్పటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పలు వేదికలపై ప్రసంగాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఆరేండ్లు దాటినా, ఇప్పటికీ గ్రంథాలయాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా ఆయాచితం శ్రీధర్‌ నియామకం జరిగి ఏడాదిన్నర దాటింది. కనీసం ప్రభుత్వానికి వాటి దుస్థితిని తెలుపుతూ ఓ లేఖ కూడా రాసిన దాఖలా లేదని అక్కడి ఉద్యోగులే చెప్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే ఆశతో గ్రామీణ ప్రాంత విద్యార్ధులు కేవలం పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు సిటీలకు వస్తున్నారు. అన్ని పుస్తకాలు కొనే ఆర్ధిక స్థోమత లేక వారు గ్రంథాలయాలకు వస్తే, నిరాశే ఎదురవుతున్నది. అనేక చోట్ల పాఠకుల కోసం దాతలు ముందుకొచ్చి పుస్తకాలను విరాళంగా ఇస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రజల నుంచి వసూలు చేస్తున్న గ్రంథాలయ సెస్‌ సొమ్ము ఎక్కడికెళ్తుందనే స్పష్టత మాత్రం ప్రభుత్వం వద్ద లేదు. ఆ సొమ్మును స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ సొంతానికే వాడుకుంటున్నాయి. రాజధాని హైదరాబాద్‌కు ఉద్యోగాల శిక్షణార్ధం గ్రామీణ ప్రాంత యువత పెద్దసంఖ్యలో వస్తుంటుంది. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీల్లో ఇప్పటికీ పాత పుస్తకాలే తప్ప, లేటెస్ట్‌ సమాచార పుస్తకాలు మాత్రం లేవు. దీనితో యువత నిరుత్సాహానికి గురవుతున్నది. రాష్ట్రంలోని 676 శాఖా గ్రంథాలయాల్లో తెలుగు, సంస్కృతం, అరబిక్‌, ఉర్దూ, ఇంగ్లీష్‌, హిందీ భాషలకు చెందిన 68 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముప్పావు భాగం పుస్తకాలు శిధిలావస్థలో ఉన్నాయి. పాత పుస్తకాల డిజిటలైజేషన్‌ నిధుల లేక నిలిచిపోయింది.

పోటీ పరీక్షల బుక్స్‌ను అందుబాటులో ఉంచాలి
ఏడాదిగా నగరంలోని ఓ ప్రయివేటు హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. గతంలో గ్రూప్‌-2 పరీక్షకు ఇంటివద్దనే ప్రిపేరయ్యాను.. అందులో క్వాలిఫైకాలేదు. దాంతో హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటూ, ఖాళీ సమయంలో చిక్కడ్‌పల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో చదువుకుంటున్నాను. పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చరిత్ర, అంత్రోపాలజీ, జీకే తదితర అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచితే మాకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఎం. శ్రీనివాస్‌, వరంగల్‌

పుస్తకాలకు పాట్లు
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువకులు సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో వందల సంఖ్యలో ఉన్నాము. చాలా మంది ఆర్‌ఆర్‌బీ, ఎన్‌టీపీసీ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నార. ఇందుకు సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. లైబ్రరీ అధికారులకు చెప్పినా పెద్దగా స్పందన ఉండటం లేదు. ఆర్డర్‌ బుక్‌లో రాస్తే వీలును బట్టి కొన్ని పుస్తకాలను మాత్రమే తెప్పిస్తున్నారు. ఉన్న కొద్ది పుస్తకాల కోసం క్యూకడుతున్నాం. అధికారులు కాంపిటిటేషన్‌కు సంబంధించిన పుస్తకాలను ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచితే మాకు ఉపయోగం.
ప్రదీప్‌ కుమార్‌, కరీంనగర్‌

Courtesy Nava Telangana