హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ నేతల పెరిగిపోయాయని, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులను అగ్రవర్ణ నాయకులు లెక్కచేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అగ్రకులాల జాగీరు కాదని, బడుగు, బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 72 స్వాతంత్ర్య భారతావనిలో ఎన్నడూలేని విధంగా తెలంగాణలో నిమ్నవర్గాలపై దాడులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని దాడులు నివారించాలని కోరారు.

నిమ్నవర్గాలపై దాడులకు నిరసనగా శుక్రవారం బర్కత్ పురలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని, వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడిన చేసిన ఎమ్మెల్యే సోదరుడు రంజిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. సెలబ్రిటీ అయిన రాహుల్ కే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

చట్టం అందరికీ సమానమేనని.. బడుగులకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయం ఉందని స్పష్టం చేశారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టకపోతే పోలీసులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జంపాల రాజేశ్, ధనరాజ్ నాయీ, గుజ్జ కృష్ణ, నీరడి భూపేశ్ సాగర్, రంగసాయి భట్, ఉదయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.