వర్క్‌ ఫ్రం హోమ్‌తో పెరిగిన ఆలుమగల అన్యోన్యత
బెడ్‌రూం నుంచి 45 శాతం మంది విధులు
స్వదేశీ ఉద్యోగమే బెటర్‌ అంటున్న టెకీలు
టీటా అధ్యయనంలో ఆసక్తికర నిజాలు వెల్లడి

హైదరాబాద్‌: విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. లక్షల్లో జీ తం.. సొంతంగా ఇల్లు, కారు.. మొత్తంగా లగ్జరీ లైఫ్‌.. ఇవే భారతీయ యువత ఆలోచనలు, లక్ష్యాలు. కానీ, ఇప్పుడు అవేమీ వద్దు ఉన్న ఊరిలో ఉద్యోగం, ఉన్నన్ని రోజులు సంతృప్తి చాలంటున్నారు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. కరోనా దెబ్బకు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగులంతా ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారట. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య బంధం, ప్రేమానురాగాలు బాగా పెరిగిపోయాయట. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్ ‌(టీటా) చేసిన అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

దాదాపు నెల పాటు కొందరిని వ్యక్తిగతంగా, మరికొందరిని ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నలు అడిగి 500 మంది ద్వారా సమాచారాన్ని సేకరించారు. అన్నింటికంటే వర్క్‌ ఫ్రం హోమ్‌ వల్ల ఆలుమగల బంధం ఎలా ఉందని అడ గ్గా.. 88.54 శాతం మంది మరింత బలపడిందని జవాబిచ్చారు. 11.45 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అంటే దీన్ని బట్టి వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రేమానురాగాలను పెంచిందనే చెప్పుకోవాలి. ఇంట్లో బెడ్‌రూం నుంచే ఎక్కువగా పనిచేశామని చెప్పుకొచ్చారు. బెడ్‌రూంలో ఉండి 44.79 శాతం, ఇంట్లో ప్రత్యేక ఆఫీస్‌ సెటప్‌ చేసుకుని 23.96 శాతం, బాల్కనీలో 3.12 శాతం, లాన్‌ ఏరియాలో 1.04 శా తం, ఫ్లోర్‌పైన 4.17 శాతం మం ది పనిచేశామని వెల్లడించారు. ఇక, కుటుంబానికి దూరంగా విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయడంపై సగానికిపైగా మంది ఆసక్తి చూపలేదు. విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లి జాబ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించగా 57.29 శాతం మంది విముఖత, 42.70 శాతం మంది సుముఖత వ్యక్తం చేశారు.

బాగానే కష్టపడ్డారు
ఇంటి నుంచి రోజుకూ ఎన్ని గంటలు పని చేశారని అడగ్గా 48.95 శాతం మంది 8 నుంచి 10 గంటల మధ్య పనిచేశామని చెప్పారు. 28.12 శాతం మంది 10 నుంచి 12 గంటలు, 12.5 శాతం మంది 8 గంటలు, 8.33 శాతం మంది 12 గంటలు, 2.8 శాతం మంది 8 గంటల కంటే తక్కువగా పనిచేశామని పేర్కొన్నారు. ఇంటి నుంచి పని చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రశ్నించగా 29.03 శాతం మంది ఇంటర్నెట్‌ కనెక్షన్‌, 25.16 శాతం మంది విద్యుత్తు, 12.90 శాతం మంది ఇంటికి సంబంధించిన పనులు, 3.87 శాతం మంది నిర్ణీత సమయంలో పనిని ముగించుకోకపోవడం, 5.16 శాతం ఇతర సమస్యలతో ఇబ్బంది పడ్డట్టు తెలిపారు. టీం వర్క్‌ను కోల్పోయామని 23.87 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొన్ని ఆసక్తికర ప్రశ్నలివీ:
1. ఇంటి నుంచి అంకితభావంతో పనిచేశారా?
అవును 63 శాతం మంది
ఇబ్బందిగా ఫీలయ్యాం 37 శాతం మంది

2. వర్క్‌ ఫ్రం హోమ్‌కు కంపెనీలు ఇంటెన్సివ్‌లు ప్రకటించాయా?
ఏమీ ఇవ్వలేదు 82.29 శాతం
కచ్చితంగా చెప్పలేం 9.37 శాతం
అవును 8.33 శాతం

3. ఇంటి నుంచి పనిచేయడంలో ఒత్తిడికి గురయ్యారా?
లేదు 62.5 శాతం
కొంచెం 37.5 శాతం

నెల పాటు సర్వే చేశాం
కరోనా నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తుండటంతో నెలపాటు సర్వేచేశాం. మరిన్ని సదుపాయాలు కల్పిస్తే వర్క్‌ ఫ్రం హోం చేయడానికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చాలా మంది టెకీలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
– సందీప్‌కుమార్‌ మక్తాల, టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌

వర్క్‌ ఫ్రం హోంపై ఉద్యోగుల అభిప్రాయం ఇదీ..
ఎక్సలెంట్‌ 23.95 శాతం
చాలా బాగుంది 47.91 శాతం
ఫర్వాలేదు 21.87 శాతం
యావరేజ్‌ 4.16 శాతం
బాగోలేదు 2.08 శాతం

Courtesy Namasthe Telangana