విచారణ తీరుకు జంకి వెనకడుగు ఉన్న చోటు వదిలి దూరప్రాంతాలకు.. గోప్యంగా బాధిత కుటుంబాలు

హైదరాబాద్ : పదో తరగతి చదువుతున్న బాలిక ఆమె. ఆటపాటల్లోనూ ముందుండేది. చుట్టుపక్కలవారితో ఆత్మీయంగా మెలిగేది. వారంతా తనవారేనంటూ సంబరపడేది. తనపై కొన్ని చూపులు విషం చిమ్ముతున్నాయని గ్రహించలేకపోయింది. పక్కింటి యువకుడి వల్ల లైంగిక దాడికి గురైంది. విషయం బయటకు రాకుండా చూసేందుకు బస్తీ పెద్దలు సిద్ధమయ్యారు. ఎంతో కొంత ఇస్తామని ఆశ చూపారు. తమకు న్యాయం కావాలంటూ బాధితురాలి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడ నుంచి కేసు న్యాయస్థానం వద్దకు చేరింది. కొద్దిరోజులకు నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చాడు. తమ మాట వినలేదనే కోపంతో ఆ కాలనీలోని పెద్దలు కక్షగట్టారు. బాధిత కుటుంబాన్ని వెలివేశామనేంతగా ప్రవర్తించసాగారు. నాలుగైదు నెలలపాటు బాధను భరించిన ఆ కుటుంబం చివరికి సొంతింటిని తక్కువ ధరకు అమ్మేసుకుని వెళ్లిపోయింది. పరిహారం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనా, వారి జాడ తెలియక మౌనంగా ఉండిపోయారు.

యుక్తవయసు అమ్మాయి. మంచి సంబంధం కుదరితే పెళ్లి చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు. ఇంతలో యుక్తవయసు అమ్మాయి. మంచి సంబంధం కుదరితే పెళ్లి చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు. ఇంతలో ఘోరం జరిగింది… కన్నవారి గుండె పగిలింది. కూలినాలీ చేసుకునే ఆ కుటుంబానికి ఇది పెద్ద కష్టం. లైంగిక దాడికి గురైన యువతి తీవ్ర మానసిక ఒత్తిడితో బయటకు వచ్చేందుకు భయపడేంతగా మారింది. పోలీసుల దర్యాప్తు, న్యాయస్థానం చుట్టూ ప్రదక్షిణలతో కుటుంబ పెద్దలు మరింత ఆందోళనకు గురయ్యారు. కన్నబిడ్డను సాధారణ స్థితికి తీసుకువచ్చి పెళ్లితో భద్రత కల్పించాలని భావించారు. అక్కడే ఉంటే మరిన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఒకరోజు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒకటి రెండుసార్లు వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడి తరపు బంధువుల బెదిరింపులతోనే ఆ కుటుంబం అక్కడ నుంచి వెళ్లిపోయిందనే ఆరోపణలూ ఉన్నాయి.

అత్యాచార ఘటన తర్వాత బాధితుల పక్షాన ప్రజా సంఘాలు ఆందోళన చేపడతాయి. నిందితులకు శిక్షపడితే బాధితులకు సాంత్వన చేకూరుతుందని భావిస్తుంటారు. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. బాధితుల కుటుంబాలు మాత్రం మనోవేదన అనుభవిస్తున్నాయి. అప్పటి వరకూ జాలి కురిపించిన వారి నోటి నుంచి వచ్చే సూటిపోటి మాటలు భరించలేక వారు విలవిల్లాడుతుంటారు. వయసు వచ్చిన బిడ్డ కళ్లెదుట కన్నీటితో కాలిపోతుంటే తట్టుకోలేక కొందరు బలవన్మరణాలకు ప్రయత్నిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. అప్పటి వరకూ గౌరవంగా బతికిన చోట తలదించుకుని ఉండలేమనే ఉద్దేశంతో బాధిత కుటుంబాలు దూరప్రదేశాలకు వెళుతున్నాయి. తమ వివరాలను గోప్యంగా ఉంచేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఆరని తీరని వ్యధ సున్నితమైన అంశం.. బయటకు చెప్పలేని వేదన. అప్పటి వరకూ ఉన్న కుటుంబంపై మాయని మచ్చపడిందనే బాధ. హైదరాబాద్ నగరంలో మూడేళ్ల వ్యవధిలో 455 అత్యాచార ఘటనలు జరిగాయి. పోక్సో చట్టం కింద 1000కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అత్యాచార బాధితులకు నాలుగు దఫాలుగా రూ.లక్ష పరిహారంగా అందజేస్తోంది. ఎఐఆర్ నమోదు కాగానే రూ.25 వేలు, న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు రూ.25 వేలు, నిందితులకు శిక్షపడిన సమయంలో మిగిలిన మొత్తం పరిహారం బాధితులకు అందజేయాలనేది నిబంధన. ఈ ప్రక్రియలో దఫాల వారీగా వివిధ శాఖల అధికారులు బాధిత కుటుంబ సభ్యులను విచారణ జరుపుతారు. చుట్టుపక్కల ఉన్నవారినీ ప్రశ్నిస్తారు. నెలల తరబడి సాగే ఈ వ్యవహారంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేవలం 30-35శాతం మంది మాత్రమే పరిహారం తీసుకునేందుకు ముందుకు రావటం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది.

Courtesy Eenadu