-నియామకాల్లేని ప్రభుత్వాస్పత్రులు
– కరోనా దెబ్బతో ప్రయివేటులోనూ భారీ ఖాళీలు
– చికిత్సల్లేక సామాన్యుల విలవిల

హైదరాబాద్‌: అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌. ఆరోగ్యరంగంలో ఆదర్శం. రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం మెడికల్‌ హబ్‌. ప్రపంచంలోని పలు దేశాల నుంచి చికిత్స కోసం నగరానికి వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తాం. ఆరేండ్లుగా అమాత్యులు పదే పదే వల్లించిన మాటలు కరోనా దెబ్బకు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏండ్ల తరబడి నియామకాలు చేపట్టకపోవడం, చేపట్టిన కొద్ది పాటి నియామకాలు న్యాయవివాదాల్లో చిక్కుకుంటే సకాలంలో పరిష్కరించలేకపోవడం, కరోనా సోకి ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా వైద్య, నర్సింగ్‌ సిబ్బంది పాటిటివ్‌ బారిన పడుతుండడం, మిగితా సిబ్బంది హౌం క్వారంటైన్‌కు వెళ్లిపోతుండడంతో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ విధంగా తయారైంది. మరోవైపు ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రుల పరిస్థితి ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేదు.

వైద్యారోగ్యశాఖ 2017లో చేపట్టిన దాదాపు 4000 మంది నర్సింగ్‌, పారామెడికల్‌ పోస్టుల నియామకం న్యాయవివాదంలో చిక్కుకుంది. మూడేండ్లు ఆ సమస్యను పరిష్కరించకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. పైపెచ్చు కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడం, ఉన్న సిబ్బందిపై పనిభారం మరింత అధికమైంది. తరచూ రోగులు, రోగుల సహాయకులతో దాడులు ఎదుర్కొంటూ, బూతులు పడుతూ ఈ వృత్తిలోకి ఎందుకొచ్చామా అని మదనపడుతున్నారు. వైద్యఆరోగ్యశాఖలో ఒక అంచనా ప్రకారం 15 వేల నుంచి 20 వేల వరకు ఖాళీలున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ తదితర బోధనాస్పత్రుల్లో ఈ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొన్ని ఆస్పత్రుల్లోనైతే వైద్య, నర్సింగ్‌ సిబ్బంది తాము చూడాల్సిన రోగులకన్నాపదింతల మందిని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధీనంలోని బోధన, జిల్లా, ఏరియా ఆస్పత్రులన్నింటిలో 30 వేల వరకు పడకలుండగా, కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రుల్లో లక్ష వరకు బెడ్లున్నాయి. అయితే ప్రభుత్వంలో గానీ, ప్రయివేటులో గానీ ఆ నిష్పత్తి మేరకు సిబ్బంది లేకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా కార్పొరేటు, ప్రయివేటు ఆస్పత్రుల పరిస్థితి తయారైంది. లాక్‌ డౌన్‌ అమల్లోకి రాగానే సాధారణ రోగులు కరోనా భయంతో ఆస్పత్రులకు రావడం దాదాపు తగ్గించేశారు. దీంతో ఆయా ఆస్పత్రులు ఉన్న సిబ్బందిలో చాలా మందిని ఇంటిబాట పట్టించాయి. అత్యవసర విభాగానికే రోగులు రావడంతో ఆ విభాగంలో సిబ్బందిని మాత్రం అట్టిపెట్టుకుని వారికి నెలరోజుల జీతం కాకుండా పని ఉన్నప్పుడే డబ్బులంటూ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేసుల వారీగా, రోజుల వారీగా జీతాల చెల్లింపులకు తెరలేపాయి. అప్పటికే కరోనా భయంతో ఉన్న సిబ్బందిలో మరికొంత మంది ఉద్యోగాలను మానేసి వెళ్లిపోయినట్టు సమాచారం. జీతం అంతంత మాత్రంగానే ఇస్తూ కరోనా రోగుల సేవలో వాడుకుంటా జీవితానికి ఏ మాత్రం భద్రత లేకపోవడం కూడా ఉద్యోగాలు వదిలేయడానికి కారణమని పలువురు చెబుతున్నారు.

అయితే ప్రయివేటులో టెస్టులకు అనుమతించడం, కేసులు పెరిగిపోవడం, రోగుల రాక కూడా ఎక్కువ కావడంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు డాక్టర్లు, ముఖ్యంగా నర్సింగ్‌ సిబ్బందిని భారీగా నియమించుకునేందుకు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. నగరానికి చెందిన రెండు కార్పొరేట్‌ ఆస్పత్రులు అత్యవసరంగా తమకు ఐదు వందల మంది వరకు నర్సులు అవసరమని కోరినప్పటికీ వారిచ్చే తక్కువ జీతానికి అభ్యర్థులు దొరకడం లేదని తెలిసింది. దీంతో పలు ఆస్పత్రులు 10 శాతం నుంచి 50 శాతం వరకు తక్కువ సిబ్బందితోనే నడిపిస్తున్నాయి. రెండు, మూడు నెలలు ఏదో పని చేసుకుని బతుకొచ్చనీ, ఆ తర్వాత చేరాలని భావిస్తున్నారు.

ఎందుకీ దుస్థితి?
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత రోగుల పాలిట శాపంగా మారింది. మెడికల్‌ హబ్‌ కాస్తా సామాన్యునికి వైద్యం అందించలేని నగరంగా మారిపోయింది. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే ముందుగా వారియర్లలో నెలకొన్న నిరాశను, అసంతప్తిని తొలగించాల్సిన అసరమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. తక్షణ చర్యలు చేపట్టకపోతే సామాన్యులకు వైద్యం అందక మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

వైద్యఆరోగ్యశాఖలో నియామకాలను వెంటనే చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రుల్లో సిబ్బందికి కనీస ఉద్యోగ, ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava Telangana