• డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకూ
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇద్దరికీ చికిత్స
  • 2648 నమూనాల్లో 975 పాజిటివ్‌లు
  • పాజిటివ్‌ రేటు 8%
  • మరో ఆరుగురు మృత్యువాత
  • మృతుల్లో ఎస్సార్‌నగర్‌ ట్రాఫిక్‌ ఏఎస్సై

హైదరాబాద్‌ : రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీకి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొద్దిరోజులుగా హోం మంత్రి భద్రతాసిబ్బందిలో కొందరికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలోనే.. స్వల్ప అస్వస్థతతో ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పోరేట్‌ ఆస్పత్రిలో చేరిన హోం మంత్రికి పరీక్షలు చేయగా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయన కుమారుడు, మనవడికి కూడా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. మంత్రితోపాటు ఆయన మనవడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కుమారుడు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక, పద్మారావు గౌడ్‌కు అనుమానిత లక్షణాలు కనపడడంతో ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేశారు. ఆయనకు, ఆయన కుమార్తెకు, మనవళ్లు, మనవరాలికి వైరస్‌ సోకినట్టు తేలింది. ప్రస్తుతం వారంతా సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా కుటుంబసభ్యులందరినీ హోం క్వారంటైన్‌ చేశారు.

అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో.. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి తాజాగా నెగెటివ్‌ వచ్చింది. ఆయన భార్య సహా నలుగురికీ నెగెటివ్‌ వచ్చింది. వైరస్‌ బారిన పడిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా కోలుకున్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌ గోషామహల్‌లో నిర్వహించిన హరితహారంలో హోం మంత్రి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీ అంజనీకుమార్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సోమవారం కొత్తగా 975 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. సేకరించిన 2648 నమూనాల్లో ఇలా 36.8 శాతం పాజిటివ్‌గా తేలడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈ స్థాయి పాజిటివ్‌ రేటు నమోదవడం ఇదే తొలిసారి. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 15394కు చేరింది. సోమవారం కేసుల్లో అత్యధికంగా 861 గ్రేటర్‌ పరిధిలోనివే. ఇక, కరోనా కాటుకు మరో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఎస్సార్‌నగర్‌ ట్రాఫిక్‌ ఏఎస్సై (57) కూడా ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 253కు చేరింది. మరో 410 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 5582కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 9559గా ఉంది.

‘పాజిటివ్‌’ దడ
వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు నిత్యం భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పాజిటివ్‌ రేటు కూడా దడపుట్టిస్తోంది. రోజురోజుకూ ఆ శాతం పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఈ నెల 21న 25 శాతం పాజిటివ్‌ రేటు నమోదవ్వగా సోమవారానికి అది ఏకంగా 36 శాతానికి చేరింది. జూన్‌ 17 నుంచి 24 మధ్య దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ రేటులో తెలంగాణనే అగ్రస్థానంలో నిలిచింది.

Courtesy Andhrajyothi