• ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లొద్దు
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • 35వ రోజుకు ఆర్టీసీ సమ్మె
  • 11 వరకు ఎలాంటి చర్యలొద్దు.. కార్మికులను రెచ్చగొట్టొద్దు
  • పరిస్థితుల్ని దిగజార్చొద్దు.. కేబినెట్‌ నిర్ణయం రహస్యం కాదు….కోర్టు కోరితే వివరాలివ్వాల్సిందే.. ధర్మాసనం స్పష్టీకరణ

టీఎస్‌ ఆర్టీసీ అధీనంలో ఉన్న 5100 రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఈ నెల 11వ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని హైకోర్టు ఆదేశించింది. సమ్మె చేస్తున్న కార్మికులను రెచ్చగొట్టే ప్రకటనలు పరిస్థితులను మరింత దిగజార్చుతాయని హెచ్చరించింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వివరాలను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎ్‌స.ప్రసాద్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ఆర్టీసీ తరఫున కౌంటర్‌ వేయాలని అదనపు ఏజీ జె.రామచంద్రరావుకు చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణకు రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తన ముందు ఉంచాలని చెప్పింది. అప్పటిదాకా కేబినెట్‌ నిర్ణయంపై ముందుకు వెళ్లబోమని హామీ ఇస్తేనే సోమవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. రాష్ట్రమంత్రివర్గ నిర్ణయం విశిష్ట అధికార పత్రమని, దాన్ని కోర్టు పరిశీలనకు ఇవ్వలేమని అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు. కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు పిటిషనర్‌కు లేదన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు ఉంటే తప్ప కోర్టులు సైతం జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి ప్రభుత్వ కౌంటర్‌ దాఖలు చేశామని వివరించారు. అడ్వకేట్‌ జనరల్‌ వాదనల పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కేబినెట్‌ నిర్ణయమేమీ రహస్య పత్రం కాదని స్పష్టం చేసింది. రహస్య పత్రం అయినా కోర్టు కోరితే ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేబినెట్‌ నిర్ణయం ప్రజల కోసం తీసుకున్నదే అయినప్పుడు దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆన్‌లైన్లో పెట్టలేదని, బయటకు రాకుండా చేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. దాన్ని మీరే కోర్టు పరిశీలనకు ఎందుకు ఇవ్వకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. కేబినెట్‌ నిర్ణయం న్యాయబద్ధమా? కాదా? అనే నిర్ణయాన్ని కోర్టు తీసుకోక పోవచ్చని, అయితే, అదేమీ రహస్య పత్రం మాత్రం కాదని స్పష్టం చేసింది. అందులోని అంశాలను ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. కేబినెట్‌ ప్రజలకోసమే పని చేయాలని, అదేమీ ప్రత్యేకమైనది కాదని, కోర్టు కన్నా ఏదీ అధికం కాదని, కేబినెట్‌ నిర్ణయాన్ని పూర్తిగా పరిశీలించే హక్కు కోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. మంత్రివర్గ నిర్ణయంపై ప్రజాహిత వ్యాజ్యం వేయరాదన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదననూ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రజాహితం కోరి ఎవరైనా పిల్‌ వేయవచ్చని చెప్పింది. ఒకసారి పిల్‌ వేశాక పిటిషనర్‌ ఉపసంహరించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఇదే అంశంపై సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేసింది. టీఎస్‌ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలుసు. సమ్మెపై పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ న్యాయస్థానం కూడా కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరించాలన్న నిర్ణయం ఆందోళనలను మరింత విస్తృతపరచే ఆలోచనలను కార్మికుల్లో, సామాన్య ప్రజల్లో కలగజేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తదుపరి విచారణ వరకు మంత్రివర్గ నిర్ణయంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఎస్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి, ఆర్టీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

Courtsey Andhrajyothy..