• నగరం నుంచి డెంగీని తరిమికొట్టండి
  • లేకపోతే చాలా తీవ్రంగా పరిగణిస్తాం
  • ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీచేస్తాం
  • రాష్ట్ర సర్కారుకు హైకోర్టు హెచ్చరిక
  • నివారణ చర్యలు అంతంత మాత్రమే
  • క్షేత్ర స్థాయికి వెళ్లకుండా నివేదికలా?
  • వెబ్‌సైట్లోంచి డౌన్‌లోడ్‌ చేసినట్లుంది
  • ఇంత పెద్ద మహానగరం మొత్తానికి ఉండేవి 150 పొగ యంత్రాలేనా?
  • ప్రభుత్వ స్పందనపై తీవ్ర అసంతృప్తి

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు 5,914 కేసులు నమోదైనట్లు అధికార గణాంకాల్లో ఉంది. భారీ వర్షాలకు కాలనీల్లోకి, ఇళ్లలోకి మురికి నీరు చేరుతోందనే వార్తలు వింటున్నాం. వర్షాకాలానికి ముందే మురికి కాల్వలు, నాలాల్లోని చెత్తా, చెదారాలను ఎందుకు తొలగించలేదు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): డెంగీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై జీహెచ్‌ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖలు దాఖలు చేసిన కౌంటర్లలో పూర్తి వివరాలు లేవని ఆక్షేపించింది. వ్యాధి నివారణ చర్యలను యుద్ధ్ద ప్రాతిపదికన చేపడుతున్నామని అధికారులు ఇస్తున్న వివరణ ఆచరణలో కనిపించడం లేదని ఎత్తి చూపింది. అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం సెప్టెంబర్‌ మొదటి వారంలో 138 కేసులు నమోదైతే 23 నాటికి వాటి సంఖ్య 309కి చేరిందని, 22 రోజుల్లోనే సుమారు 200 శాతం రోగులు పెరిగారని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే రోగులు సంఖ్య తగ్గాల్సింది పోయి అధికం ఎలా అవుతాయని ఆక్షేపించింది. కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో వివరాలు వాస్తవికంగా లేవని వ్యాఖ్యానించింది. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న సమాచారాన్ని కోర్టుకు ఇచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించింది.

క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చినట్లయితే ఎన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి రోగులను గుర్తించారో చెప్పాలంది. నెల రోజుల్లో డెంగీ మహమ్మారిని నగరం నుంచి తరిమి కొట్టాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 5914 కేసులు నమోదైనట్లు అధికార గణాంకాల్లో ఉందని ప్రస్తావించింది. డెంగీ కేసులు తగ్గుముఖం పట్టకపోతే వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ వద్ద 150 పోర్టబుల్‌ ఫాగింగ్‌ యంత్రాలే ఉన్నాయని చెబుతున్నారని, ఇంత పెద్ద నగరంలో అవి ఏపాటని వ్యాఖ్యానించింది. భారీ వర్షాలకు కాలనీల్లోకి, ఇళ్లలోకి మురికి నీరు చేరుతోందనే వార్తలు వింటున్నామని, వర్షాకాలానికి ముందే మురికి కాల్వలు, నాలాల్లోని చెత్తా, చెదారాలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. ఉన్నత వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో కంటే మురికివాడలపై ఎక్కువ దృష్టి సారించాలని అధికారులకు తెలిపింది. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో ఫాగింగ్‌ యంత్రాలు వినియోగించాలని సూచించింది. డెంగీ నిర్థారణకు వినియోగించే ఆర్‌డీటీ కిట్స్‌ ద్వారా 80 శాతం మేర కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు నివేదికల్లో ఉందని, 100 శాతం కచ్చితమైన లేబోరేటరీ నివేదిక ‘ఎలీసా’ పరీక్ష వల్ల తేలుతుందని, ప్రైవేటు లేబొరేటరీల్లో ఈ పరీక్షకు రూ.3500 ఖర్చు అవుతున్నందున ఆ మేరకు ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చేలా చర్యలు ఉండాలని తెలిపింది.

నివారణ చర్యలు తీసుకుంటున్నామని, మరింత మెరుగైన అఫిడవిట్‌ వేస్తామని పదే పదే చెబుతున్నారని, నాలుగు వారాల నుంచి ఈ వ్యాజ్యాలపై విచారణ జరుగుతోందని, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మురికివాడల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు చేరి దోమల వృద్ధికి కారణమవుతోందని, వాటిని నివారణకు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో ఎక్కడా చెప్పలేదని ఎత్తిచూపింది. ఆసుత్రులకు వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదని పత్రికల్లో కథనాలు చూస్తున్నామని తెలిపిన ధర్మాసనం బుధవారం ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఎత్తి చూపింది. పత్రికల్లో వచ్చిన ఒక్క ఫోటో వెయ్యి పదాలతో సమానమని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణించిన రోగులు ఏ కారణంగా చనిపోయారో బయటకు చెప్పొద్దనే ఆదేశాల గురించి కథనాలు తాము చూశామని, కనీసం ఇలాంటి కథనాలు వచ్చినపుడు ప్రభుత్వం క్షేత్రసాయిలో పరిశీలించి ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయో చూడాలని తెలిపింది. వచ్చే నెల రోజుల్లో డెంగీ, ఫ్లూ, చికెన్‌ గున్యా, వైరల్‌ జ్వరాలు ప్రభలకుండా గట్టి చర్యలు చేపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేస్తామన్న ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు ఇచ్చిన సమాచారంపై ధర్మాసనం విభేదించింది. తాము ఇంటి నుంచి కోర్టు వరకు రోజు ప్రయాణం చేస్తున్నామని, అటువంటి బ్యానర్లు ఎక్కడా కన్పించలేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ. అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను 23కి వాయిదా వేసింది. డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదంటూ వైద్యురాలు ఎం.కరుణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. స్వైన్‌ ప్లూ, మలేరియా, డెంగీ జ్వరాల వ్యాప్తిపై న్యాయవాది ఆర్‌.భాస్కర్‌ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను సుమోటో పిల్‌గా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాజ్యాలు బుధవారం కోర్టుముందుకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరుఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌.. జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన అదనపు కౌంటర్‌ను కోర్టు పరిశీలనకు అందజేశారు.

అధికారులు ఇచ్చే వివరణలో అర్థసత్యాలే ఉంటున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వడం లేదని ఆక్షేపించింది. దీంతో ఏజీ వివరణ ఇస్తూ.. మెరుగైన అఫిడవిట్‌ వేస్తామని కోర్టుకు తెలిపారు. తిరిగి కల్పించుకున్న ధర్మాసనం ఎన్నిసార్లు మెరుగైన అఫిడవిట్లు వేస్తారని నిలదీసింది. రాష్ట్రంలో ఎన్ని రక్తనిధి కేంద్రాలు ప్రభుత్వ అసుపత్రులకు అందుబాటులో ఉన్నాయని ఏజీని ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. రోగుల అవసరాలకు సరిపడా రక్త నిల్వలు ఉన్నాయని ఏజీ తెలపగా, ఉన్నాయంటే సరిపోదు, ఎన్ని బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయో చెప్పాలంది. రాష్ట్రవ్యాప్తంగా 22 రక్త నిధి కేంద్రాలున్నట్లు తెలుపగా, ఏ మాత్రం సరిపోవని అభిప్రాయపడింది.

Courtesy Andhrajyothi…