• డెంగీ పరిస్థితిలో మార్పు రావాలి.. నిర్లక్ష్యం మానుకోకుంటే శిక్ష తప్పదు
  • డెంగీ మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారానికి ఆదేశిస్తాం
  • 5 లక్షలు అధికారులే భరించాల్సి ఉంటుంది.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • మా మాటా వినరా?.. శ్రీలంకకు సాధ్యమైంది మనకెందుకు కాదు?
  • ప్రాణాలు పోతుంటే మీనమేషాలా?.. నవంబరు ఆఖరుకు చక్కదిద్దాలి
  • మార్పు రాకపోతే కోర్టు ధిక్కారమే.. ఇక ప్రతివారం కేసును విచారిస్తాం
  • చర్యలు తీసుకుంటే రోగులు 500 శాతానికి ఎలా పెరిగారు?: హైకోర్టు
  • కోర్టుకు హాజరైన సీఎస్‌, ఐఏఎ్‌సలు.. ఇక నుంచి మినహాయింపు
హైదరాబాదు: డెంగీ నివారణకు అధికారులు తీసుకుంటున్న అరకొర చర్యలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ వ్యాధి సోకి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆక్షేపించింది. వర్షాకాలం ప్రారంభానికి మునుపే నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, మురికి గుంటలు గుర్తించి, దోమల లార్వా వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని నిలదీసింది. దోమల వ్యాప్తిని నివారిస్తే మరి రోగుల సంఖ్య ఎందుకు పెరిగిందని ప్రశ్నించింది. జనవరిలో 85 డెంగీ కేసులు నమోదైతే సెప్టెంబరు కల్లా అవి 3,809కి ఎలా పెరిగాయి? ఎన్ని రెట్లు పెరిగాయని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి బదులిస్తూ… సుమారు 500 శాతం ఉంటుందని తెలిపారు. అంతకంటే ఎక్కువ శాతమే పెరిగాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సకాలంలో అధికారులు నివారణా చర్యలు ప్రారంభించి ఉంటే ఇంత స్థాయిలో రోగుల సంఖ్య పెరిగేది కాదని అభిప్రాయపడింది. ఇదే ఒరవడి కొనసాగితే డెంగీ వ్యాధితో మరణించిన కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. ఇంత వరకు డెంగీ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం… ఇక మీదట సూచనలు ఉండవు.. నేరుగా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. డెంగీ వ్యాధివల్ల మరణిస్తే అధికారుల జేబునుంచే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ఉల్లంఘించిన అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. ఐఏఎ్‌సల కోసం పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు చేస్తుంటే… మీరు చేసేది ఇదా? అని నిలదీసింది. డెంగీ నివారణకు నెలరోజుల కార్యాచరణ పెట్టామని, అందులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలుగా విభజించి, తీసుకోవాల్సిన చర్యలు ప్రారంభించినట్లు సీఎస్‌ జోషి కోర్టుకు తెలిపారు. ఈ కార్యక్రమం ఎప్పడు ప్రారంభించారని ధర్మాసనం ప్రశ్నించింది. సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 మధ్య నిర్వహించామని జోషి తెలిపారు. ‘‘ఈ నెల రోజుల్లో రోగుల సంఖ్య రెండు శాతం కూడా తగ్గలేదు. నవంబరు చివరి కల్లా అధికారుల చర్యలు సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. అధికారులు తీరు మారకపోతే చూస్తూ ఉపేక్షించబోం. 2016లో శ్రీలంక వంటి చిన్న దేశం దోమలను సంపూర్ణంగా నివారించింది. హైదరాబాద్‌లో మనం సాధించలేమా?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. డెంగీ
నివారణకు తగిన చర్యలు తీసుకోడానికి ఒక కమిటీ వేయాలని ఆదేశించింది. అది ప్రతి గురువారం సమావేశం కావాలని తెలిపింది. నిపుణులతో చర్చించి తగిన చర్యలు ప్రతిపాదించాలని ఆదేశించింది. కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని స్పష్టం చేసింది. మౌంటెడ్‌ పొగ యంత్రాలను అరవైకి పెంచాలని, పవర్‌ స్ర్పేయర్‌లను వెయ్యికి పెంచాలని చెప్పింది. విచారణను ప్రతివారం తాము పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ. అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను నవంబరు 1కి వాయిదా వేసింది.

ఏది ముఖ్యం?
సమస్య జూన్‌ నుంచి ఉంటే సెప్టెంబరులో చర్యలకు ఉపక్రమిస్తే ఏం ప్రయోజనం చేకూరుతుందని హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ ఇస్తూ… ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల భూకంపం వచ్చి ప్రజలు చనిపోతుంటే ఎన్నికల కోడ్‌ అని మీనమేషాలు లెక్కిస్తారా? అని నిలదీసింది. తీవ్రమైన అంటువ్యాధులు ప్రబలకుండా నివారణా చర్యలు చేపట్టడానికి ఎన్నికల కోడ్‌ అడ్డుకాదని, అవసరమైతే ఎన్నికలనే వాయిదా వేయవచ్చని తెలిపింది. ‘‘2016లో శ్రీలంక మలేరియా కారక దోమలను సంపూర్ణంగా నివారించగలిగింది. ఆ దేశంలో మలేరియా లేదు, డెంగీ లేదు. శ్రీలంక వంటి చిన్నదేశంలో సాధ్యం అయినపుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు’’ అని ప్రశ్నించింది. వ్యాజ్యాల్లో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణకు సీఎస్‌ జోషితో సహా ఇతర ఐఏఎస్‌ అధికారుల వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు నిచ్చింది.

డెంగీతో ఇద్దరి మృతి
కరీంనగర్‌ రూరల్‌, శంషాబాద్: డెంగీ జ్వరంతో రాష్ట్రంలో గురువారం ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లాలోని దుర్శేడ్‌ గ్రామానికి చెందిన భక్తు శ్రీనివాస్‌ (34) వారం రోజులుగా డెంగీతో బాఽధపడుతున్నాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చనిపోయాడు. ఏపీలోని కడప జిల్లా నుంచి వచ్చి శంషాబాద్‌లో ఉంటున్న లక్ష్మి డెంగీ బారినపడింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

సూచనలు పట్టించుకోరా?
ప్రాణాంతకంగా మారిన డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, వ్యాధి నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలను చైతన్యపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైద్యురాలు డాక్టర్‌ ఎం.కరుణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. స్వైన్‌ ప్లూ, మలేరియా, డెంగ్యూ జ్వరాల వ్యాప్తిపై న్యాయవాది ఆర్‌.భాస్కర్‌ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను సుమోటో పిల్‌గా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌, రాష్ట్ర ఎపిడమిక్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌, అంటువ్యాధుల నివారణ సంస్థ డైరెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశిస్తూ, ‘‘ప్రజలు చనిపోతున్నారు. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతోంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదు’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. 30 రోజుల ప్రోగామ్‌ వల్ల ఏం లాభం జరిగిందని నిలదీసింది.

Courtesy Andhra Jyothy