మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవచ్చు: హైకోర్టు

హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే పొడిగించింది 15వ తేదీవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సెక్రెటేరియట్‌ కూల్చేసేందుకు రాష్ట్ర్ర మంత్రివర్గం జూన్‌ 30 తీర్మానం చేసిందని చెబుతున్న ప్రభుత్వం ఆ మేరకు తీర్మాన ప్రతిని సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో కోర్టులో జోక్యం చేసుకోరాదనే వాదనను తోసిపుచ్చింది. గతంలో క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఇదే హైకోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. సెక్రెటేరియట్‌ బిల్డింగ్స్‌ కూల్చి కొత్తగా కట్టాలని క్యాబినెట్‌ జూన్‌ 30న క్యాబినెట్‌ ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఎందుకు రహస్యంగా ఉందని ప్రశ్నించింది.

పత్రికల్లో వార్తలు కూడా రాలేదనీ, ప్రభుత్వం కూడా ప్రకటించలేదనీ, అందుకే క్యాబినెట్‌ నిర్ణయ ప్రతిని సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని కోరుతున్నామని స్పష్టం చేసింది. పర్యావరణ, సచివాలయం కాలుష్య నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం ఏ అనుమతులు లేకుండానే సెక్రెటేరియట్‌ బిల్డింగ్స్‌ కూల్చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం విచారించింది. సెక్రెటేరియట్‌ బిల్డింగ్స్‌ కూల్చేయడానికి క్యాబినెట్‌ ఫైనల్‌ డెసిషన్‌ తీసుకున్నదా? అని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించగా, అది విధాన నిర్ణయం అవుతుందనీ, కోర్టులు జోక్యం చేసుకోరాదనీ, అయినా పిల్స్‌ రాజకీయంగా వేశారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ జవాబు చెప్పారు. కూల్చివేత పనులు మధ్యలో ఆగాయనీ, దీని వల్ల ప్రమాదం ఏర్పడ వచ్చనీ, పూర్తిగా కూల్చేందుకు అనుమతి ఇవ్వాలని ఏజీ కోరారు. క్యాబినెట్‌ నిర్ణయ ప్రతిని ఈరోజే ఆందజేస్తామన్నారు. విచారణ రేపటికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించని హైకోర్టు విచారణను 15కి వాయిదా వేసింది. అంతకు ముందు పిటిషనర్‌ లాయర్‌ ప్రభాకర్‌ వాదిస్తూ, కూల్చివేతకు పొల్యూషన్‌, ఎన్విరాన్‌మెంట్స్‌ యాక్ట్‌ కింద అనుమతి తీసుకోలేదన్నారు. అనుమతులు తీసుకున్నదీ లేనిదీ ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కౌంటర్‌ వేయాలని ఆదేశించాలన్నారు.

కేంద్రం 2016లో నిర్మాణాలుుకూల్చివేతలు-వ్యర్థ పదార్థాల నిర్వహణకు ఇచ్చిన మార్గదర్శకాల్ని అమలు చేయలేదనీ, అందులోని 4(3) రూల్‌ను అమలు చేయలేదన్నారు. విచారణను 15కి వాయిదా వేసింది. సచివాలయ భవనాల్ని కూల్చేయాలనీ, కొత్తగా నిర్మాణాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం జూన్‌ 30న తీర్మానం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకుకౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత తీర్మానానికి అనుగుణంగానే తాజా తీర్మానం చేశాం.. బిల్డింగ్స్‌ కూల్చేయాలని జులై 4న ఆర్‌అండ్‌బీ అనుమతి ఇచ్చింది. ఈఎన్‌సీరిపోర్టు మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కూడా కూల్చేందుకు అనుమతి ఇచ్చారు. రాజకీయ పార్టీలకు చెందిన పిటిషనర్లు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనే హైకోర్టుకు వచ్చారు. పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్స్‌ పొలిటికల్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్స్‌గా మారకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. 2016లో, కేంద్రం జారీ చేసిన నిబంధనల్లోని 4(3)ను ఉల్లంఘించలేదు. కూల్చడం వల్ల కాలుష్య వ్యాప్తి అవుతోందనేది నిజం కాదు. హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున కూల్చరాదనీ, కొత్తగా నిర్మాణాలు చేయరాదనేదీ అవాస్తవం. 25.5 ఎకరాల్లో కొత్తగా సెక్రెటేరియట్‌ కట్టేందుకు వీలుగా పిల్స్‌ను డిస్మిస్‌ చేయాలి.. అని సీఎస్‌ కౌంటర్లో పేర్కొన్నారు.

కరోనా వైద్యసేవలకు టీచింగ్‌ హాస్పిటల్స్‌
టీచింగ్‌ హాస్పిటల్స్‌ను కూడా కరోనా వైద్య సేవలకు వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు రికార్డుల్లో నమోదు చేసిన హైకోర్టు కరోనాకు కేటాయించిన ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యసేవల గురించి వివరించేందుకు మంగళవారం విచారణకు పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హాజరుకావాలని ఆదేశించింది. టీచింగ్‌ హాస్పటల్స్‌, మిలట్రీ ఆస్పత్రులకు కరోనా వైద్యం కోసం వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ డాక్టర్‌ ఆర్‌ శ్రీవాత్సన్‌ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. వేరే ఆస్పత్రులకు వెళితే గాంధీకి పంపేస్తున్నారని దీంతో చాలా మంది గాంధీ ఆస్పత్రికే వస్తున్నారనీ, గేట్ల వద్దే ప్రాణాలు విడిచిన ఘటనలు ఉన్నాయని పిటిషనర్‌ లాయర్‌ చెప్పారు. కరోనాకు వైద్యం పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగుల నుంచి ఫీజుల్ని దోచుకుంటున్నాయని వేణుధర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను కూడా బెంచ్‌ విచారించింది. లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీని కట్టడికి తీసుకున్న చర్యలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

ఇది వైద్యుల నిర్లక్ష్యమే…
ఎర్రగడ్ద చెస్ట్‌ ఆస్పత్రిలో రవికుమార్‌ అనే వ్యక్తికి వైద్యం అందక
మరణించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యమే అవుతుందని అభిప్రాయపడింది. మొత్తం ఘటనపై వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చీఫ్‌ సెక్రటరీ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేసింది. ఆదేశించింది. రవికుమార్‌కు వెంటిలేటర్‌ అమర్చకపోవడం వల్లే మరణించాడని బీజేవైఎం నేత యశ్‌పాల్‌ గౌడ్‌ పిల్‌ దాఖలు చేశారు. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించింది. విచారణ 20కి వాయిదా వేసింది.

ప్రయివేటు ఆన్‌లైన్‌ విద్యాబోధనపై చర్యలేంటీ..?
వారంలోగా ఆన్‌లైన్‌ విద్యాబోధనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని, దీనిపై కసరత్తు చే సి మార్గదర్శకాల్ని జారీ చేస్తామని తెలిపింది. ఇంటర్‌నెట్‌ సౌకర్యాలు హైదరాబాద్‌లోనే అంతంతమాత్రంగా ఉన్నాయని, ఆదిలాబాద్‌ లాంటి గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉంటుందని బెంచ్‌ ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభించడాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ వేసిన పిల్‌ను సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ మరోసారి విచారణ చేసింది.

విద్యా సంవత్సరం ఈ నెల 31 వరకూ కేంద్రం ప్రారంభించవద్దని ఉత్తర్వులు ఇచ్చినప్పుడు, ఆన్‌లైన్‌ విద్యపై ప్రభుత్వం నిర్ణయంల తీసుకోనప్పుడు ప్రయివేట్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ వాదిస్తూ టీవీ యాంటీనా ఉంటే ఇంటర్నెట్‌ లేకపోయినా ఆన్‌లైన్‌ క్లాస్‌లు జరుపుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు.దీనిపై కల్పించుకున్న హైకోర్టు ఆదిలాబాద్‌, వరంగల్‌ లాంటి గిరిజన ప్రాంతాలున్న జిల్లాల్లో 4 గంటలు నిరంతరాయంగా కరెంటు ఉండదనీ, అక్కడ ఆన్‌లైన్‌ విద్య ఎలా సాధ్యమో చెప్పాలని కోరింది. హైకోర్టు కేసు విచారణలో మీ వాదనలే సరిగ్గా వినపడకపోవడాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది.. విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది.

Courtesy Nava Telangana