• వాయు కాలుష్యంతో కరోనా పెరిగే ముప్పు
  • బాణసంచా దుకాణాలు బంద్‌ చేయండి: హైకోర్టు
  • ఎవరైనా కాలిస్తే కఠిన చర్యలు: పోలీసు శాఖ
  • హిందూ పండగలపైనే ఆంక్షలా: వీహెచ్‌పీ, రాజాసింగ్‌

హైదరాబాద్‌ : పటాకులు లేకుండానే ఈ సారి దీపావళి జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలను తక్షణం నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. బాణసంచా దుకాణాలను మూసివేయాలని తేల్చిచెప్పింది. పటాకుల వల్ల వాయుకాలుష్యం పెరిగి.. పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలని సూచించింది. ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. బాణసంచాను నిషేధించాలంటూ కూకట్‌పల్లికి చెందిన ఇంద్రప్రకాశ్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది.

ప్రస్తుతం రాష్ట్రం, దేశం కొవిడ్‌-19తో పోరాటం చేస్తున్నాయని, ఈ మహమ్మారి శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో బాణసంచా వినియోగంతో కాలుష్యం మరింత పెరుగుతుందని, ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇప్పటికే బాణసంచాపై నిషేధం విధించాయని గుర్తుచేసింది. బాణసంచా వల్ల వచ్చే వాయు కాలుష్యంతో కరోనా కేసులు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.

‘‘సామాజిక పరంగా పండుగలు ముఖ్యమైనవే. అయితే.. ప్రాణాలు అంతకంటేముఖ్యం. ప్రజల ప్రాణాల భద్రతకే ప్రభుత్వా లు కట్టుబడి ఉండాలి. అడ్డూఅదుపూ లేకుండా పోతున్న బాణసంచా వినియోగం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. అందుకే.. తక్షణం రాష్ట్రంలోని బాణసంచా దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారో పేర్కొంటూ ఈ నెల 19 కోర్టుకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

అంతకు ముం దు పిటిషనర్‌ తన వాదనలను వినిపిస్తూ.. ‘‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలి. పటాకులు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు’’ అని అన్నారు.

పోలీసు శాఖ ఆదేశాలు జారీ
రాష్ట్రంలో టపాసులు అమ్మినా, కొన్నా, కాల్చినా కఠిన చర్యలు తప్పవని పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, ఇతర కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

వీహెచ్‌పీ ఆగ్రహం
మంగళ్‌హాట్‌: హిందూ పండుగలను టార్గెట్‌ చేయడం సరికాదని విశ్వహిం దూ పరిషత్‌ మండిపడింది. కాలుష్యా న్ని అరికట్టాలంటే.. ముందు ప్రభుత్వ కార్యాలయా ల్లో ఏసీలను తీసివేయాలని, ఏటా కాలుష్య కారకాలపై శ్వేతపత్రం విడుదల చే యాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ డిమాండ్‌ చేశారు.

హిందూ పండుగల సమయంలోనే పర్యావరణం గుర్తుకువచ్చే మేధావులకు ఇతర మతస్థుల పండుగల సందర్భంగా జరిగే జీవ హింస గుర్తుకు రాదా? అని వీహెచ్‌పీ  రాష్ట్ర మీడియా కన్వీనర్‌ ఎస్‌.కైలాష్‌ ప్రశ్నించారు. పటాకులను నిషేధించిన వారు.. గోవధ నిషేధాన్ని ఎందుకు అమలు చేయరని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. హిందువులను వేధిస్తే.. టీఆర్‌ఎ్‌సకు దుబ్బాక గతే పడుతుందని హెచ్చరించారు.

Courtesy Andhrajyothi