హైదరాబాద్‌: ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎప్పుడంటే అప్పుడు పెన్షన్‌లో కోత విధించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలంగాణ హైకోర్టు గుర్తు చేసింది. కరోనా లాక్‌డౌన్‌లో పెన్షన్‌లో కోత పెట్టే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, ఏ చట్టం ప్రకారం పెన్షన్‌లో కోత విధించారో చెప్పాలని కోరింది. దీనిపై వచ్చే నెల మొదటి వారం వరకూ వాయిదా వేస్తే పూర్తి వివరాలి స్తామని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇప్పటికే చాలా వాయిదాలు వేశామనీ, అప్పటి వరకూ వాయిదా వేస్తే ఈ నెల కూడా కోత విధించి పెన్షన్‌ ఇస్తారా అని ప్రశ్నించింది.

లాక్‌డౌన్‌ కారణంగా పెన్షన్‌లో కోత పెట్టే లా ప్రభుత్వం ఇచ్చిన జీవో 27న సవాల్‌ చేస్తూ రాష్ట్ర పెన్షనర్స్‌ జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య, రిటైర్డు ఏఈ లక్ష్మీనారాయణ, రిటైర్డు హెడ్మాస్టర్‌ నారాయణ వేసిన పిల్స్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. కేంద్రం జీఎస్‌టీ వాటా చెల్లించలేదని ఏజీ చెప్పగానే కల్పించుకున్న హైకోర్టు అలాగని ప్రభుత్వం మరో తప్పు చేయకూడదని చెప్పింది. పిల్స్‌పై విచారణ వాయిదా వేస్తూనే ఉన్నా మని, ఇక వాయిదా వేయబోమని, 2 రోజుల్లోగా ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ 17కి వాయిదా వేసింది.

వృద్ధాశ్రమాలపై నివేదిక సమర్పిచండి
వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలను అధికారులు తనిఖీలు చేయకుండా ఉదాశీనంగా ఉండటంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. వృద్ధాశ్రమాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. సాంఘిక సంక్షేమ, మహి ళా శిక్ష సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, వారంతరాల్లో రాత్రిళ్లు అక్కడే బస చేయాలని ఆదేశించింది. తనిఖీల్లోనూ బస చేసినప్పుడు చూసిన సమస్యలను పరిష్కరించేం దుకు చర్యలు తీసుకోవాలనీ, వసతులు లేకుండా హౌమ్స్‌ నిర్వహిస్తే వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవడమో సూచనలు చేయడమో ఎందుకు చేయడం లేదని అడిగింది. వోల్డేజ్‌ హౌంలు దయనీ యంగా ఉన్నాయని అమికస్‌క్యూరీగా నియమితులైన లాయర్‌ వసుధా నాగరాజ్‌ ఇచ్చిన రిపోర్టు చూసిన బెంచ్‌ ఆశ్చర్యాని వ్యక్తంచేసింది. తక్షణమే క్షేత్రస్థాయి లో పరిస్థితులను అధ్యయనం చేసి సంస్కరణల దిశగా అడుగులు వేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ సోమవారం ఆదేశించింది.

హైదరాబాద్‌లోని నాగారంలోని మమత వృద్ధాశ్రమంలో కనీస సౌకర్యాలు లేవంటూ న్యాయ సేవాధికార సంస్థ రాసిన లెటర్‌ను హైకోర్టు పిల్‌గా తీసుకుని విచారణ జరిపింది. ఈ హౌంల్లో పేద వారు ఉంటారని, వారు ఎవరికీ చెప్పులేరని అనుకుంటే హైకోర్టు కళ్లు మూసుకుని ఉండదని చెప్పింది. వృద్ధాశ్రమాల్ని నిర్వహిస్తున్న పెద్దలు తప్పులు చేస్తుంటే అధికారులు పట్టించుకోక పోవడం క్షంతవ్యం కాదని వ్యాఖ్యానించింది. కేటాయించిన నిధులు ఏమౌతున్నాయో, వివిధ సంస్థలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు ఏం చేస్తున్నారో తేల్చాలని పేర్కొంది. వీళ్ల రక్షణ, మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆదేశించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో రిజిస్టర్‌ చేసినవి చేయనవి ఎన్ని హౌమ్స్‌ ఉన్నాయో తేల్చాలని, వాటిలో ఉన్న వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆశ్రమాల్లోని వారి కష్టనష్టాలు తెలియజేసేందుకు వెంటనే ప్రభుత్వం హాట్‌లైన్‌, హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయాలని, దీని గురించి మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.

హౌంల్లోని వారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆయా పీఎస్‌ల ద్వారా విచారణ చేసి చర్యలు తీసుకోవాలంది. కార్పొరేట్‌ సంస్థలకు వాస్తవ పరిస్థితులు తెలిపి సాయం పొందే దిశగా చర్యలు తీసుకోవాలనీ, ఆ సంస్థల సామాజిక బాధ్యతలను వినియోగించుకోవాలని సూచన చేసింది. రిపోర్టు లోని అంశాల్ని బెంచ్‌ ప్రస్తావిస్తూ, ఒక ఆశ్రమంలో మూడు గదుల్లో 24 మంది వృద్ధులున్నారనీ, గాలి లేకుండా నడిచేందుకు దారి లేకుండా మరుగుదొడ్లు లేకుండా ఉన్నారంటే అక్కడున్న వారికి గాలి వెలుతురు ఏముంటుందని ప్రశ్నించింది. మరో ఆశ్రమంలో మంచాల మధ్య నడిచే దారి లేదంటే వృద్ధులు ఎలా బయటకు వెళ్లగలరని నిలదీసింది. అధికారులు ఎన్ని సార్లు తనిఖీలు చేశారో, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వ వాదనలను కౌంటర్‌ పిటిషన్‌ ద్వారా తెలియజేయాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను ఆదేశించింది.

Courtesy Nava Telangana