• కోర్టులో తేలాకే నిర్ణయం
  • 5 వేల కోట్ల అప్పు.. తక్షణం కట్టాల్సినవి 2 వేల కోట్లు
  • ప్రతి నెలా 640 కోట్లు కావాలి.. ఎక్కడి నుంచి తెచ్చేది?
  • సర్కారుకు భరించే శక్తి లేదు.. ఇలా నడపడం కుదరదు
  • రూట్ల ప్రైవేటుపై నేడు తీర్పు.. దాన్నిబట్టే తుది నిర్ణయం
  • కేసులపై అధ్యయనం.. సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: ఆర్టీసీకి ఎంతోకొంత డబ్బులిచ్చి తాత్కాలికంగా ఆదుకోవడం కాకుండా దానికి శాశ్వత పరిష్కారం చూపడమే మార్గమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సంస్థను యథాతథంగా నడపాలంటే నెలకు రూ.640 కోట్ల భారాన్ని మోయాలి. ఈ శక్తి అటు ఆర్టీసీకి గానీ, ఇటు ప్రభుత్వానికి గానీ లేవన్నది స్పష్టమైన విషయం. అందుకే, శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపైనే గురువారం విస్తృతంగా చర్చలు జరిపింది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో చర్చ జరిగింది. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థిక, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌శర్మ, న్యాయ శాఖ కార్యదర్శి సంతో్‌షరెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందరరావు, రవాణా శాఖ కమిషనర్‌ సందీ్‌పకుమార్‌ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్లకుపైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబరు మాసానికి సంబంధించి మొత్తం వేతనాలు చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎ్‌సకు రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. సంస్థలోని 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65-70 కోట వరకు చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం భరించే పరిస్థితి లేదు. ఎంతో కొంత సాయం చేసినా, అది ఎంతవరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని ఎప్పటిలాగా యఽథావిధిగా నడపడం సాధ్యం కాదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

షరతులు తప్పవు
ఆర్టీసీ కార్మికులకు ఇంకా నిరీక్షణ తప్పేటట్లు లేదు. గురువారం నాటి సీఎం సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఇంకా వేచి చూడక తప్పదేమోనని తెలుస్తోంది. పైగా తాను తీసుకొచ్చే మార్పులకు అంగీకరిస్తేనే ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ము ఖ్యంగా ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం కొంత నిక్కచ్చిగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఆర్టీసీని ప్రక్షాళన చేయాలన్న ఆలోచనతో ఉంది. ఇలాంటివాటన్నంటినీ కార్మికుల ముందు ఉంచుతుందని తెలిసింది. శుక్రవారం కోర్టులో రూట్ల ప్రైవేటీకరణ అంశం తేలిపోయే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. అప్పుడే తుది నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి కార్మికులు 48 రోజుల పాటుగా సమ్మెను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

కానీ, ప్రభుత్వం సమ్మెను పరిష్కరించడానికి ముందుకు రాలేదు. దాంతో కార్మికులే దిగివచ్చారు. ఎలాంటి షరతులు పెట్టకుండా విధుల్లోకి తీసుకుంటే వచ్చి చేరుతామంటూ జేఏసీ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో సీఎం సమీక్ష జరిగింది. కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశం చర్చకు వచ్చినప్పటికీ అంత ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిసింది. శుక్రవారం హైకోర్టులో రూట్ల ప్రైవేటీకరణపై తీర్పు వెలువడుతుందని, ఆ తర్వాతే విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం భావించినట్లు సమాచారం.

Courtesy AndhraJyothy…